Himachal Municipal Election : హిమాచల్‌లో కాంగ్రెస్‌కు భారీ షాక్... స్థానిక ఎన్నికల్లో బీజేపీ జయభేరి!

కాంగ్రెస్ అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్‌లో ఆ పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో ఇటీవల జరిగిన మున్సిపల్ కార్పొరేషన్లు, పంచాయతీ సమితులు, జిల్లా పరిషత్‌ ఎన్నికల ఫలితాలు వెలువడుతుండగా, భారతీయ జనతా పార్టీ (BJP) తన రాజకీయ ఆధిక్యతను చాటుకుంది.

New Update
BJP

BJP

Himachal Municipal Election : కాంగ్రెస్ అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్‌లో ఆ పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో ఇటీవల జరిగిన మున్సిపల్ కార్పొరేషన్లు, పంచాయతీ సమితులు, జిల్లా పరిషత్‌ ఎన్నికల ఫలితాలు వెలువడుతుండగా, భారతీయ జనతా పార్టీ (BJP) తన రాజకీయ ఆధిక్యతను చాటుకుంది. ప్రతిష్ఠాత్మకంగా మారిన నాలుగు మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల్లో ఏకంగా మూడింటిని బీజేపీ కైవసం చేసుకోగా, అధికార కాంగ్రెస్ పార్టీ కేవలం ఒకే ఒక్క కార్పొరేషన్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. రాష్ట్ర రాజధాని సిమ్లా కేంద్రంగా వెలువడిన ఈ ఫలితాలు స్థానిక రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి.

ఈ ఎన్నికల్లో మండి, ధర్మశాల, సోలన్, పాలంపూర్ మున్సిపల్ కార్పొరేషన్లకు పోలింగ్ నిర్వహించారు. వీటిలో సీఎం సొంత జిల్లా పరిధిలోకి వచ్చే మండి (15 వార్డులు), ధర్మశాల (17 వార్డులు), సోలన్ (17 వార్డులు) కార్పొరేషన్లను బీజేపీ క్లీన్ స్వీప్ చేసి విజయకేతనం ఎగురవేసింది. కాంగ్రెస్ పార్టీ కేవలం పాలంపూర్ (15 వార్డులు) మున్సిపల్ కార్పొరేషన్‌ను మాత్రమే దక్కించుకుని ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అధికారంలో ఉండి కూడా స్థానిక సంస్థల్లో మెజార్టీ స్థానాలను కోల్పోవడం కాంగ్రెస్ శ్రేణులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది.

పార్టీ గుర్తుల ఆధారంగా, ఈవీఎం (EVM)ల ద్వారా మే 17న జరిగిన ఈ నాలుగు మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల్లో ఓటర్లు రికార్డు స్థాయిలో స్పందించారు. మొత్తంగా 63.44 శాతం పోలింగ్ నమోదు కాగా, ప్రాంతాల వారీగా మండిలో అత్యధికంగా 68.78 శాతం, కాంగ్రా జిల్లా పరిధిలోని ధర్మశాల, పాలంపూర్‌లలో 63.72 శాతం, సోలాన్‌లో 58.32 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటర్లు పెద్ద ఎత్తున తరలివచ్చి తీర్పు ఇవ్వడంతో ఈ మున్సిపల్ ఫలితాలు ఇరు పార్టీలకు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారాయి.

మరోవైపు, గ్రామీణ స్థానిక సంస్థలైన పంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో మే 26, 28, 30 తేదీల్లో ముగిశాయి. మున్సిపల్ ఎన్నికల తరహాలో కాకుండా, ఈ పంచాయతీ ఎన్నికలను పార్టీ గుర్తులు లేకుండా కేవలం బ్యాలెట్ పేపర్ల ద్వారా నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు, ఈదురుగాలులతో కూడిన తుపాను వాతావరణం నెలకొన్నప్పటికీ, గ్రామీణ ఓటర్లు ఏమాత్రం వెనకడుగు వేయకుండా రికార్డు స్థాయిలో ఏకంగా 81 శాతం ఓటింగ్‌లో పాల్గొనడం విశేషం. ప్రస్తుతం ఈ పంచాయతీ సమితులు, జిల్లా పరిషత్ స్థానాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది.

Advertisment
తాజా కథనాలు