దేశంలో జనగణన.. తెలంగాణ, ఏపీతో పాటు ఆ రాష్ట్రాలకు ఊహించని దెబ్బ !

2025లో జనగణన, 2028 నాటికి లోక్‌సభ పునర్విభజన ప్రక్రియ ముగుస్తుందని పలు సంబంధిత వర్గాలు చెప్పిన సంగతి తెలిసిందే. డిలిమిటేషన్ ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి.

New Update
Census

భారత్‌లో 2025లో జగనగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందని సంబంధిత వర్గాలు సోమవారం వెల్లడించిన సంగతి తెలిసిందే. 2025లో జనగణన ప్రారంభమై 2026 వరకు కొనసాగుతుందని తెలిపాయి. ఆ తర్వాత లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ మొదలై 2028కి ముగుస్తుందని తెలిపాయి. జనాభా ఆధారంగా లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన జరిగినట్లైతే దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఉత్తరాది రాష్ట్రాలకే దీనివల్ల అనుకూల పరిస్థితులు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. 

దక్షిణాది రాష్ట్రాలకు నష్టం

వాస్తవానికి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 82, ఆర్టికల్ 170 ప్రకారం.. దేశంలో ప్రతి పదేళ్లకొకసారి జనగణన నిర్వహించాలి. జనాభా నిష్పత్తి ఆధారంగానే లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల సరిహద్దులు నిర్ణయించాలి. అలాగే రిజర్వేషన్లు మారుస్తూ నియోజకవర్గాల సంఖ్యపై నిర్ణయం తీసుకునేందుకు పునర్విభజన కమిషన్ కూడా ఏర్పాటుచేస్తారు. అయితే గత 50 ఏళ్లుగా నియోజకవర్గాల విభజన జరగలేదు. గతంలో కుటుంబ నియంత్రణ పాటించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు సూచించాయి. వీటిని దక్షిణాది రాష్ట్రాలు పాటించాయి. ఉత్తరాది రాష్ట్రాలు పాటించలేదు. అందుకే ప్రస్తుత జనాభా పరంగా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

Also Read: మహిళా జర్నలిస్టు ఒడిలో కూర్చున్న మాజీ ఎమ్మెల్యే!

50 ఏళ్లుగా ఆగిపోయిన పక్రియ

ఇప్పటిదాకా దేశంలో 1952, 1963, 1973, 2002లో.. కేవలం నాలుగుసార్లు మాత్రమే నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. ప్రస్తుతం మనకున్న నియోజకవర్గాల సంఖ్యను 1971 జనాభా లెక్కల ఆధారంగా 1973లో నిర్ణయించడం జరిగింది. అప్పట్లో దేశంలో జనాభా పెరుగుదల ప్రమాదకంగా మారుతుందని భావించిన కేంద్రం.. జనాభా నియంత్రణ జరగాలనే ఉద్దేశంతో 1976లో 42వ రాజ్యాంగ సవరణ చేసింది. దీంతో ఈ నియోజకవర్గాల పునర్వభిజన ప్రక్రియను 2001 వరకు నిలిపివేసింది. అయితే 2002లో పునర్విభజన జరపాలని అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే సర్కార్ భావించింది. కానీ దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయని దక్షిణాదికి చెందిన మిత్రపక్ష పార్టీలు ఈ ప్రక్రియను అడ్డుకున్నాయి. దీంతో ఈ నిషేధాన్ని 2026 వరకు పొడిగించారు. ఇలా మొత్తం గత 50 ఏళ్లుగా దేశంలో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ఆగిపోయింది. 

