DK Shivakumar : సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఎన్నిక..జూన్‌ 3న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం..!

కర్ణాటక రాజకీయాల్లో నాయకత్వ మార్పు ప్రక్రియ క్లైమాక్స్‌కు చేరింది. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టనున్న ఉపముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ (DKS) శనివారం అధికారికంగా కాంగ్రెస్ శాసనసభా పక్ష (CLP) నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

New Update
DK Shiva Kumar Responds on CM Change Allegations in Karnataka

Karnataka CM DK Shiva Kumar

DK Shivakumar : కర్ణాటక రాజకీయాల్లో కీలకమైన నాయకత్వ మార్పు ప్రక్రియ క్లైమాక్స్‌కు చేరింది. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టడానికి సిద్ధమవుతున్న ఉపముఖ్యమంత్రి, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డీకే శివకుమార్ (DKS) శనివారం అధికారికంగా కాంగ్రెస్ శాసనసభా పక్ష (CLP) నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ పరిణామంతో గత కొంతకాలంగా సాగుతున్న అధికార పంపకాల ఊహాగానాలకు పూర్తి తెరపడటమే కాకుండా, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది.

శనివారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో విధాన సౌధలోని అసెంబ్లీ కాన్ఫరెన్స్ హాల్లో కాంగ్రెస్ లెజిస్లేటర్ పార్టీ సమావేశం అత్యంత ఉత్కంఠభరితంగా జరిగింది. ఈ సమావేశంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్వయంగా డీకే శివకుమార్ పేరును సీఎల్పీ నేతగా ప్రతిపాదించగా, సీనియర్ నేత జి.పరమేశ్వర దానిని బలపరిచారు. అక్కడ హాజరైన ఎమ్మెల్యేలందరూ ఈ నిర్ణయానికి ఏకగ్రీవంగా మద్దతు పలికారు. కాంగ్రెస్ కేంద్ర పరిశీలకులు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, కర్ణాటక వ్యవహారాల ఇన్‌చార్జి రణ్‌దీప్ సూర్జేవాలాల సమక్షంలో ఈ ఎన్నిక ప్రక్రియ సజావుగా ముగిసింది.

సీఎల్పీ సమావేశానికి ముందు విధాన సౌధకు చేరుకున్న డీకే శివకుమార్‌కు ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా జూన్ 3న ప్రమాణస్వీకారం చేయనున్నారా అని మీడియా ప్రశ్నించగా, ఆయన చిరునవ్వుతో 'థర్డ్.. థర్డ్' (జూన్ 3) అంటూ ధృవీకరించారు. అనంతరం ప్రజాస్వామ్య దేవాలయమైన విధాన సౌధ మెట్లకు భక్తిశ్రద్ధలతో నమస్కరించి ఆయన లోపలికి అడుగుపెట్టారు. సీఎల్పీ నేతగా ఎన్నికైన అనంతరం, డీకే శివకుమార్ గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్‌ను కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు తనను ఆహ్వానించాల్సిందిగా కోరారు.

మరోవైపు, నూతన మంత్రివర్గ ఏర్పాటులో డీకే శివకుమార్ తనదైన పట్టు సాధిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వంలో నలుగురు ఉప ముఖ్యమంత్రులను నియమించాలనే ప్రతిపాదనను ఆయన కేంద్ర అధిష్ఠానం వద్ద సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. కర్ణాటక కాంగ్రెస్‌లో ఎంతోమంది సీనియర్లు ఉన్నారని, కొందరికి మాత్రమే ఆ పదవులు ఇస్తే పార్టీ శ్రేణుల్లో అనవసర అసంతృప్తి తలెత్తే ప్రమాదం ఉందని ఆయన అధిష్ఠానానికి వివరించినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. జూన్ 3న బెంగళూరులోని లోక్‌భవన్ గ్లాస్ హౌస్‌లో జరిగే వేడుకలో డీకే శివకుమార్‌తో పాటు కేవలం కొద్దిమంది మంత్రులు మాత్రమే ప్రాథమికంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Advertisment
తాజా కథనాలు