Kolkata: బెంగాల్‌లోనూ బుల్డోజర్ల రాజకీయం.. అర్ధరాత్రి టీఎంసీ ఆఫీసు కూల్చివేత

బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో కొనసాగిస్తున్న బుల్డోజర్ల సంస్కృతి పశ్చిమబెంగాల్‌కు పాకింది. అక్కడ ఇన్నాళ్లు అధికారంలో ఉన్న టీఎంసీ పార్టీని ఓడించి బీజేపీ విజయం సాధించడంతో అక్కడ బుల్డొజర్లు గర్జిస్తున్నాయి.

New Update
FotoJet - 2026-05-06T091759.251

Bulldozer politics in Bengal

Kolkata: బీజేపీ అధికారంలో ఉన్న రాష్ర్టంలో కొనసాగిస్తున్న బుల్డోజర్ల సంస్కృతి పశ్చిమబెంగాల్‌కు పాకింది. అక్కడ ఇన్నాళ్లు అధికారంలో ఉన్న టీఎంసీ పార్టీని ఓడించి బీజేపీ విజయం సాధించడంతో అక్కడ బుల్డొజర్లు గర్జిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. బీజేపీ చారిత్రాత్మక విజయం సాధించిన తరుణంలో, కోల్‌కతాలోని రద్దీగా ఉండే హాగ్‌ మార్కెట్‌ (న్యూ మార్కెట్‌) ప్రాంతంలో మంగళవారం అర్ధరాత్రి జరిగిన ఒక ఘటన తీవ్ర కలకలం రేపింది. కొంతమంది వ్యక్తులు బుల్డోజర్‌తో వచ్చి తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన యూనియన్ కార్యాలయాన్ని కూల్చివేయడంతో ఆ ప్రాంతంలో హైటెన్షన్ నెలకొంది.

అత్యంత కీలకమైన వ్యాపార కేంద్రంలో అర్ధరాత్రి వేళ బుల్డోజర్లు గర్జించడంతో స్థానిక వ్యాపారులు, నివాసితులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో అర్థం కాక దుకాణదారులు తమ షాపులను హుటాహుటిన మూసివేసి ప్రాణభయంతో పరుగులు తీశారు. ఈ దాడిలో టీఎంసీ న్యూ మార్కెట్ యూనియన్ ఆఫీసు పూర్తిగా నేలమట్టమైంది. కేవలం కోల్‌కతాలోనే కాకుండా, ముర్షిదాబాద్ జిల్లాలోని బరువా ప్రాంతంలో కూడా ఒక టీఎంసీ కార్యాలయాన్ని జిల్లా యంత్రాంగం 'అక్రమ కట్టడం'గా పేర్కొంటూ బుల్డోజర్‌తో కూల్చివేసింది. బెంగాల్ రాజకీయ చరిత్రలో ఇలా పార్టీ కార్యాలయాలపై బుల్డోజర్లు రావడం ఇదే మొదటిసారి కావడంతో ఇది పెద్ద చర్చకు దారితీసింది.

ఈ పరిణామంపై తృణమూల్ కాంగ్రెస్ అగ్రనేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీఎంసీ నాయకురాలు మహువా మోయిత్రా ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. బీజేపీ నినాదమైన 'పరివర్తన్' అంటే ఇదేనా అని వ్యంగ్యంగా ప్రశ్నించారు. మరో నేత డెరెక్ ఓబ్రెయిన్ స్పందిస్తూ.. కేంద్ర బలగాలు (CAPF), పోలీసుల కళ్లముందే ఈ విధ్వంసం జరిగిందని ఆరోపించారు. బీజేపీ తన విజయోత్సవాల్లో భాగంగా బుల్డోజర్ రాజకీయాలను రాష్ట్రానికి పరిచయం చేస్తోందని, ఇది ఆ పార్టీ అసలు రూపమని ఆయన మండిపడ్డారు.

టీఎంసీ తన అధికారిక ప్రకటనలో ఈ ఘటనలను 'బీజేపీ మద్దతుదారుల గూండాయిజం'గా అభివర్ణించింది. ప్రధాని మోదీ, అమిత్ షాల అండదండలతోనే వ్యాపార సంస్థలను లక్ష్యంగా చేసుకుని హింసను ప్రేరేపిస్తున్నారని సంచలన ఆరోపణలు చేసింది. బెంగాల్‌లో ఇలాంటి సంస్కృతిని తాము అడ్డుకుంటామని స్పష్టం చేసింది. అయితే, ఈ ఆరోపణలను కొందరు స్థానిక వ్యాపారులు, నివాసితులు తోసిపుచ్చడం గమనార్హం. గతంలో ఒక దుకాణదారుడి నుంచి బలవంతంగా లాక్కున్న స్థలంలో అక్రమంగా ఈ కార్యాలయాన్ని నిర్మించారని, ఇప్పుడు ఆ అక్రమ నిర్మాణాన్ని మాత్రమే తొలగించారని వారు వాదిస్తున్నారు.

ఎన్నికల ఫలితాలు వచ్చిన రెండో రోజే ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడంతో కోల్‌కతా వ్యాప్తంగా ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ప్రభావిత ప్రాంతాల్లో భారీగా మోహరించారు. బెంగాల్‌ రాజకీయాల్లో ఎన్నడూ లేని విధంగా ప్రవేశించిన ఈ 'బుల్డోజర్ సంస్కృతి' మున్ముందు మరెన్ని ఘర్షణలకు దారితీస్తుందోనని సామాన్య ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పశ్చిమ బెంగాల్‌లో శాంతిభద్రతలను కాపాడటం ఇప్పుడు భద్రతా దళాలకు పెద్ద సవాలుగా మారింది.

Advertisment
తాజా కథనాలు