Big Breaking : మమతకు బిగ్‌ షాక్‌... బీజేపీతో టచ్‌లో 20 మంది టీఎంసీ ఎంపీలు, 50 మంది ఎమ్మెల్యేలు?

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో 15 ఏళ్ల సుదీర్ఘ తృణమూల్ కాంగ్రెస్ (TMC) పాలనకు తెరపడటంతో ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన సుమారు 20మంది లోక్‌సభ ఎంపీలు, 50 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ధమయ్యారని ప్రచారం సాగుతొంది.

New Update
FotoJet (27)

Big shock for Mamata Banerjee

Mamata Banerjee : పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో 15 ఏళ్ల సుదీర్ఘ తృణమూల్ కాంగ్రెస్ (TMC) పాలనకు తెరపడటంతో ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి భారీ షాక్ తగిలింది. ఇటీవల జరిగిన 2026 అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఘోర పరాజయం పాలవ్వడం, బీజేపీ ఘనవిజయం సాధించి అధికార పీఠాన్ని దక్కించుకోవడంతో తృణమూల్ కాంగ్రెస్ పునాదులు కదులుతున్నాయి. ఈ ఓటమి తెచ్చిన అంతర్గత సంక్షోభం చాలదన్నట్టు, ఇప్పుడు ఆ పార్టీకి చెందిన సుమారు 20 మంది లోక్‌సభ ఎంపీలు, 50 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు కమలం గూటితో సంప్రదింపులు జరుపుతున్నట్టు బీజేపీ ఎంపీ సౌమిత్రా ఖాన్ బాంబు పేల్చడం రాజకీయ వర్గాల్లో దావానలంలా వ్యాపించింది.

బుధవారం నాడిక్కడ మీడియాతో మాట్లాడిన సౌమిత్రా ఖాన్, టీఎంసీ ఎంపీలు తమ పార్టీ నాయకత్వ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, భవిష్యత్తు కోసం ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారని స్పష్టం చేశారు. దాదాపు 20 మంది కీలక నేతలు ఇప్పటికే తమతో నిరంతరం టచ్‌లో ఉన్నారని, బీజేపీ అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇస్తే రాబోయే రోజుల్లో టీఎంసీ మొత్తం ఖాళీ అవ్వడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. అయితే ప్రస్తుతానికి వారెవరనే లీకులు రాకుండా బీజేపీతో రహస్య సంప్రదింపులు సాగిస్తున్న టీఎంసీ ఎంపీల పేర్లను ఆయన బహిర్గతం చేయలేదు. ఈ పరిణామాలు మమతా బెనర్జీతో పాటు ఆమె వారసుడు అభిషేక్ బెనర్జీకి కోలుకోలేని పెద్ద ఎదురుదెబ్బగా మారనున్నాయి.

పశ్చిమ బెంగాల్‌లోని మొత్తం 42 లోక్‌సభ స్థానాల్లో టీఎంసీకి ప్రస్తుతం 29 మంది ఎంపీల బలం ఉంది. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఒక పార్లమెంటరీ పార్టీకి చెందిన మూడింట రెండు వంతుల మంది సభ్యులు కలిసికట్టుగా పార్టీ మారితే వారిపై అనర్హత వేటు పడదు. దానిని విలీనంగా పరిగణిస్తారు. ఈ చట్టపరమైన రక్షణను పొందేలా ఒక పక్కా వ్యూహంతో 19 నుండి 20 మంది ఎంపీలను ఒకే తాటిపైకి తెచ్చేందుకు తెరవెనుక ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే 12 మంది లోక్‌సభ ఎంపీలు కమలం గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకోగా, మరో ఐదారుగురు ఎంపీలతో కూడా బీజేపీ అగ్రనేతలు నిరంతర చర్చలు జరుపుతున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో బలంగా వినిపిస్తోంది. ఈ జాబితాలో మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితులుగా పేరున్న నేతలు కూడా ఉండటం గమనార్హం.

ఈ తిరుగుబాటు కేవలం లోక్‌సభ సభ్యులకే పరిమితం కాలేదు. ప్రస్తుతం రాజ్యసభలో తృణమూల్ కాంగ్రెస్‌కు ఉన్న 13 మంది సభ్యులలో కూడా చీలిక వచ్చే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తాజా రాజకీయ విశ్లేషణల ప్రకారం, దాదాపు 8 మంది రాజ్యసభ ఎంపీలు కూడా లోక్‌సభ సభ్యులతో పాటే బీజేపీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ పార్లమెంటులోని ఉభయ సభల్లోనూ ఇదే విధమైన భారీ తిరుగుబాటు గనుక జరిగితే, జాతీయ స్థాయిలో తృణమూల్ కాంగ్రెస్ ప్రాభవం గణనీయంగా తగ్గిపోవడమే కాకుండా పార్లమెంటులో ఆ పార్టీ ఉనికి కేవలం నామమాత్రంగా మిగిలిపోయే ప్రమాదం పొంచి ఉంది.

ఈ రాజకీయ అనిశ్చితి, వలసలపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. సౌమిత్రా ఖాన్ చేసిన వ్యాఖ్యలన్నీ పూర్తిగా 'బోగస్' అని, పార్టీలో ఎలాంటి చీలికలు లేవని టీఎంసీ సీనియర్ ఎంపీ సౌగత రాయ్ కొట్టిపారేశారు. గతంలో 2021 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా ఇలాగే పలువురు కీలక నేతలు బీజేపీలోకి వెళ్లారని, కానీ టీఎంసీ తిరిగి అధికారం నిలబెట్టుకోగానే వారంతా మళ్లీ వెనక్కి వచ్చేశారని ఆయన గుర్తు చేశారు. అయితే ఈసారి మాత్రం రాజకీయ సమీకరణలు భిన్నంగా ఉన్నాయి. 15 ఏళ్ల తర్వాత అధికార పగ్గాలు కోల్పోవడంతో టీఎంసీ క్యాడర్ క్షేత్రస్థాయిలో పూర్తిగా చెల్లాచెదురైంది, పైగా సీనియర్ నేతలు బాహాటంగానే నాయకత్వంపై అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు.

రాజకీయ విశ్లేషకుల అంచనాల ప్రకారం, జూన్ మొదటి వారంలోనే ఈ భారీ వలసలు ,పార్టీ ఫిరాయింపులు ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే పలువురు మాజీ మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలు కూడా బీజేపీ బాట పట్టేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నట్లు బెంగాల్ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఒకవైపు పార్టీని కాపాడుకోవడానికి, నేతలు చేజారిపోకుండా ఆపడానికి టీఎంసీ అగ్రనాయకత్వం నష్టనివారణ చర్యలు మొదలుపెట్టినప్పటికీ, అది ఏ మేరకు సఫలమవుతుందనేది అనుమానంగానే మారింది. అధికార మార్పిడి తర్వాత తీవ్ర గందరగోళంలో పడిన బెంగాల్ రాజకీయాల్లో రాబోయే రోజుల్లో మరిన్ని కీలక మరియు సంచలన మార్పులు చోటుచేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

Advertisment
తాజా కథనాలు