/rtv/media/media_files/2026/06/05/annamalai-resignation-2026-06-05-12-57-19.jpg)
Annamalai resignation
Annamalai's resignation : తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటు చేసుకున్నాయి. గత కొంతకాలంగా సాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ, తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కె. అన్నామలై ఆ పార్టీకి అధికారికంగా రాజీనామా చేశారు. ఆయన సమర్పించిన ఐదు పేజీల రాజీనామా లేఖను బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ శుక్రవారం ఉదయం ఆమోదించారు. ఢిల్లీ వేదికగా జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ ప్రధాన కార్యదర్శి బి.ఎల్. సంతోష్‌లతో అన్నామలై భేటీ అయిన తర్వాతే ఈ రాజీనామా ప్రక్రియ ముగిసింది. రాజీనామా ఆమోదం పొందిన వెంటనే, అన్నామలై ముందుగా ప్రకటించినట్లుగా మధ్యాహ్నం 12 గంటలకు మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన తన సంచలన నిర్ణయాన్ని వెల్లడిస్తూ.. కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త మార్పు కోసం ఒక రాజకీయ ఉద్యమాన్ని లేదా పార్టీని తీసుకురావడమే తన తదుపరి లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
మీడియా సమావేశంలో అన్నామలై మాట్లాడుతూ.. గత 18 నెలలుగా పార్టీ జాతీయ నాయకత్వంతో కొన్ని విషయాల్లో తనకు తీవ్రమైన విభేదాలు ఉన్నాయని ఓపెన్‌గా వెల్లడించారు. పార్టీ బలోపేతం కోసం తాను అహర్నిశలు శ్రమించానని, అయితే తాను ఎప్పటికీ బీజేపీకి ఒక భారంగా మారాలని అనుకోలేదని భావోద్వేగంగా వ్యాఖ్యానించారు. తనతో పాటు ఇన్నాళ్లూ నడిచిన ప్రతి ఒక్క కార్యకర్తకు, మద్దతుదారునికి ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ రాజీనామాకు,పార్టీతో వచ్చిన విభేదాలకు గల ముఖ్య కారణాలను పరిశీలిస్తే.. ఇటీవల ముగిసిన 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే (AIADMK)తో పొత్తు పెట్టుకోవడం అన్నామలైకి ఏమాత్రం ఇష్టం లేదు. తమిళనాడులో బీజేపీ ఒంటరిగా పోటీ చేసి సొంతంగా ఎదగాలని ఆయన గట్టిగా కోరుకున్నారు. కానీ అధిష్టానం ఆయన మాట పక్కనపెట్టి పొత్తు వైపు మొగ్గు చూపడం, ఎన్నికలకు ముందు ఆయనను రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి తప్పించడం, టికెట్ కేటాయించకపోవడం వంటి పరిణామాలు అన్నామలైని తీవ్ర అసంతృప్తికి గురిచేశాయి. ఈ కారణాల వల్లే ఆయన పార్టీని వీడాల్సి వచ్చిందని ఆయన అనుచరులు కూడా స్పష్టం చేశారు.
ఇక భవిష్యత్ ప్రణాళికలపై మాట్లాడిన అన్నామలై.. ప్రస్తుతం తాను నిర్వహిస్తున్న ‘వియ్ లీడర్స్’ ట్రస్ట్‌ను మరింత విస్తరించి ఒక బలమైన రాజకీయ ఉద్యమంగా మార్చనున్నట్లు తెలిపారు. తమిళనాట ‘తమిళగ మక్కల్ కళగం’ లేదా ‘తమిళగ మక్కల్ కట్చి’ అనే పేరుతో కొత్త ప్రాంతీయ పార్టీని స్థాపించేందుకు కసరత్తులు జరుగుతున్నట్లు సమాచారం. ఈ కొత్త పార్టీ రాబోయే 2031 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో పోటీ చేస్తుందని అన్నామలై స్పష్టం చేశారు. తాము తీసుకురాబోయే కొత్త పార్టీ కేవలం వ్యక్తుల చుట్టూ తిరిగే కల్ట్ రాజకీయాలకు భిన్నంగా, సామాన్య ప్రజల పక్షాన (Common-man politics) నిలబడేలా ఉంటుందని అన్నామలై పేర్కొన్నారు. పార్టీకి సంబంధించిన పూర్తి వివరాలు, జెండా, ఎజెండా, విధివిధానాలను అతి త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. అన్నామలై తీసుకున్న ఈ సంచలన నిర్ణయం తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సంచలనాలకు దారితీసేలా కనిపిస్తోంది.
Follow Us