/rtv/media/media_files/2026/05/09/fotojet-2026-05-09-17-15-45.jpg)
Five AIDMK MLAs join TVK ?
తమిళనాడు రాజకీయాలు నిమిషానికో మలుపు తిరుగుతున్నాయి. ‘దళపతి’ విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (TVK) ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన బల నిరూపణ దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో ఊహించని భారీ ట్విస్ట్ చోటుచేసుకుంది. ప్రధాన ప్రతిపక్షమైన ఏఐఏడీఎంకే (AIADMK) లో పెద్ద ఎత్తున చీలిక రాబోతున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆ పార్టీకి చెందిన ఐదుగురు (మరో ప్రచారం ప్రకారం ఆరుగురు) కీలక ఎమ్మెల్యేలు టీవీకేకు మద్దతు ఇవ్వడానికి సిద్ధమయ్యారనే వార్త తమిళ రాజకీయ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. - AIADMK MLAs Supports TVK Vijay
మారిన రాజకీయ పరిణామాలపై చర్చించేందుకు ఏఐఏడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామి అధ్యక్షతన అత్యవసరంగా ఎమ్మెల్యేల సమావేశం ఏర్పాటు చేశారు. అయితే, ఈ భేటీకి ఏకంగా ఐదుగురు కీలక ఎమ్మెల్యేలు హాజరుకాకుండా ముఖం చాటేయడం తీవ్ర కలకలం రేపింది. గైర్హాజరైన వారిలో మాజీ మంత్రులు సి.వి. షణ్ముగం (RV షణ్ముగం), ఎస్.పి. వేలుమణి, ఎం.ఆర్. విజయభాస్కర్‌తో పాటు తమిళనాడు ఎన్నికల్లోనే అత్యంత సంపన్న అభ్యర్థిగా గెలిచిన లీమా రోజ్(Lima Rose) (లాటరీ కింగ్ శాంటియాగో మార్టిన్ భార్య)తో పాటు మరో ఎమ్మెల్యే ఉన్నారు. వీరంతా పళనిస్వామి అధికారిక సమావేశాన్ని బహిష్కరించి.. చెన్నైలోని ఎంఆర్‌సీ నగర్‌లో సి.వి. షణ్ముగం నేతృత్వంలో రహస్యంగా భేటీ కావడం పార్టీలో తిరుగుబాటును స్పష్టం చేస్తోంది.
Also Read : సీఎంగా సువేందు అధికారి.. బీజేపీ కొత్త కేబినేట్ ఇదే!
AIADMK MLAs To Support Vijay
వాస్తవానికి ఈ రెబల్ ఎమ్మెల్యేల గ్రూప్ ఇప్పటికే విజయ్‌తో సంప్రదింపులు జరిపినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఒకవేళ చివరి నిమిషంలో డీఎంకే ఒత్తిడి వల్లనో, మరే ఇతర కారణాల చేతనో వీసీకే (VCK) పార్టీ టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వకుండా వెనక్కి తగ్గితే... ప్రభుత్వం కూలిపోకుండా కాపాడేందుకు తాము మద్దతు ఇచ్చేలా ఈ ఐదుగురు ఎమ్మెల్యేలు పక్కా వ్యూహం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. అయితే, వీసీకే మద్దతు లేఖ ఇచ్చినప్పటికీ, ఏఐఏడీఎంకేలో ఏర్పడిన ఈ తిరుగుబాటు జరగబోయే నూతన ప్రభుత్వ ఏర్పాటులో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ రాజకీయ సంక్షోభం వెనుక టీవీకే ఎన్నికల వ్యూహకర్త, ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి అధవ్ అర్జున్(Adhav Arjun) చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఏఐఏడీఎంకే తిరుగుబాటు ఎమ్మెల్యేలలో కీలక వ్యక్తి అయిన లీమా రోజ్ మరెవరో కాదు.. స్వయానా టీవీకే ముఖ్యనేత అధవ్ అర్జున్‌కు అత్తగారే (ఆయన భార్య డెయిసీ తల్లి). తన అల్లుడి పార్టీ అయిన టీవీకే సజావుగా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు వీలుగా, లీమా రోజ్ తన పలుకుబడితో ఏఐఏడీఎంకేకు చెందిన కొందరు సీనియర్ ఎమ్మెల్యేలను ఏకం చేసి ప్రత్యేక వర్గంగా ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారని చెన్నై పొలిటికల్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఈ ఐదుగురు ఎమ్మెల్యేలు గనుక అధికారికంగా టీవీకే గూటికి చేరితే ఏఐఏడీఎంకేకు కోలుకోలేని భారీ దెబ్బ తగలనుంది. ఇప్పటికే అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కోల్పోయే ప్రమాదం పొంచి ఉన్న తరుణంలో, పళనిస్వామి చేతుల్లోంచి పార్టీ పట్టు జారిపోతోందనడానికి ఈ పరిణామమే ప్రత్యక్ష నిదర్శనమని విశ్లేషకులు చెబుతున్నారు. 'దళపతి' విజయ్ సీఎం పీఠం ఎక్కకముందే ద్రవిడ దిగ్గజ పార్టీలలో ఈ రేంజ్‌లో ప్రకంపనలు సృష్టించడం తమిళనాడు భవిష్యత్ రాజకీయాలపై సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. - Five AIADMK MLAs jump
Also Read : విజయ్కు దెబ్బ మీద దెబ్బ.. VCK పార్టీ సంచలన డిమాండ్ !
Follow Us