Donald Trump : నేను లేకపోతే జైల్లో ఉండేవాడివి.. నెతన్యాహు కు ట్రంప్ హెచ్చరిక

అంతర్జాతీయ రాజకీయాల్లో చోటుచేసుకున్న తాజా పరిణామాలు అమెరికా, ఇజ్రాయెల్ దేశాల మధ్య ఉన్న అంతర్గత విభేదాలను బయటపెట్టాయి. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీసుకుంటున్న నిర్ణయాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

New Update
FotoJet - 2026-06-02T100124.950

trump blasts netanyahu

Donald Trump : అంతర్జాతీయ రాజకీయాల్లో చోటుచేసుకున్న తాజా పరిణామాలు అమెరికా, ఇజ్రాయెల్ దేశాల మధ్య పెరుగుతున్న అంతర్గత విభేదాలను బయటపెట్టాయి. లెబనాన్‌లోని హెజ్‌బొల్లాను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీసుకుంటున్న దూకుడు నిర్ణయాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఇటీవల నెతన్యాహుతో జరిగిన ఓ ఫోన్ సంభాషణలో ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ.. "నేనే గనుక లేకపోతే నువ్వు ఇప్పటికే జైల్లో ఉండేవాడివి.. నేను నిన్ను కాపాడుతుంటే, నీ చర్యల వల్ల ప్రస్తుతం ప్రపంచమంతా నిన్ను ద్వేషిస్తోంది, చివరికి ఇజ్రాయెల్‌ కూడా ఇష్టపడటం లేదు" అంటూ గట్టిగా మందలించినట్లు అమెరికా అధికారిక వర్గాలు వెల్లడించాయి.

హెజ్‌బొల్లా కమాండర్‌ను హతమార్చే క్రమంలో ఇజ్రాయెల్ జరిపిన దాడుల వల్ల అనేకమంది లెబనాన్ పౌరులు ప్రాణాలు కోల్పోవడం పట్ల ట్రంప్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బీరుట్ దక్షిణ ప్రాంతాలను ఖాళీ చేయాలంటూ ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరించిన నేపథ్యంలో.. లెబనాన్‌పై దాడులు కొనసాగిస్తే అమెరికాతో జరిగే దౌత్యపరమైన చర్చల నుంచి వైదొలుగుతామని ఇరాన్ హెచ్చరించడమే ఈ వివాదానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. టెల్ అవీవ్ (ఇజ్రాయెల్) తీసుకుంటున్న ఇటువంటి ఏకపక్ష నిర్ణయాలు పశ్చిమాసియాలో శాంతిని దెబ్బతీస్తున్నాయని, ఇరాన్‌తో అమెరికా జరుపుతున్న దౌత్య ప్రయత్నాలకు ప్రతిబంధకంగా మారుతున్నాయని ట్రంప్ నెతన్యాహుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

అయితే, ఈ ఉద్రిక్తతల నడుమ ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' వేదికగా స్పందిస్తూ నెతన్యాహుతో సానుకూల చర్చలు జరిగాయని పేర్కొనడం గమనార్హం. ఇజ్రాయెల్ దళాలు బీరుట్ వైపు వెళ్లవని, అటు హెజ్‌బొల్లా సైతం కాల్పుల విరమణకు అంగీకరించిందని ఆయన వెల్లడించారు. కానీ, నెతన్యాహు ప్రకటన మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. తమ నగరాలు, పౌరులపై దాడులు జరిగితే హెజ్‌బొల్లాను వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ఈ విషయాన్ని ట్రంప్‌నకు స్పష్టం చేశామని నెతన్యాహు పేర్కొనడం చూస్తుంటే.. పశ్చిమాసియా సంక్షోభంపై ఇరు దేశాల మధ్య ఇంకా స్పష్టమైన అంగీకారం కుదరలేదని అర్థమవుతోంది.

Advertisment
తాజా కథనాలు