Russia-Ukarine War: రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ల వర్షం.. S-400 రక్షణ వ్యవస్థలపై భీకర దాడులు

గత వారం రష్యా జరిపిన భారీ దాడులకు ప్రతికారంగా ఉక్రెయిన్ విరుచుకుపడింది. రష్యాకు చెందిన S-400, పాంట్సిర్ లాంటి అత్యాధునిక వాయు రక్షణ వ్యవస్థలను నిర్వీర్యం చేయడమే టార్గెట్‌గా ఉక్రెయిన్ ఆదివారం రాత్రి దాడులకు పాల్పడింది.

New Update
Ukraine attack ‘largest in over a year’ in Russia

Ukraine attack ‘largest in over a year’ in Russia

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం రోజురోజుకి ముదురుతూనే ఉంది. గత వారం రష్యా జరిపిన భారీ దాడులకు ప్రతికారంగా ఉక్రెయిన్ విరుచుకుపడింది. రష్యాకు చెందిన S-400, పాంట్సిర్ లాంటి అత్యాధునిక వాయు రక్షణ వ్యవస్థలను నిర్వీర్యం చేయడమే టార్గెట్‌గా ఉక్రెయిన్ ఆదివారం రాత్రి దాడులకు పాల్పడింది. ఒకేసారి 500కు పైగా డ్రోన్‌లతో మాస్కో, దాని పరిసర ప్రాంతాలపై దాడులు చేసింది. ఈ దాడిని గతేడాది కాలంలో రష్యాపై జరిగిన అతిపెద్ద డ్రోన్ దాడి అని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల రష్యా కూడా ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై 24 గంటల్లోనే 800 డ్రోన్లను ప్రయోగించింది. ఈ దాడిలో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ ప్రతీకార దాడులకు దిగింది. 

ఉక్రెయిన్ జరిపిన ఈ డ్రోన్ దాడుల వల్ల మాస్కోలో తీవ్రంగా ప్రాణనష్టం జరిగింది. ఈ దాడుల వల్ల నలుగురు ప్రాణాలు కోల్పోయారు. వీళ్లలో ఒకరు భారతీయుడు కూడా ఉన్నాడు. ఉక్రెయిన్ భద్రతా సంస్థలు కేవలం నివాస ప్రాంతాలనే కాకుండా రష్యా ఆర్థిక, సైనిక మూలాలను దెబ్బతీసే ప్రాంతాలను టార్గెట్ చేసుకున్నాయి. ఒక చమురు పంపింగ్ స్టేషన్, రిఫైనరీతో సహా రష్యా సైనిక పరిశ్రమకు కీలకమైన సెమీకండక్టర్లను సరఫరా చేసే 'ఆంగ్‌స్ట్రామ్' ప్లాంట్‌పై సైతం దాడులు జరిగాయి. అయితే రాత్రికి రాత్రే 556 ఉక్రేనియన్ డ్రోన్‌లను తాము అడ్డుకున్నామని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అలాగే మాస్కో వైపు దూసుకొచ్చిన 120కి పైగా డ్రోన్‌లను కూల్చేశామని చెప్పింది. 

ఈ దాడి జరిగిన తర్వాత రష్యా కూడా 287 డ్రోన్‌లతో ఉక్రెయిన్‌పై ప్రతీకార దాడులకు దిగింది. అయితే ఈ ఘటనలో తొమ్మిది మంది గాయపడ్డట్లు ఉక్రెయిన్ వైమానిక దళం తెలిపింది. రష్యా ప్రయోగించిన డ్రోన్‌లలో అత్యధిక భాగాన్ని తాము సక్సెస్‌ఫుల్‌గా కూల్చినట్లు ఉక్రెయిన్ వైమానిక దళం తెలిపింది. ఈ పరస్పర దాడుల తీవ్రతను ప్రస్తావిస్తూ.. "మాస్కో ప్రజల ప్రశాంత జీవితానికి ఉన్న వన్-వే టికెట్ ఇక రద్దయినట్లే" అని ఓ ఉక్రెయిన్ సైనిక అధికారి హెచ్చరించడం ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులకు అద్దం పడుతోంది.

S-400 ప్రత్యేకత

S-400 అనేది రష్యాకు చెందిన అల్ట్రా-మోడ్రన్, లాంగ్-రేంజ్ సర్ఫేస్-టు-ఎయిర్ (నేల నుంచి గగనతలానికి ప్రయోగించే) మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన, పటిష్టమైన వాయు రక్షణ వ్యవస్థల్లో ఒకటిగా ఇది గుర్తింపు పొందింది. శత్రువులకు చెందిన యుద్ధ విమానాలు, డ్రోన్లు, స్టీల్త్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, క్రూయిజ్, బాలిస్టిక్ మిస్సైల్స్‌ను గాల్లోనే గుర్తించి దాడులు చేయగలదు. అత్యంత ఖచ్చితత్వంతో శత్రు లక్ష్యాలను కూల్చివేయడమే దీని ప్రత్యేకత. ఈ రక్షణ వ్యవస్థ దాదాపు 400 కిలోమీటర్ల దూరంలోని 30 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న టార్గెట్‌లను సులభంగా ఛేదించగలదు. అందుకే ఉక్రెయిన్ S-400vను టార్గెట్ చేసింది. 

ఈ రక్షణ వ్యవస్థ నాలుగు రకాల క్షిపణులను వినియోగిస్తుంది. ఇవి వేరువేరు దూరాల్లోని (లాంగ్, మీడియం, షార్ట్ రేంజ్) శత్రువులను అడ్డుకునేందుకు సాయపడతాయి. కేవలం 5 నిమిషాల వ్యవధిలోనే ఎక్కడికైనా తరలించేందుకు, యుద్ధానికి రెడీ అయ్యేందుకు వీలుగా మొబైల్ లాంచర్ ట్రక్కులపై అమరుస్తారు. దీనిలో ఉండే అడ్వాన్స్‌డ్ మల్టీఫంక్షన్ రాడార్ వ్యవస్థ శత్రువుల జాడను ముందుగానే పసిగడుతుంది. మిస్సైల్స్‌ను గైడ్ చేస్తుంది. రష్యా సైన్యంలో కీలకంగా ఉన్న ఈ రక్షణ సామర్థ్యం వల్లే భారత్‌పాటు పాటు చైనా, టర్కీ లాంటి దేశాలు కూడా రష్యా నుంచి S-400 క్షిపణి వ్యవస్థలను కొనుగోలు చేశాయి. గతేడాది భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో S-400 క్షిపణి వ్యవస్థ పాక్ నుంచి వచ్చిన డ్రోన్లు, క్షిపణులను విజయవంతంగా నేలకూల్చిన సంగతి తెలిసిందే. 

Advertisment
తాజా కథనాలు