Yolka Interceptor  :  పేలుడు పదార్థం లేకుండా శతృ డ్రోన్లను కూల్చే ‘యోల్కా’

రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న భీకర యుద్ధంలో ఇరు దేశాలు అత్యాధునిక సాంకేతికతను జోడిస్తున్నాయి. తాజాగా రష్యా అత్యంత సులభంగా ప్రయోగించే వీలున్న ‘యోల్కా’ ఇంటర్‌సెప్టర్ డ్రోన్లను వినియోగిస్తున్నట్లు రక్షణ నిపుణులు గుర్తించారు.

New Update
FotoJet (71)

Yolka Interceptor

Yolka Interceptor  :  రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న భీకర యుద్ధంలో ఇరు దేశాలు అత్యాధునిక సాంకేతికతను జోడిస్తూ సరికొత్త వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. ఇందులో భాగంగా, రష్యా సైన్యం యుద్ధరంగంలో వినూత్నమైన ఆయుధాలను రంగంలోకి దించుతోంది. ఇటీవల పిస్టల్ (తుపాకీ) మాదిరి పరికరంతో అత్యంత సులభంగా ప్రయోగించే వీలున్న ‘యోల్కా’ ఇంటర్‌సెప్టర్ (Yolka Interceptor) డ్రోన్లను రష్యా విస్తృతంగా వినియోగిస్తున్నట్లు రక్షణ నిపుణులు గుర్తించారు. శత్రువుల నిఘా డ్రోన్లను గాల్లోనే వెంటాడి వేటాడే సామర్థ్యమున్న ఈ చిన్నపాటి ఇంటర్‌సెప్టర్ డ్రోన్లకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఈ సరికొత్త 'యోల్కా' డ్రోన్లు సంప్రదాయ ఇంటర్‌సెప్టర్ డ్రోన్‌లతో పోలిస్తే పూర్తిగా భిన్నమైన రూపకల్పనను కలిగి ఉన్నాయి. ఒక చిన్న తుపాకీ లాంటి పరికరం సాయంతోనే వీటిని సైనికులు తమ చేతులతోనే నేరుగా ప్రయోగించవచ్చు. ఈ డ్రోన్లలో అమర్చిన కృత్రిమ మేధ (Artificial Intelligence-AI), అత్యాధునిక కెమెరాలు, సెన్సార్ల సహాయంతో ఇవి శత్రువుల డ్రోన్లను స్వయంగా ట్రాక్ చేయగలవు. విశేషమేమిటంటే, ఈ యోల్కా డ్రోన్లలో ఎలాంటి పేలుడు పదార్థాలు ఉండవు. ఇవి కేవలం అత్యంత వేగంతో దూసుకెళ్లి, లక్ష్యిత శత్రు డ్రోన్‌లను గాల్లోనే బలంగా ఢీకొట్టి (రామ్ చేసి) నాశనం చేస్తాయి. అందువల్ల, సైనిక పరిభాషలో వీటిని ‘ఫైర్-అండ్-ఫర్గెట్’ (ప్రయోగించు-మరచిపో) రకం ఆయుధాలుగా పేర్కొంటున్నారు.

నిర్మాణ పరంగా చూస్తే, ఈ యోల్కా డ్రోన్ స్థూపాకారంలో (Cylindrical) ఉంటూ, దీనికి 'ఎక్స్' (X) ఆకారంలో ఉండే రెండు జతల రెక్కలు అమర్చబడి ఉంటాయి. ఇవి గాల్లో చాలా వేగంగా ప్రయాణించడమే కాకుండా, ఒకే చోట స్థిరంగా (Hovering) ఉండగల సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటాయి. దీని వెనుక భాగంలో అమర్చిన శక్తివంతమైన ఎలక్ట్రిక్ మోటార్లు డ్రోన్ కదలడానికి ,నిర్దిష్ట మార్గంలో వెళ్లేందుకు అద్భుతంగా దోహదపడతాయి. గంటకు దాదాపు 200 నుండి 250 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగల ఈ ఇంటర్‌సెప్టర్ డ్రోన్లు, సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రు లక్ష్యాలను కూడా సులువుగా ఛేదించగలవని రక్షణ వర్గాలు వెల్లడించాయి.

ఈ సరికొత్త టెక్నాలజీ రష్యాకు వ్యూహాత్మకంగానే కాకుండా ఆర్థికంగానూ పెద్ద ప్లస్ పాయింట్‌గా మారింది. చిన్నగా, తేలికగా ఉండే ఈ యోల్కా డ్రోన్ల తయారీ ఖర్చు కేవలం 500 డాలర్లు (సుమారు రూ. 42,000) మాత్రమేనని అంచనా. యుద్ధరంగంలో వేల డాలర్ల విలువైన ఉక్రెయిన్ నిఘా డ్రోన్ల ముప్పును తిప్పికొట్టడానికి రష్యా ఈ తక్కువ ఖర్చుతో కూడిన ఆయుధాన్ని రూపొందించింది. గతేడాది మే నెలలో రష్యా నిర్వహించిన ప్రతిష్ఠాత్మక 'విక్టరీ డే పరేడ్'లో ఈ పరికరం మొదటిసారిగా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. రష్యా ఈ సరికొత్త వ్యూహాన్ని అమలు చేయడం ప్రారంభించిన తర్వాత ఉక్రెయిన్ సైన్యం కూడా అలర్ట్ అయ్యింది. గతంలో కేవలం 150-200 మీటర్ల తక్కువ ఎత్తులో ఎగురుతూ రష్యా దాడులకు కూలిపోతున్న తమ నిఘా డ్రోన్లను కాపాడుకునేందుకు, ప్రస్తుతం ఉక్రెయిన్ బలగాలు వాటిని ఏకంగా 900 మీటర్లకు పైగా ఎత్తులో ఎగిరేలా సరికొత్త ఎత్తుగడలను వేస్తున్నాయి.

Advertisment
తాజా కథనాలు