/rtv/media/media_files/2026/03/24/delimitation-2026-03-24-09-55-06.jpg)
భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో చారిత్రాత్మక మార్పుకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలను ఏకంగా 50 శాతం పెంచాలని కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇది భారత రాజకీయ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేసే నిర్ణయం. ఈ మేరకు ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే సంబంధిత బిల్లులను ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తోంది.
Also Read: 2026 మార్చి 31 డెడ్ లైన్.. మిగిలిన మావోల లెక్కలివే!
సీట్ల పెంపు లెక్కలివే..
కేంద్ర ప్రతిపాదన ప్రకారం సీట్ల సంఖ్య ఇలా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం లోక్‌సభలో ఉన్న స్థానాలు 543 నుంచి 816కి పెరుగుతాయి. దేశవ్యాప్తంగా అన్నీ రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలు 4,123 నుంచి 6,185కి చేరుతాయి.
తెలుగు రాష్ట్రాలపై ప్రభావం:
ఈ నిర్ణయం అమలైతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోనున్నాయి.
తెలంగాణ: అసెంబ్లీ సీట్లు 119 నుంచి 179కి, లోక్‌సభ స్థానాలు 17 నుంచి 26కి పెరుగుతాయి.
ఆంధ్రప్రదేశ్: అసెంబ్లీ సీట్లు 175 నుంచి 263కి, లోక్‌సభ స్థానాలు 25 నుంచి 38కి పెరిగే అవకాశం ఉంది.
దక్షిణాది రాష్ట్రాల ఆందోళనకు తెర?
సాధారణంగా జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే, జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందనే ఆందోళన ఉంది. దీనిని నివారించేందుకు కేంద్రం ఒక మధ్యేమార్గాన్ని ఎంచుకుంది. జనాభాతో సంబంధం లేకుండా అన్ని రాష్ట్రాల్లోనూ సమానంగా 50% సీట్లను పెంచడం ద్వారా ప్రస్తుతం ఉన్న రాజకీయ ప్రాతినిధ్యాన్ని యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో ఇప్పటికే ఎన్డీయే భాగస్వామ్య పక్షాలతో భేటీ జరిగింది. మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ చట్టాలకు ఈ సమావేశాల్లోనే సవరణలు చేస్తారు. 2027 మార్చి నాటికి జనగణన పూర్తి చేసి, ప్రాథమిక గణాంకాల ఆధారంగా పునర్విభజన చేపడతారు.
2029 సార్వత్రిక ఎన్నికల నాటికి ఈ కొత్త నియోజకవర్గాల వ్యవస్థను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సీట్ల పెంపుతో పాటు ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు కూడా దామాషా ప్రకారం పెరగనున్నాయి. కేంద్రం నిర్ణయంపై చర్చించేందుకు మంగళవారం మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో విపక్ష నేతలు భేటీ కానున్నారు. ప్రభుత్వం అందరి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తుండగా, విపక్షాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Follow Us