BJP: జెండా పాతాల్సిందే: తెలంగాణకు బీజేపీ అగ్రనేతల క్యూ.. వరుస పర్యటనలతో కార్యాచరణ

పార్టీపై సానుకూలత పెరిగిందన్న విశ్లేషణల నేపథ్యంలో తెలంగాణలో సర్వశక్తులొడ్డి ప్రజల్లోకి వెళ్లాలని కమలదళం భావిస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీ హేమాహేమీలంతా తెలంగాణకు వరుస కడుతున్నారు. చివరివారంలో బీజేపీ నేతలు రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు తలపెట్టారు.

New Update
BJP: జెండా పాతాల్సిందే: తెలంగాణకు బీజేపీ అగ్రనేతల క్యూ.. వరుస పర్యటనలతో కార్యాచరణ

Telangana Elections 2023: తెలంగాణ రాజకీయ ముఖచిత్రం రోజురోజుకూ మారుతోంది. నిన్నమొన్నటి వరకూ వెలువడిన సర్వేలన్నీ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే హోరాహోరీ అని తేల్చేయగా ఆ అంచనాలను తలకిందులు చేయాలని బీజేపీ భావిస్తోంది. ఇప్పటికే తెలంగాణలో మూడో వంతు స్థానాల్లో ఫలితాలను శాసించగల స్థాయిలో ఉన్న కమల దళం మరింత బలం పుంజుకునేలా తాజా కార్యాచరణను రూపొందించింది. పది రోజుల క్రితం వరకూ కొంత స్తబ్ధుగానే ఉన్న బీజేపీ శ్రేణుల్లో ప్రధాని నరేంద్రమోదీ భాగ్యనగర పర్యటన, మాదిగ విశ్వరూప మహాసభ జోష్ నింపాయి. మరోవైపు రాజస్థాన్ ఎన్నికలు కూడా ముగియడంతో పార్టీ మహారథులంతా తమ అస్త్రశస్త్రాలను తెలంగాణ వైపు మల్లించారు. ఎన్నికల పర్వం తుది అంకానికి చేరిన వేళ రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు తలపెట్టారు.
పార్టీకి పట్టున్న చోట ప్రధాని మోదీ సభలు:
ఈ నెల 25 నుంచి వరుసగా మూడురోజుల పాటు ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో పర్యటిస్తారు. మొదటి రోజు హైదరాబాద్ లో కార్యక్రమాలతో పాటు కామారెడ్డి, మహేశ్వరంలో ప్రధాని మోదీ సభలుంటాయి. ఆ రోజు రాత్రి రాజ్‌భవన్‌లో బస అనంతరం 26న ఉదయం కన్హ శాంతివనంలో జరిగే కార్యక్రమంలో మోదీ పాల్గొంటారు. అదే రోజు తుప్రాన్‌, నిర్మల్‌లో బహిరంగ సభల్లో మోదీ ప్రసంగిస్తారు. మరునాడు 27న మహబూబాబాద్‌, కరీంనగర్‌లలో నరేంద్రమోదీ సభలుంటాయి. ఇలా పార్టీకి ఇప్పటికే గట్టి పట్టున్న చోట్ల సభలు నిర్వహించడం ద్వారా విజయావకాశాలు మరింత బలపడతాయని పార్టీ నాయకులు భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి: తెలంగాణ స్పూర్తితోనే ఏపీలో గుండాలను, రౌడీలను ఎదుర్కొంటున్నా: పవన్‌ కల్యాణ్

షా, యోగి సుడిగాలి పర్యటనలు:
మోదీతో పాటు హోంమంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా మూడు రోజులపాటు తెలంగాణలోనే ఉంటారు. ఈ నెల 24, 26, 28 తేదీల్లో తెలంగాణలో అమిత్‌ షా ప్రచారం సాగనుంది. 24న హుజురాబాద్‌, మంచిర్యాల, ఆర్మూర్‌లో అమిత్ షా సభలు జరగనుండగా, అదేరోజు కూకట్‌పల్లిలో రోడ్ షో నిర్వహిస్తారు. 26న మక్తల్, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, అంబర్‌పేటలో అమిత్‌ షా రోడ్ షో నిర్వహిస్తారు. 28న రామగుండం, పెద్దపల్లి నియోజక వర్గాల్లో పర్యటిస్తారు. మరోవైపు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పర్యటన వివరాలు కూడా ఖరారయ్యాయి. 24న బోథ్, ఆదిలాబాద్‌, ఖానాపూర్, ఖైరతాబాద్‌లో ఎన్నికల ప్రచారంలో యోగి పాల్గొంటారు. 25న బోధన్, వేములవాడ, గోషామహాల్ లో జరిగే రోడ్‌షోల్లో ప్రసంగిస్తారు. 26న మహబూబ్‌నగర్‌, కల్వకుర్తి, ఎల్‌బీ నగర్‌, కుత్బుల్లాపూర్‌లో యోగి ప్రచారం సాగుతుంది.
జోరుగా నడ్డా ప్రచారం:
23న ముథోల్, నిజామాబాద్, సంగారెడ్డిలో పార్టీ అధ్యక్షుడు నడ్డా విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. పెద్దసంఖ్యలో కార్యకర్తలతో సాయంత్రం సికింద్రాబాద్ లో రోడ్ షో జరగనుంది. 24న హుజుర్‌నగర్‌, హుస్నాబాద్‌, ముషీరాబాద్‌లో నడ్డా ఎన్నికల ప్రచారం కొనసాగనుంది. 27న బాన్సువాడ, జుక్కల్, గజ్వేల్‌లో నడ్డా పర్యటిస్తారు.

ఇది కూడా చదవండి: బీఆర్ఎస్ దళిత వ్యతిరేక పార్టీ.. బీఎస్పీతోనే అన్ని వర్గాలకు న్యాయం: మాయావతి

వారే కాకుండా కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, రాజ్‌నాథ్ సింగ్‌, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించేలా పార్టీ ప్రణాళికలు రూపొందించింది. 24న సిర్పూర్‌లో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ పర్యటిస్తారు. నర్సాపూర్‌, మేడ్చల్‌ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న రాజ్‌నాథ్ సింగ్ 26న బాల్కొండ, సికింద్రాబాద్ కంటోన్మెంట్, కార్వాన్‌లో రాజ్‌నాథ్ ప్రచారం సాగుతుంది. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూడా 24న తెలంగాణకు రానున్నారు. జూబ్లీహిల్స్‌, మునుగోడులో ఆమె పర్యటిస్తారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ కూడా చివరి దశ తెలంగాణ ప్రచారంలో పాల్గొంటారు. 27న మహేశ్వరం, దుబ్బాక, వరంగల్, పరకాల నియోజకవర్గాల్లో ఆయన ప్రచారం నిర్వహిస్తారు.
పార్టీ అగ్రనేతలంతా తెలంగాణలో మోహరించేందుకు సిద్ధం కావడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కమలదళాధిపతుల రాక తెలంగాణ రాజకీయ సమీకరణాలను విశేషంగా ప్రభావితం చేయగలదని, ఎన్నికల్లో అంచనాలను తారుమారు చేసేలా పెద్దసంఖ్యలో సీట్లను గెలవబోతున్నామని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తంచేస్తున్నారు. ఈ ప్రణాళికలు ఏ మేరకు ఫలితాన్నిచ్చేదీ డిసెంబరు మూడో తారీఖునే తెలుస్తుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు