/rtv/media/media_files/2026/05/03/27-children-among-58-hospitalised-after-eating-roadside-snack-in-odisha-2026-05-03-20-12-53.jpg)
27 children among 58 hospitalised after eating roadside snack in Odisha
ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. రోడ్డు పక్కన విక్రయించే చిరుతిండి తిని 58 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీళ్లలో 27 మంది చిన్నారులు కూడా ఉన్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. పటాపూర్ గ్రామానికి చెందిన కొందరు పిల్లలు, పెద్దలు కలిసి శుక్రవారం ఉదయం 'కటక్ దహిబారా' అనే చిరుతిండి తిన్నారు. ఇది తిన్న కొద్దిసేపటికే అందరికీ వాంతులు, విరోచనాలు అయ్యాయి. జ్వరాలు కూడా రావడంతో ఈ వ్యవహారం గ్రామంలో కలకలం రేపింది. బాధితులందరినీ వెంటనే ఆస్పత్రికి తరలించి అత్యవసర చికిత్స అందించారు.
ఈ ఘటనపై ఒడిశా సర్కార్ కూడా వెంటనే స్పందించింది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ముఖేష్ మహాలింగ్ సైతం స్వయంగా జిల్లా ఆస్పత్రిని సందర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిపై సమీక్ష చేశారు. ఈ ఘటనకు గల కారణం ఏంటో ఇంకా తెలియలేదు. దీనిపై దర్యాప్తు చేసేందుకు ప్రభుత్వం మూడు స్వతంత్ర కమిటీలు ఏర్పాటు చేసింది. ఆహారం కల్తీ అయ్యిందా లేదా అపరిశుభ్రత వల్ల ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో దీనిపై విచారణ చేస్తున్నారు.
అయితే ప్రస్తుతం బాధితుల పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే చికిత్స పొందిన వాళ్లలో 21 మంది కోలుకున్నారు. అయితే ఇప్పటికే వాళ్లని డిశ్చార్జ్ చేశామని జిల్లా కలెక్టర్ అంబర్ కుమార్ కర్ తెలిపారు. మిగిలిన వాళ్లు కూడా ఇప్పుడు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారు. ప్రజలు బయట దొరికే ఆహారం విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అలాగే నాణ్యత లేని ఆహార విక్రేతలపై కఠినంగా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం కూడా హెచ్చరికలు జారీ చేసింది.
Follow Us