/rtv/media/media_files/2026/04/14/latest-news-2026-04-14-16-10-42.jpg)
El Nino effect on agriculture sector
SUPER EL NINO : దేశవ్యాప్తంగా వ్యవసాయ పనులు ఊపందుకోబోతున్నాయి. కోట్లాది మంది రైతులు ఖరీఫ్ సీజన్ కోసం రెడీ అవుతున్నారు. ఇప్పటికే విత్తనాలు, ఎరువుల సేకరణలో అన్నదాతలు బిజీగా ఉన్నారు. అయితే, సరిగ్గా ఇదే సమయంలో భారత వాతావరణ శాఖ షాకిచ్చే వార్త చెప్పింది. అదే.. సూపర్ ఎల్ నినో ఎఫెక్ట్. అంటే ఈ ఏడాది దేశంలో తీవ్ర కరువు పరిస్థితులు రాబోతున్నాయన్న మాట.
పసిఫిక్ మహాసముద్రంలో వేగంగా మారుతున్న పరిస్థితులు, రాబోయే రుతుపవనాలపై తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఇదే ఈ సూపర్ ఎల్ నినో ఎఫెక్ట్. జూన్ నుంచి ప్రారంభమయ్యే ఖరీఫ్ సాగుపై ఈ ప్రభావం ఎలా ఉండబోతోంది..? ముఖ్యంగా తెలంగాణ, ఏపీ రైతులు ఎందుకు అప్రమత్తంగా ఉండాలి.? వాతావరణ శాఖ అసలు ఏం చెబుతోంది? ఒకసారి తెలుసుకుందాం..
భారత వ్యవసాయ రంగం ప్రధానంగా రుతుపవనాలపైనే ఆధారపడి ఉంటుంది. అయితే, ఈ ఏడాది సూపర్ ఎల్‌నినో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. మన దేశంలో జరిగే మొత్తం ఆహార ఉత్పత్తిలో 50 శాతానికి పైగా కేవలం ఖరీఫ్ సీజన్ నుంచే వస్తుంది. ఎల్ నినో వల్ల వర్షాలు 10 నుంచి 15 రోజులు ఆలస్యమైతే, అది మొత్తం క్రాప్ సైకిల్‌పై తీవ్ర ప్రభావం చూపుతుంది.
అసలు ఎల్‌నినో అంటే ఏంటి..? అది ఎందుకు వస్తుంది?
సాధారణంగా పసిఫిక్ సముద్రం వద్ద గాలులు చల్లగా ఉండి, మన భూభాగం వైపు వాన మేఘాలను మోసుకొస్తాయి. దీనివల్ల మనకు సకాలంలో వర్షాలు కురుస్తాయి. అయితే, ఒక్కోసారి సముద్రంలో కొన్ని మార్పులు సంభవించి, సముద్రపు ఉపరితల నీరు అసాధారణంగా వేడెక్కిపోతుంది. ఇలా వేడెక్కడాన్నే 'ఎల్‌నినో' అంటారు. సముద్రం ఇలా వేడెక్కినప్పుడు, మన వైపు రావాల్సిన వాన గాలులు దారి తప్పి వేరే దేశాల వైపు వెళ్లిపోతాయి. ఫలితంగా మన దేశంలో వర్షాలు తగ్గుతాయి. అయితే, ఇప్పుడు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నది సాధారణ ఎల్‌నినో కాదు.. 'సూపర్ ఎల్‌నినో'. అంటే సాధారణ ఎల్‌నినో కంటే సముద్రం మరింత ఎక్కువగా వేడెక్కుతుందన్నమాట. ఇది సంభవిస్తే కరువు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.
మన దేశానికి నైరుతి రుతుపవనాలే ప్రాణాధారం. జూన్ నెల రాగానే రైతులు ఆశగా ఆకాశం వైపు చూస్తారు. కానీ ఎల్ నినో ప్రభావం ఉన్నప్పుడు రుతుపవనాలు ఆలస్యమవుతాయి. జూన్ మొదటి వారంలో రావాల్సిన వానలు.. జూలై వరకు రాకపోవచ్చు. పడాల్సిన వర్షపాతంలో 10 నుంచి 20 శాతం లోటు ఏర్పడే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా గాలిలో తేమ తగ్గిపోయి, ఎండలు మండిపోతాయి.
ఇక తెలుగు రాష్ట్రాల పరిస్థితి చూస్తే.. తెలంగాణలో వర్షాధార పంటలు ఎక్కువ. ఎల్‌నినో తీవ్రత పెరిగితే భూగర్భ జలాలు తగ్గి, బోర్లలో సైతం నీళ్లు అడుగంటిపోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే.. రాయలసీమలో పరిస్థితి కొంత ఇబ్బందికరంగా మారొచ్చు. అనంతపురం, కర్నూలు వంటి జిల్లాల్లో వర్షాలు తగ్గితే వేరుశనగ పంట దెబ్బతింటుంది. అటు కోస్తా జిల్లాల్లోనూ కాలువలకు సాగునీటి విడుదల ఆలస్యం కావచ్చు.
సాధారణంగా జూన్, జూలైలో వేసిన విత్తనం మొలకెత్తడానికి భూమిలో తగినంత తేమ ఉండాలి. ఒకవేళ తొలి వానలకు విత్తనం వేసినా, ఆ తర్వాత 15-20 రోజుల పాటు వర్షం గ్యాప్ ఇస్తే.. ఆ మొలకలు ఎండిపోయే ప్రమాదం ఉంది. భారత వాతావరణ శాఖ శాటిలైట్ల ద్వారా ఈ పరిస్థితులను నిరంతరం గమనిస్తోంది. వారి లెక్కల ప్రకారం.. ఈసారి ఎల్ నినో ప్రభావం కచ్చితంగా ఉంటుంది. అయితే, ఒక చిన్న ఆశ ఏంటంటే.. సముద్రంలో 'ఇండియన్ ఓషన్ డైపోల్' (IOD) అనే మరో మార్పు గనుక మనకు అనుకూలంగా ఉంటే, ఎల్ నినో ఉన్నప్పటికీ వర్షాలు ఓ మోస్తరుగా కురిసే ఛాన్స్ ఉంది. కానీ, ప్రస్తుతానికైతే మనం ముందు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
రైతులకు మా సూచన ఏంటంటే..తొలి వాన పడగానే హడావుడిగా విత్తనాలు వేయకండి. భూమి కనీసం అర అడుగు లోతు వరకు పదును అయ్యేంత వరకు వేచి చూడటం మంచిది. అలాగే, ఈ పరిస్థితుల్లో వరి కంటే ఆరుతడి పంటలు సాగు చేయడం ఉత్తమం. పొలంలో తేమ ఆరిపోకుండా ఉండటానికి 'మల్చింగ్' వంటి ఆధునిక పద్ధతులను పాటించండి.
Follow Us