U.S. Central Command : ఇరాన్‌పై అమెరికా క్షిపణుల వర్షం: పశ్చిమాసియాలో తీవ్రమైన యుద్ధ ఉద్రిక్తతలు

అమెరికా, ఇరాన్ దేశాల మధ్య దశాబ్దాల శత్రుత్వం మరోసారి తీవ్రరూపం దాల్చింది.ఇరాన్‌లోని కీలక సైనిక స్థావరాలపై అమెరికా భారీ ఎత్తున దాడులకు తెగబడింది. USS Mitchell Murphy యుద్ధ నౌక నుండి 49 తోమాహాక్(Tomahawk) క్రూయిజ్ క్షిపణులను ఇరాన్ లక్ష్యాలపైకి ప్రయోగించారు.

New Update
war

US missile barrage on Iran

U.S. Central Command: అమెరికా, ఇరాన్ దేశాల మధ్య దశాబ్దాల శత్రుత్వం మరోసారి తీవ్రరూపం దాల్చింది. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, ఇరాన్‌లోని కీలక సైనిక స్థావరాలపై అమెరికా భారీ ఎత్తున దాడులకు తెగబడింది. ఆత్మరక్షణలో భాగంగానే ఈ దాడులు చేసినట్లు ప్రకటించిన యూఎస్ సెంట్రల్ కమాండ్ (U.S. Central Command), ఇందుకు సంబంధించిన ఒక వీడియోను కూడా విడుదల చేసింది. అమెరికా ప్రతిపాదించిన ఒప్పందంపై ఇరాన్ సంతకం చేయకపోతే దాడులు తప్పవంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన కొద్దిసేపటికే ఈ దాడులు జరగడం గమనార్హం. ఒకవేళ ఇరాన్ లొంగిపోకపోతే రేపు రాత్రి కూడా దాడులు కొనసాగుతాయని అమెరికా జాతీయ మీడియా వెల్లడించింది.

అమెరికా మిలిటరీకి చెందిన మెరైన్ కార్ప్స్, ఎయిర్ ఫోర్స్, మరియు నేవీ సంయుక్తంగా ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. యూఎస్ఎస్ మిచ్చెల్ మర్ఫీ (USS Mitchell Murphy) యుద్ధ నౌక నుండి సుమారు 49 తోమాహాక్ (Tomahawk) క్రూయిజ్ క్షిపణులను ఇరాన్ లక్ష్యాలపైకి ప్రయోగించారు. ఇరాన్ సరిహద్దులకు దాదాపు 64 కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యూహాత్మక స్థావరాలతో పాటు, పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలోని ఇరాన్ రాడార్, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను అమెరికా ఫైటర్ జెట్లు పూర్తిగా ధ్వంసం చేశాయి. ముఖ్యంగా అంతర్జాతీయ నౌకాయానానికి ముప్పుగా మారిన హోర్ముజ్ జలసంధి పరిసరాల్లోని ఇరాన్ సైనిక నిఘా కేంద్రాలు, కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లను టార్గెట్ చేస్తూ ఈ దాడులు జరిగాయి. ఈ దాడుల వల్ల ఇరాన్ దక్షిణ ప్రాంతంలోని మినాబ్, బందర్ అబ్బాస్, సిరిక్‌లతో పాటు రాజధాని టెహ్రాన్ పరిసర ప్రాంతాల్లో భారీ పేలుళ్లు సంభవించాయి.

అమెరికా జరిపిన ఆకస్మిక దాడులకు ఇరాన్ అంతే తీవ్రంగా స్పందించింది. అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన చమురు రవాణా మార్గమైన హర్మూజ్ జలసంధిని (Strait of Hormuz) అన్ని రకాల నౌకల కోసం మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. దీంతో పాటు అమెరికా యుద్ధనౌకల రక్షణలో వెళ్తున్న రెండు అంతర్జాతీయ చమురు ట్యాంకర్లపై ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) దళాలు దాడులు చేశాయి. పశ్చిమాసియాలోని అమెరికా మిత్రదేశాలను కూడా ఇరాన్ వదిలిపెట్టలేదు. బహ్రెయిన్‌లోని షేక్ ఇసా ఎయిర్‌బేస్, కువైట్‌లోని అలీ అల్ సలీమ్ ఎయిర్‌బేస్‌లలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ డ్రోన్లతో విరుచుకుపడింది.

ప్రస్తుతానికి ఈ విడత దాడులు ముగిశాయని, తమ దళాలు నిరంతరం అప్రమత్తంగా, పూర్తి యుద్ధ సామర్థ్యంతో ఉన్నాయని అమెరికా సెంట్రల్ కమాండ్ స్పష్టం చేసింది. మరోవైపు, అమెరికా దాడుల ధాటికి తట్టుకోలేక ఇరాన్ ప్రతినిధులు కాల్పుల విరమణ కోసం తమను ప్రాధేయపడ్డారని అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించగా, ఇరాన్ ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. ఈ పరస్పర దాడులతో పశ్చిమాసియాలో ఏ క్షణంలోనైనా పూర్తిస్థాయి యుద్ధం ముదిరే ప్రమాదం కనిపిస్తోంది.

Advertisment
తాజా కథనాలు