/rtv/media/media_files/2025/10/18/punjab-train-fire-accident-2025-10-18-09-41-46.jpg)
train Fire Accident
Fire incidents in trains : దేశంలో ఇటీవల వరుసగా జరిగిన రైలు అగ్నిప్రమాదాల వెనుక పెను కుట్ర దాగి ఉందని రైల్వే మంత్రిత్వ శాఖ సంచలన ప్రకటన చేసింది. ఈ ప్రమాదాలు సాంకేతిక లోపాల వల్లో లేదా ప్రమాదవశాత్తో జరిగినవి కావని, వీటి వెనుక అసాంఘిక శక్తుల (Anti-social elements) ప్రమేయం స్పష్టంగా ఉందని పేర్కొంది. రైల్వే శాఖ అంతర్గతంగా నిర్వహించిన లోతైన విచారణలో ఈ దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేశంలో రైల్వే వ్యవస్థను, ప్రయాణికుల భద్రతను లక్ష్యంగా చేసుకుని కొందరు దుండగులు ఉద్దేశపూర్వకంగానే ఈ దాడులకు పాల్పడినట్లు అధికారులు ధృవీకరించారు.
ఇటీవలి కాలంలో రాజస్థాన్‌లోని అమర్‌పుర, కోటా, బిహార్‌లోని ససరాం, పశ్చిమ బెంగాల్‌లోని హౌరా ప్రాంతాలలో నాలుగు వేర్వేరు రైళ్లలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ వరుస ఘటనలను తీవ్రంగా పరిగణించిన రైల్వే శాఖ.. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) , ప్రత్యేక నిపుణుల బృందాలతో సమగ్ర దర్యాప్తు జరిపించింది. ఈ నాలుగు ఘటనల తీరును క్షుణ్ణంగా పరిశీలించిన ఆర్పీఎఫ్ బృందాలు.. రైళ్లను తగులబెట్టడానికి దుండగులు వేర్వేరు పద్ధతులను అవలంబించినట్లు గుర్తించి, కీలక ఆధారాలను సేకరించాయి.
నాలుగు ఘటనల్లో దర్యాప్తు సంస్థలు గుర్తించిన ముఖ్యాంశాలు:
అమరపుర ఘటన: రైలు బోగీల్లో ప్రయాణికులకు ఇచ్చే బెడ్డింగ్ మెటీరియల్ (దుప్పట్లు, దిండ్లు) ఒకచోట చేర్చి, దానికి ఉద్దేశపూర్వకంగానే నిప్పు పెట్టినట్లు దర్యాప్తులో తేలింది.
హౌరా ఘటన: ఇక్కడ కుట్రదారులు మరింత ఘోరానికి ఒడిగట్టారు. పెట్రోల్‌లో పూర్తిగా ముంచిన ఒక గుడ్డను (క్లాత్) బోగీలోని బాత్‌రూమ్‌లో ఉంచి తగలబెట్టారు. తద్వారా మంటలు వేగంగా వ్యాపించేలా ప్లాన్ చేశారు.
కోటా రాజధాని ఎక్స్‌ప్రెస్: అత్యంత ప్రతిష్టాత్మకమైన రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలులో సైతం హౌరా తరహాలోనే వ్యూహం అమలు చేశారు. ఇందులో కూడా బాత్‌రూమ్ నుంచే మంటలు మొదలైనట్లు అధికారులు గుర్తించారు.
ససరాం ఘటన: బిహార్‌లోని ససరాంలో ఒక ఖాళీ రైలు బోగీని లక్ష్యంగా చేసుకున్నారు. రైలు ఆగిన సమయంలో ఒక గుర్తుతెలియని వ్యక్తి మండే వస్తువును కిటికీ గుండా లోపలికి విసిరినట్లు దర్యాప్తులో ఆధారాలతో సహా తేలింది.
ఈ ఘాతుకాల నేపథ్యంలో రైల్వే శాఖ ప్రయాణికులను తీవ్రంగా అప్రమత్తం చేసింది. రైల్వే ప్రాంగణాల్లో గానీ, ప్రయాణించే బోగీల్లో గానీ ఎవరైనా అనుమానాస్పదంగా ప్రవర్తించినా, లేదా ఏదైనా వస్తువును వదిలివెళ్లినా తక్షణమే రైల్వే అధికారిక హెల్ప్‌లైన్ నంబర్ '139' కి ఫోన్ చేసి సమాచారం అందించాలని విజ్ఞప్తి చేసింది. ప్రయాణికుల ప్రాణాలకు, వారి ఆస్తుల భద్రతకు రైల్వేశాఖ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేస్తూ.. ఇలాంటి విద్రోహ చర్యలకు పాల్పడే అసాంఘిక శక్తులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని, వారిపై కఠిన చట్టాల కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
Follow Us