/rtv/media/media_files/2025/10/07/rape-2025-10-07-14-24-33.jpg)
TVK activists assault a young woman
TVK LEADERS RAPE CASE : తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న ఒక యువతిని టార్గెట్ చేస్తూ ఘోరమైన అఘాయిత్యం జరిగింది. శ్రీవైకుంటం ప్రాంతానికి చెందిన సదరు యువతికి మంచి ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించిన నిందితులు, ఆమెను నమ్మించి కారులో ఎక్కించుకున్నారు. మే 3వ తేదీన ఆమెను రామనాథపురంలోని ఏర్వాడి ప్రాంతానికి తీసుకెళ్లి, ప్లాన్ ప్రకారం ఆమె తాగే కూల్ డ్రింక్‌లో మత్తుమందు కలిపారు. బాధితురాలు స్పృహ తప్పిన తర్వాత ఆమెపై లైంగిక దాడికి (అఘాయిత్యానికి) పాల్పడ్డారు.
మత్తు నుంచి కోలుకున్న బాధితురాలు జరిగిన దారుణంపై శ్రీవైకుంటం ఆల్ ఉమెన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు బాధితురాలి వాంగ్మూలాన్ని రికార్డు చేసి, వైద్య పరీక్షల నిమిత్తం ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న తూత్తుకుడి వెస్ట్ జిల్లా టీవీకే (TVK) యువజన విభాగం నిర్వాహకుడు బాలసుబ్రమణియన్ (35), అలాగే రామనాథపురం ప్రాంతానికి చెందిన టీవీకే పార్టీ కార్యకర్త జైపాల్ (28)లను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వీరిద్దరిని పాళయంకోట్టై సెంట్రల్ జైలులో రిమాండ్‌కు తరలించారు.
అరెస్టయిన నిందితులిద్దరూ ప్రముఖ నటుడు విజయ్ నేతృత్వంలోని 'తమిళగ వెట్రి కజగం' (TVK) పార్టీకి చెందిన క్రియాశీలక కార్యకర్తలు కావడంతో ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రచ్చకు దారితీసింది. అయితే ఈ పార్టీ నేతలు ఇలాంటి కేసుల్లో ఇరుక్కోవడం ఇదే మొదటిసారి కాదు. గత మే (2026) మొదటి వారంలో కూడా చెన్నైలోని కాసిమేడు ప్రాంతంలో ఒక మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో దినేష్ అలియాస్ 'పాంబు దినేష్' అనే మరో టీవీకే కార్యకర్త పోక్సో (POCSO) చట్టం కింద అరెస్టయ్యాడు. నెల రోజుల వ్యవధిలోనే ఇలాంటి రెండో ఘటన వెలుగుచూడటం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తోంది.
ఈ దారుణ ఉదంతాన్ని అధికార డీఎంకే (DMK) సహా ప్రత్యర్థి పార్టీలు రాజకీయ అస్త్రంగా మల్చుకునే ప్రయత్నాలు ప్రారంభించాయి. నిందితులతో పార్టీకి ఉన్న సంబంధాలపై స్పష్టత ఇవ్వాలని అధికార పక్షం డిమాండ్ చేస్తోంది. ఇటీవల కాలంలో మహిళలపై అన్యాయం జరిగితే ఎంతటి వారైనా సరే కఠిన చర్యలు తప్పవని టీవీకే అధినేత విజయ్ హెచ్చరించిన నేపథ్యంలో, ఇప్పుడు తన సొంత పార్టీ నేతలపై ఆయన ఎలాంటి చర్యలు తీసుకుంటారనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ విజయ్ దీనిపై కఠినంగా స్పందించకపోతే, పార్టీ భవిష్యత్తుపై, ముఖ్యంగా మహిళా ఓట్ బ్యాంక్‌పై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. భవిష్యత్ కార్యాచరణపై విజయ్ త్వరలోనే పార్టీ నేతలతో అత్యవసర సమావేశం నిర్వహించే అవకాశం ఉంది.
Follow Us