/rtv/media/media_files/2026/03/10/delhi-liquor-case-2026-03-10-07-03-55.jpg)
Delhi liquor case
Delhi liquor case : ఢిల్లీ మద్యం కేసులో రౌజ్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అగ్రనేతలు అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోదియా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కె.కవితతోపాటు మరో 20 మందికి విముక్తి కలిగించినప్పటికీ ఈడీ మాత్రం ఈ కేసును వదిలేలా లేదు. కేసుపై సీబీఐ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దర్యాప్తు సంస్థ ఈడీ మరోసారి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దర్యాప్తు సంస్థ అప్పీల్ ను స్వీకరించిన హైకోర్టు సోమవారం విచారణ ప్రారంభించింది. ఈ కేసు దర్యాప్తు చేసిన సీబీఐ అధికారులపై శాఖాపరమైన విచారణ చేపట్టాలని, వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ట్రయల్‌కోర్టు న్యాయమూర్తి జితేంద్ర ప్రతాప్‌సింగ్ జారీచేయగా దానిపై స్టే ఇచ్చింది. సీబీఐ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్‌మెహతా తన వాదనలను వినిపించగా దాన్ని పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంతశర్మ మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు.
‘‘కాగా ఈ సందర్భంగా పిటిషనర్ తరపు న్యాయవాది మాట్లాడుతూ ప్రతివాదులకు వ్యతిరేకంగా సమర్పించిన సాక్ష్యాధారాలను ట్రయల్ కోర్టు పరిగణనలోకి తీసుకోలేదని వాదించారు. అదే సమయంలో దర్యాప్తు సంస్థకు వ్యతిరేకంగా ట్రయల్‌కోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదని పేర్కొన్నారు. అయితే సీబీఐ కేసులో నిందితులందర్నీ డిశ్చార్జి చేస్తూ న్యాయ స్థానం ఉత్తర్వులివ్వడం మూలంగా ఈ కేసుతో ముడిపడిన మనీలాండరింగ్ కేసు దెబ్బతినే అవకాశం ఉందని దానిపై స్టే ఇవ్వాలని కోరారు. ఆ వాదనలను పరిగణలోకి తీసుకున్న కోర్టు దర్యాప్తు సంస్థ, దర్యాప్తు అధికారిపై ట్రయల్‌కోర్టు జడ్జి చేసిన వ్యాఖ్యలపై స్టే విధించింది. హై కోర్టులో ప్రస్తుత విచారణ పూర్తయ్యేంతవరకూ ఈడీ కేసుపై విచారణను వాయిదా వేస్తూ ట్రయల్‌కోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. కాగా తదుపరి విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది.
కోర్టులో ఏం జరిగిందంటే...?
కాగా ఈ కేసుపై దర్యాప్తు సంస్థ న్యాయవాది తుషార్ మెహతా హైకోర్టులో తన వాదనలు వినిపిస్తూ.. ఢిల్లీ మద్యం కేసు దేశ రాజధాని చరిత్రలో జరిగిన అతిపెద్ద కుంభకోణాల్లో ఒకటని వివరించారు. ‘‘మద్యం విధానంలో తమకు అనుకూలమైన నిబంధనలు పొందుపరిచినందుకు నిందితులు ఆమ్‌ఆద్మీ పార్టీకి చెందిన విజయ్‌నాయర్‌కు రూ.100 కోట్లు చెల్లించారన్నారు. ఇందులో రూ.44.50 కోట్లు హవాలా రూపంలో బదిలీ చేయగా వాటిని గోవా ఎన్నికల్లో పార్టీ ఫండ్ కింద చెల్లించారని సీబీఐ శాస్త్రీయ ఆధారాలతో తేల్చిందన్నారు. అయినా.. ట్రయల్‌కోర్టు న్యాయమూర్తి దీనిపై సరైన విచారణ చేయకుండా నిందితులందర్నీ విడుదల చేశారని ఆరోపించారు. ఈ డిశ్చార్జి పిటిషన్లపై విచారణ పూర్తయిన కేవలం 12 రోజుల్లోనే ట్రయల్‌కోర్టు జడ్జి 600 పేజీల తీర్పును వెలువరించడం విచిత్రంగా ఉందని తుషార్ మెహతా వాదించారు . అప్రూవర్లు ఇచ్చిన వాంగ్మూలాలను ప్రాథమిక దశలోనే మిగతా సాక్ష్యాధారాలతో సరిపోల్చి చూడాలని చెప్పడం ద్వారా న్యాయసూత్రాలను తప్పుగా అన్వయించారని ఆయన తన వాదనలు వినిపించారు.
నిజానికి అప్రూవర్ల వాంగ్మూలాలను ట్రయల్ దశలో మాత్రమే మిగతా ఆధారాలతో సరిపోల్చి చూడాలని, ముడుపుల కోసం నగదును తమ ఆఫీసు నుంచి సేకరించి మధ్యవర్తుల ద్వారా బదిలీ చేసినట్లు అప్రూవర్ దినేశ్ అరోడా చెప్పారన్నారు. అశోక్ కౌశిక్ అనే వ్యక్తి ఢిల్లీలోని ఓ అడ్రాస్ నుంచి తాను రెండు పెద్ద బ్యాగుల్లో నగదు తీసుకొచ్చి నిందితుల అడ్రస్‌లో ఇచ్చినట్లు వాంగ్మూలమిచ్చారని గుర్తు చేశారు. అయితే ఈ విషయాన్ని ట్రయల్‌కోర్టు ఎక్కడా ప్రస్తావించకపోవడం విచిత్రమని ఆయన అన అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. ముడుపులు ఇచ్చిన వారు చెప్పిన విధానాలనే ఢిల్లీ మద్యం విధానంలో చేర్చినట్లు బుచ్చిబాబు వాట్సప్ చాట్స్ ద్వారా నిరూపితమైందని. ఆ చాట్స్‌లో ఉన్న విధానాలే అప్పటి మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫార్సుల్లో యథాతథంగా చేర్చారని’’ అని తుషార్ మెహతా తన వాదనలు వినిపించారు. వీటిని పరిగణలోకి తీసుకుని మద్యం కేసులో అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోదియా, కె.కవితతో పాటు మిగిలిన వారిని నిర్దోషులుగా ప్రకటిస్తూ ట్రయల్ కోర్టు చేసిన వ్యాఖ్యల్ని కొట్టివేయాలని కోరుతూ ఈడీ.. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది. కాగా మద్యం కేసుపై గత నెల 27న వెలువరించిన తీర్పులో ఈడీపై ప్రత్యేక కోర్టు కఠిన వ్యాఖ్యలు చేసిందని, ఇలా చేయడం ద్వారా తన పరిధిని అతిక్రమించిందని ఈడీ తన పిటిషన్‌లో పేర్కొంది.
Follow Us