TVలో యాడ్స్ గోల.. హైకోర్టు సంచలన తీర్పు.. ప్రేక్షకులకు భారీ ఊరట

మనం ఇంట్లో కూర్చుని టీవీలో ఏదైనా సినిమానో, సీరియలో లేదా వార్తలో చూస్తున్నప్పుడు.. మధ్యమధ్యలో వచ్చే లెక్కలేనన్ని యాడ్స్ వస్తుంటాయి. అయితే ఈ యాడ్స్ గోలపై ఢిల్లీ హైకోర్టు ఒక సంచలన తీర్పునిచ్చింది.

New Update
delhi high court

మనం ఇంట్లో కూర్చుని టీవీలో ఏదైనా సినిమానో, సీరియలో లేదా వార్తలో చూస్తున్నప్పుడు.. మధ్యమధ్యలో వచ్చే లెక్కలేనన్ని యాడ్స్ వస్తుంటాయి. అయితే ఈ యాడ్స్ గోలపై ఢిల్లీ హైకోర్టు ఒక సంచలన తీర్పునిచ్చింది. టీవీ ఛానళ్లలో గంటకు 12 నిమిషాల కంటే ఎక్కువ సమయం యాడ్స్ వేయకూడదంటూ టెలికాం నియంత్రణ సంస్థ తెచ్చిన నిబంధనలు వంద శాతం కరెక్టేనని కోర్టు స్పష్టం చేసింది.

ఈ నిబంధనలను సవాల్ చేస్తూ సన్ టీవీ నెట్‌వర్క్, 9ఎక్స్ మీడియా, బి4యు బ్రాడ్‌బ్యాండ్ తో పాటుగా పలు న్యూస్ ఛానళ్ల అసోసియేషన్లతో కూడిన 17 గ్రూపులు కోర్టులో పిటిషన్లు వేశాయి. యాడ్స్ తగ్గించడం వల్ల తమ ఆదాయం దెబ్బతింటుందని, వ్యాపారం చేసుకునే తమ హక్కులకు భంగం కలుగుతుందని ఛానళ్ల యాజమాన్యాలు వాదించాయి. అయితే, జస్టిస్ అనిల్ క్షేత్రపాల్, జస్టిస్ అమిత్ మహాజన్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లన్నింటినీ కొట్టేసింది. 

ఛానళ్లకు గట్టిగా వార్నింగ్

వ్యాపారంలో లాభాలు సంపాదించుకోవడానికి లేదా ప్రభుత్వానికి చెందిన ప్రజా వనరులను ఇష్టమొచ్చినట్లు వాడుకోవడానికి రాజ్యాంగం ఎలాంటి గ్యారెంటీ ఇవ్వదని కోర్టు ఛానళ్లకు గట్టిగా చెప్పింది.  ఒక గంట వ్యవధిలో గరిష్టంగా 10 నిమిషాల కమర్షియల్ యాడ్స్, మరో 2 నిమిషాల పాటు ఆ ఛానల్‌కు సంబంధించిన ప్రమోషన్లు మాత్రమే వేసుకోవచ్చని స్పష్టం చేసింది.

మరోవైపు ఛానళ్ల యాజమాన్యాలు మాట్లాడుతూ.. ట్రాయ్ కి ఇలాంటి రూల్స్ పెట్టే అధికారం లేదని వాదించాయి. కానీ కోర్టు దానిని ఒప్పుకోలేదు. టీవీ చూసే ప్రేక్షకుల అనుభవం కూడా సేవల నాణ్యత కిందకే వస్తుందని, కాబట్టి నిరంతర ప్రకటనలతో ప్రేక్షకులను వేధించకుండా చూసే అధికారం ట్రాయ్కు ఉందని స్పష్టం చేసింది. ఈ నియమం న్యూస్ ఛానళ్లు, ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లు, ఫ్రీ ఛానళ్లు, పెయిడ్ ఛానళ్లు.. ఇలా అన్నింటికీ సమానంగా వర్తిస్తుందని ఢిల్లీ హైకోర్టు తన తీర్పులో తేల్చి చెప్పింది. ఈ తీర్పుతో ఇకపై టీవీల్లో యాడ్స్ లెంత్ తగ్గి, ప్రేక్షకులకు కొంత ఉపశమనం లభించనుంది.

Advertisment
తాజా కథనాలు