Iran : చమురు అమ్ముకోలేక..దాచుకోలేక..ఇరాన్‌కు కొత్త కష్టాలు

యుద్ధం కారణంగా ప్రపంచమంతా చమురు కొరతతో ఇబ్బందులు పడుతుంటే, ఇరాన్ మాత్రం భిన్నమైన సమస్యను ఎదుర్కొంటోంది. అమెరికా విధిస్తున్న ఆర్థిక దిగ్బంధనం కారణంగా ఉత్పత్తి చేసిన చమురును అమ్ముకోలేక, అలాగని వచ్చిన చమురును దాచుకోలేక ఆ దేశం సతమతమవుతోంది.

New Update
FotoJet - 2026-04-29T064705.344

Iran closes Hormuz

Iran : యుద్ధం కారణంగా ప్రపంచమంతా చమురు కొరతతో ఇబ్బందులు పడుతుంటే, ఇరాన్ మాత్రం భిన్నమైన సమస్యను ఎదుర్కొంటోంది. అమెరికా విధిస్తున్న ఆర్థిక దిగ్బంధనం కారణంగా ఉత్పత్తి చేసిన చమురును అమ్ముకోలేక, అలాగని వచ్చిన చమురును దాచుకోలేక ఆ దేశం సతమతమవుతోంది. ముఖ్యంగా హర్మూజ్ జలసంధి ద్వారా చమురు రవాణా నిలిచిపోవడం ఇరాన్ పాలిట శాపంగా మారింది.

గతంలో రోజుకు 18.5 లక్షల బ్యారెళ్లుగా ఉన్న చమురు ఎగుమతులు, డొనాల్డ్ ట్రంప్ హయాంలోని కఠిన ఆంక్షల వల్ల ప్రస్తుతం కేవలం 5.67 లక్షల బ్యారెళ్లకు పడిపోయాయి. ఏ నౌక కూడా ఇరాన్ నుంచి చమురును బయట దేశాలకు తీసుకెళ్లే పరిస్థితి లేకపోవడంతో, తీసిన చమురునంతా నిల్వ చేయడం పెద్ద సవాలుగా మారింది. ప్రస్తుతం ఇరాన్ వద్ద కేవలం 12 నుంచి 22 రోజులకు సరిపడా నిల్వ సామర్థ్యం మాత్రమే మిగిలి ఉంది.

ఒకవేళ నిల్వ చేయడానికి స్థలం లేక చమురు బావులను మూసివేస్తే, భవిష్యత్తులో వాటి నుంచి తిరిగి ఉత్పత్తి ప్రారంభించడం సాంకేతికంగా అత్యంత కష్టతరమవుతుంది. ఇది ఇరాన్ ఇంధన రంగానికి కోలుకోలేని శాశ్వత నష్టాన్ని కలిగిస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విపత్కర పరిస్థితుల వల్ల ఇరాన్ ఇప్పటికే తన ఉత్పత్తిని భారీగా తగ్గించుకుంటోంది. మే మధ్య నాటికి రోజువారీ ఉత్పత్తిని 27.5 లక్షల బ్యారెళ్ల నుంచి ఏకంగా 12-13 లక్షల బ్యారెళ్లకు పరిమితం చేయాల్సిన దుస్థితి ఏర్పడింది.

భూమి మీద ఉన్న స్టోరేజీ ట్యాంకులు ఇప్పటికే నిండిపోవడంతో, ఇరాన్ తన భారీ చమురు నౌకలనే "ఫ్లోటింగ్ స్టోరేజీ"లుగా వాడుతోంది. ప్రస్తుతం సుమారు 185 నుంచి 195 మిలియన్ బ్యారెళ్ల చమురు సముద్రంపై ఉన్న ఓడల్లోనే నిలిచిపోయింది. ఇరాన్ చరిత్రలో ఇంత భారీ మొత్తంలో చమురు నిల్వలు అమ్ముడుపోకుండా సముద్రంపైనే ఉండిపోవడం ఇదే మొదటిసారి.

Advertisment
తాజా కథనాలు