ఉత్తర భారత్‌కు ఎక్కువ స్థానాలు

ఒకవేళ 2025 జనాభా ప్రతిపాదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు మొత్తం కలిపి 165 స్థానాలు మాత్రమే ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. మిగిలిన 24 రాష్ట్రాలకు 683 స్థానాలు ఉంటాయని చెబుతున్నారు. ఇందులో ఎక్కువ స్థానాలు ఉత్తర భారత్‌కే వెళ్తాయి. ఇక తెలంగాణలో ప్రస్తుతం 17 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. డిలిమిటేషన్‌లో కేవలం మూడు లేదా నాలుగు స్థానాలు పెరిగే ఛాన్స్ ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక ఏపీలో ప్రస్తుతం 25 ఎంపీ స్థానాలు ఉండగా.. అక్కడ కూడా కేవలం నాలుగు లేదా ఐదు స్థానాలు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.  

దేశ విభజనకు దారి తీస్తోందా ?    

మరోవైపు ఉత్తరప్రదేశ్‌లో 63 స్థానాలు పెరిగి 143 స్థానాలు అవుతాయని చెబుతున్నారు. దీనివల్ల యూపీ, రాజస్థాన్, బీహార్, మహారాష్ట్ర ఈ నాలుగు రాష్ట్రాల్లో ఎక్కువ సీట్లు సాధించినా దేశంలో అధికారంలోకి రావొచ్చు. దీనివల్ల దక్షిణాది రాష్ట్రాలకు దేశాన్ని పాలించే అవకాశం కోల్పోయే అవకాశం ఉంటుంది. ఉత్తర భారత్‌లో సీట్లు పెంచుకొని బీజేపీ లబ్ధి పొందాలని చూస్తోందనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఒకవేళ ఇలాంటిదే జరిగితే భవిష్యత్తులో ఉత్తర భారత్, దక్షిత భారత్‌ ప్రజల మధ్య విభజనకు దారి తీసే పరిస్థితులు వచ్చే అవకాశాలున్నాయని కూడా నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Also Read: డిజిటల్ అరెస్టుల్లో రూ.120 కోట్లు పోగొట్టుకున్న బాధితులు..

చివరిసారిగా 2011లో జనగణన జరిగింది. ఆ తర్వాత 2021లో జరగాల్సి ఉన్నప్పటికి అది కొవిడ్ వల్ల వాయిదా పడింది. మహమ్మారి ప్రభావం దేశంలో తగ్గినప్పటికీ కేంద్రం దీనిపై ఫోకస్ పెట్టలేదు. మరోవైపు జనగణన లేకపోవడంతో ఆర్థిక డేటా, ద్రవ్యోల్బణం, ఉద్యోగాలకు సంబంధించిన సమాచార నాణ్యతపై ప్రభావం పడుతుందని పలువురు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇప్పటివరకు 2011 జనాభా లెక్కల ఆధారంగానే వీటికి సంబంధించిన గణంకాలు చేస్తూ రావడం వల్ల దేశంలో అసలైన పరిస్థితులు కనిపించడం లేదని చెబుతున్నారు. 

ఇక దేశ జీడీపీలో చూసుకుంటే 35 శాతం వాటా దక్షిణాది రాష్ట్రాలదే ఉంది. తలసరి ఆదాయంలో కూడా జాతీయ సగటు కంటే అధికంగా నమోదు చేసుకొని మొదటి 5 స్థానాల్లో ఉన్నాయి. మిగతా 24 రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణ భారత రాష్ట్రాలే ఆర్థికంగా బలంగా ఉన్నాయి. పన్నుల వాటాలో కూడా ఎక్కువ భాగం దక్షిణాది రాష్ట్రాల నుంచే కేంద్రానికి వెళ్తుంది. కానీ పన్నుల కేటాయింపులో మాత్రం అత్యధికంగా ఉత్తర భారత్‌లోనే ఖర్చు చేస్తున్నారు. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలకు బడ్జెట్ కేటాయింపులో కూడా అన్యాయం జరుగుతోందని.. డీలిమిటేషన్ వల్ల పరిస్థితులు మరింత దిగజారిపోతాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 

 

Advertisment
Advertisment
తాజా కథనాలు