BIG BREAKING: ఢిల్లీలో పేలిన ఏసీ.. 9 మంది దుర్మరణం!

దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం తెల్లవారుజామున పెను విషాదం చోటుచేసుకుంది. వివేక్ విహార్ ప్రాంతంలోని ఒక నివాస భవనంలో ఎయిర్ కండీషనర్ (ఏసీ) పేలడంతో సంభవించిన భారీ అగ్నిప్రమాదం తొమ్మిది మంది ప్రాణాలను బలితీసుకుంది.

New Update
FotoJet - 2026-05-03T092903.993

BIG BREAKING:  దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం తెల్లవారుజామున పెను విషాదం చోటుచేసుకుంది. వివేక్ విహార్ ప్రాంతంలోని ఒక నివాస భవనంలో ఎయిర్ కండీషనర్ (ఏసీ) పేలడంతో సంభవించిన భారీ అగ్నిప్రమాదం తొమ్మిది మంది ప్రాణాలను బలితీసుకుంది. మంటలు క్షణాల్లో వ్యాపించడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు సజీవ దహనం కాగా, మరికొందరు ఊపిరాడక, బయటపడే మార్గం లేక ప్రాణాలు కోల్పోయారు.

ఆదివారం తెల్లవారుజామున సుమారు 3:47 గంటలకు అందరూ గాఢనిద్రలో ఉన్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. భవనంలోని రెండో అంతస్తులో ఉన్న ఒక ఫ్లాట్‌లో ఏసీ కంప్రెషర్ ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోయింది. వేసవి తీవ్రత వల్ల గాలిలో ఉన్న వేడి, ఇంట్లోని  వస్తువుల కారణంగా మంటలు నిమిషాల వ్యవధిలోనే రెండో అంతస్తు మొత్తాన్ని చుట్టేసి, వేగంగా మూడో అంతస్తుకు కూడా వ్యాపించాయి.

 ప్రమాద సమాచారం అందిన వెంటనే 14 అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. దట్టమైన పొగ,మంటలు కమ్ముకున్న భవనం నుండి అగ్నిమాపక సిబ్బంది సుమారు 12 మందిని సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారు. అయితే, అప్పటికే తొమ్మిది మంది మంటలకు ఆహుతయ్యారు. మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా కాలిపోయి ఉండటం ఈ ప్రమాద తీవ్రతకు అద్దం పడుతోంది. అగ్నిమాపక సిబ్బంది లోపలికి వెళ్లి పరిశీలించగా, ముగ్గురు వ్యక్తులు తమ పడకలపైనే విగతజీవులుగా పడి ఉండటం అత్యంత కలిచివేసే అంశం.

 ఈ ప్రమాదంలో మరణాల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణం భవనం నుంచి బయటపడే మార్గం లేకపోవడమేనని తెలుస్తోంది. మంటలు మూడో అంతస్తుకు వ్యాపించగానే, ప్రాణాలు కాపాడుకోవడానికి ఆ అంతస్తులోని వారు పైకప్పు (టెర్రస్) పైకి పరుగులు తీశారు. అయితే దురదృష్టవశాత్తూ పైకప్పు తలుపులు లాక్ చేసి ఉండటంతో వారు అక్కడే చిక్కుకుపోయి మృత్యువాత పడ్డారు. రెండో అంతస్తులో ఉన్న నలుగురు వ్యక్తులు బయటకు వచ్చే అవకాశం కూడా లేక అక్కడికక్కడే మరణించారు.

పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఏసీ పేలడానికి గల సాంకేతిక కారణాలను విశ్లేషించేందుకు ఫోరెన్సిక్ నిపుణులను రంగంలోకి దించారు. ఏసీ కంప్రెషర్ పేలడానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమా లేక మితిమీరిన వేడి వల్ల గ్యాస్ లీక్ అయి పేలిందా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. గాయపడిన నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు