పంజాబ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 8 మంది ప్రయాణికులు మృతి చెందారు. బఠిండాకు వస్తున్న బస్సు శుక్రవారం జీవన్ సింగ్వాలా గ్రామం వద్ద వంతెనను ఢీ కొట్టింది. అనంతరం బస్సు పంట కాల్వలో పడిపోవడంతో 8 మంది ప్రాణాలు కొల్పోయారు. మరో 20 మంది గాయపడ్డారు. కాగా ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 45 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
హైదరాబాద్‌లో ఘోరం
హైదరాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది. బైక్ అతివేగంగా నడిపి ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పర్వత్ నగర్ చౌరస్తా సమీపంలో బుల్లెట్ బైక్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బోరబండకు చెందిన ఆకాంక్ష్, రఘుబాబు మృతి చెందారు. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో బోరబండ నుంచి మాదాపూర్ వెళ్తుండగా.. ఈ దారుణం జరిగింది.
ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
బైక్ నడిపిన యువకుడు మద్యం మత్తులో ఉన్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా.. మాదాపూర్ 100 ఫీట్ రోడ్‌లోని పర్వత్ నగర్ చౌరస్తా సమీపంలో ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.