కాంగ్రెస్‌ పార్టీ బడుగు, బలహీన వర్గాల వారికి ప్రాధాన్యత ఇస్తుంది- కోమటిరెడ్డి

రాష్ట్రంలో దళిత వర్గాల ప్రజలు అవమానానికి గురవుతున్నారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి అన్నారు.కాంగ్రెస్ పార్టీ బడుగు, బలహీన వర్గాల వారికి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ప్రతీ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో రెండు సీట్లు బీసీలకు ఇస్తామన్నారు

New Update
కాంగ్రెస్‌ పార్టీ బడుగు, బలహీన వర్గాల వారికి ప్రాధాన్యత ఇస్తుంది- కోమటిరెడ్డి

ప్రతీ పార్లమెంట్‌ పరిధిలోని రెండు అసెంబ్లీ సీట్లు ఖచ్చితంగా బీసీలకు ఇస్తామని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి అన్నారు. బుధవారం భువనగిరిలో పర్యటించిన ఆయన.. పార్లమెంట్‌ స్థాయి నేతలతో సమావేశమయ్యారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ బడుగు, బలహీన వర్గాల వారికి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఈ విషయం స్వయాన రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీ చెప్పారని గుర్తు చేశారు. తమ పార్టీలో కాంట్రాక్టర్లు, రియల్టర్లు ఉంటే పార్టీని వీడాలన్నారు. సొంతపార్టీ నేతలైనా ప్రజలను బెదిరింపులకు గురి చేస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు.

మరోవైపు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. తాము మొదటిసారి ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన సమయంలో కేటీఆర్‌ అమెరికాలో బాత్రూమ్‌లు కడిగేవారని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కేసీఆర్‌ బడుగు బలహీన వర్గాల వారిని పట్టించుకోవడంలేదన్నారు, మంత్రివర్గంలో అందరూ ఓసీలే ఉన్నారని విమర్శించారు. సామాజిక తెలంగాణ ఎప్పుడు వస్తుందని కేసీఆర్‌ను ఎంపీ ప్రశ్నించారు. బడుగు, బలహీన వర్గాల ప్రజలను అవమానిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. సీఎం కేసీఆర్‌ చేసింది రైతు రుణ మాఫీ కాదన్న ఆయన.. వడ్డీ మాఫీ మాత్రమే అని ఎద్దేవా చేశారు. వరదల వల్ల పంట నష్టపోయిన భద్రాచలం రైతులకు ఇంతవరకు పరిహారం అందలేదన్నారు. తనకు ఎమ్మెల్యే, ఎంపీ, ముఖ్యమంత్రి పదవి అవసరం లేదన్న వెంకట్‌ రెడ్డి.. బతుకు తెలంగాణ కావాలన్నారు. తన వద్ద వ్యాపారులు లేరని, తనకు గుట్టలు కొండలను అమ్ముకునే అలవాటు లేదన్నారు. సీఎం కేసీఆర్ శాసన మండలి ఛైర్మన్‌ గుత్తాసుఖేందర్‌ రెడ్డి వియ్యంకుడికి గందమల్ల రిజర్వాయర్‌ పనులు అప్పగించారని వెంకట్‌ రెడ్డి ఆరోపించారు.

కేసీఆర్‌ ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేశారని ఎంపీ ఆరోపించారు. అభివృద్ధి పనులకు నిధులు లేకపోవడంతో హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో ఉన్న భూములను అమ్మి దాంతో వచ్చిన డబ్బులతో ఖజానాలో ఉన్న లోటును పూడ్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డును కాంట్రాక్టర్లకు అప్పగించిన కేసీఆర్‌.. వచ్చిన డబ్బుతోనే రైతు రుణమాఫీ చేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. కేసీఆర్‌ సర్కార్‌ అవినీతిని కేంద్ర ప్రభుత్వం ఎందుకు ప్రశ్నించడంలేదన్నారు. బీజేపీ-బీఆర్ఎస్‌ చీకటి ఒప్పందం చేసుకున్నాయని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేస్తే.. బీఆర్‌ఎస్‌కు వేసినట్లే అన్నారు. సీఎం కేసీఆర్‌ ఎన్ని ఎత్తుగడలు వేసినా రాబోయ్యేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే అన్న ఆయన.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదట చేసేది 2 లక్షలు రైతు రుణమాపీ అన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు