/rtv/media/media_files/2025/01/22/go7yzJfLQ1qLCULdhJXL.jpg)
America President Trump
డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి బయటికి వెళ్లిపోవడం, పారిస్ అగ్రిమెంట్‌కు గుడ్ బై చెప్పడం, జన్మతః హక్కు పౌరసత్వాన్ని రద్దు చేయడం, మెక్సికో బార్డర్‌లో ఎమర్జెన్సీ విధించడం లాంటి అనేక ఎగ్జిక్యూటర్ ఆర్డర్లపై సంతకాలు చేసి చర్యలు ప్రారంభించారు. ముఖ్యంగా అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారు, వలస వచ్చినవారిలో ట్రంప్ రాకతో ఆందోళనలు మొదలయ్యాయి. 2024 అక్టోబర్‌లో ట్రంప్ ఓ సంచలన ప్రకటన చేశారు. ''ఒక రోజు నేను అమెరికా చరిత్రలోనే ఎప్పుడు లేనంతగా క్రిమినల్స్ అందరినీ దేశం నుంచి పంపించే(డిపోర్టేషన్) ప్రోగ్రామ్‌ను ప్రారంభిస్తానని'' హామీ ఇచ్చారు.
చివరికి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గెలుపు ఖరారైన తర్వాత గతేడాది నవంబర్ 18న తన సోషల్ మీడియా సైట్ అయిన ట్రూత్ సోషల్‌లో ఓ సంచలన పోస్ట్ చేశారు. తన లక్ష్యాన్ని సాధించేందుకు దేశంలో నేషనల్ ఎమర్జెన్సీని విధించి అమెరికా మిలిటరీని వాడుకుంటానని చెప్పారు. చివరికి ట్రంప్ ఈ ఏడాది జనవరి 20న అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత.. తన ప్రసంగంలో దక్షిణ సరిహద్దులో నేషనల్ ఎమర్జెన్సీని ప్రకటిస్తున్నట్లు తెలిపారు. అక్రమ వలసదారులను నియంత్రించేందుకు పెద్దఎత్తున బలగాలను మోహరిస్తున్నట్లు పేర్కొన్నారు.
అమెరికా మిలిటరీ ఏం చేయగలదు ?
అమెరికాలో అక్రమ వలసదారులను నియంత్రించేందుకు మిలిటరీని లీగల్‌గా వాడుకోవడం అనేది సంక్లిష్టమైన చర్య. డిపోర్టేషన్ కోసం మిలిటరీని వాడుకునేందుకు ట్రంప్‌కు ఏ చట్టం కూడా అడ్డురాదు. వివిధ చట్టపరమైన నియమాలు సైనిక బలగాలను, రాష్ట్ర భద్రత బలగాలను, పౌర చట్ట అమలను కంట్రోల్ చేస్తాయి. ముందుగా ట్రంప్ నేషనల్ గార్డ్ అనేక సైనిక దళం సాయం తీసుకునే అవకాశం ఉంది. ఇందులో ఉండేవారు పోలీసుగాను, అలాగే సరిహద్దుల్లోను సేవలు అందిస్తారు. నేషనల్ గార్డ్ అనేది ఆయా రాష్ట్రాల గవర్నర్ల నియంత్రణలో ఉండే రాష్ట్రీయ ఆధారిత సైనిక దళం. అయితే అధ్యక్షుడి కూడా ఈ సైనిక దళాన్ని ఫెడరల్ మిషన్ కోసం వాడుకునే సౌలభ్యం ఉంటుది.
గతంలో మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, జార్జ్ బుష్ కూడా దక్షిణ సరిహద్దులో అక్రమ వలసదారులను రాకుండా ఆపేందుకు నేషనల్ గార్డ్ బలగాలను పంపించినట్లు.. ఓ ప్రభుత్వం ఏజెన్సీ తన నివేదికలో వెల్లడించింది. అయితే అక్రమ వలసదారులను అరెస్టు చేయడం లాంటి ప్రత్యక్ష డిపోర్టేషన్ కార్యక్రమం నిర్వహించేందుకు ట్రంప్ రెగ్యులర్ భద్రతా బలగాలను రంగంలోకి దింపకపోవచ్చు. ది పొస్సే కొమిటాటస్ యాక్ట్ ప్రకారం.. దేశీయ చట్టాలు అమలు చేసేందుకు ఫెడరల్ మిలటరీని వినియోగించడం నిషేధం. కానీ ట్రంప్ కొంత సపోర్ట్ కోసం ఈ మిలటరీని రంగంలోకి దింపే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే యూఎస్ కోడ్‌లోని టైటిల్ 10 ప్రకారం.. మిలిటరీ అనేది పౌర చట్టాలను అమలు చేసే ఏజెన్సీలకు శిక్షణ, సలహాలు ఇవ్వొచ్చు. అలాగే ఇతర రకాలుగా సాయం కూడా అదించవచ్చు. కాబటి యూఎస్ మిలిటరీ అనేది ఇమిగ్రేషన్ అధికారులకు, ఇతర చట్టాలను అమలు చేసే సంస్థలకు సలహాలు, ట్రైనింగ్ ఇవ్వొచ్చు. అంతేకాదు వారికి కావాల్సిన పరికరాలను కూడా రుణంగా ఇవ్వొచ్చు.
Also Read: తస్మాత్ జాగ్రత్త... మార్కెట్ లోకి నకిలీ రూ.500 నోట్లు!
కొన్ని ఓకే, మరికొన్ని నాట్ ఓకే
ఇమిగ్రేషన్ అండ్ నేషనల్ యాక్ట్ 1996 సవరణ ప్రకారం.. వివిధ ఇమిగ్రేషన్ విధులు నిర్వహించేందుకు రాష్ట్ర, స్థానిక లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులను నియమించేందుకు ఫెడరల్ ప్రభుత్వానికి అనుమతి ఉంటుంది. అలాగే లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలను ఇందులో పాల్గొనేందుకు బలవంతపెట్టకూడదు. ఇప్పటిదాకా మేరీల్యాండ్, నార్త్ కరోలినా, అలాగే కొన్ని ఇతర ప్రాంతాల పరిధిలోని పోలీసులు.. ఇమిగ్రేషన్ అంశంలో చర్యలు తీసుకునేందుకు ఫెడరల్ అధికారులతో కలిసి పనిచేసేందుకు సుముఖత వ్యక్తం చేశారు. అయితే లాస్ ఏంజెల్స్, బోస్టన్, సౌత్ టస్కన్‌తో పాటు ఇతర ప్రాంతాల పోలీస్ శాఖలు మాత్రం తాము డిపోర్టేషన్ అంశంలో సహకరించమని ఇప్పటికే స్పష్టం చేశారు.
రూ.26 లక్షల కోట్లు కావాలి
పెద్దఎత్తున ఒకేసారి డిపోర్టేషన్ చేయడం అంటే అనేక రకాల సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. ట్రంప్ మాత్రం.. తాను 1.5 కోట్లు లేదా 2 కోట్ల మందిని దేశం నుంచి పంపించేస్తానని చెప్పారు. అమెరికాలో 1.3 కోట్ల మంది ప్రజల శాశ్వత గుర్తింపు లేకుండా ఉంటున్నారని 'ది నాన్‌ప్రాఫిట్ అమెరికన్ ఇమిగ్రేషన్ కౌన్సిల్' అంచనా వేసింది. వీళ్లందరిని దేశం నుంచి బయటకు పంపించాలంటే 315 బిలియన్ డాలర్లు (రూ.26 లక్షల కోట్లు) ఖర్చవుతుందని కూడా చెప్పింది. ప్రస్తుతం యూఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ కోసం ఉన్న బడ్జెట్ కేవలం 8 బిలియన్ డాలర్లు (రూ.66,440 కోట్లు) మాత్రమే.
కార్మికుల కొరత తథ్యం
కాబట్టి ఆర్థిక శక్తికి మించి పెద్దఎత్తున డిపోర్టేషన్ కార్యక్రమం చేపడితే అమెరికా ఆర్థికవ్యవస్థకు పెద్ద దెబ్బే పడుతుంది. ముఖ్యంగా నిర్మాణాలు, వ్యవసాయ రంగాలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. అమెరికాలోని నిర్మాణ రంగంలో పనిచేసే 20 శాతానికి పైగా వర్కర్లకు సరైన ధ్రువపత్రాలు లేవు. కాలిఫోర్నియా లాంటి వైల్డ్‌ఫైర్ ప్రమాదకర ప్రాంతాల్లో నిర్మాణ రంగంలో పనిచేసే వర్కర్లకు పెద్దఎత్తున డిమాండ్ ఉంటుంది. ఒకవేళ పెద్ద ఎత్తున డిపోర్టేషన్ జరిగితే అక్కడ కార్మికుల కొరత ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే వ్యవసాయం రంగంలో కూడా పెద్దఎత్తున కార్మికుల కొరత ఏర్పడుతుందని చెబుతున్నారు.
ట్రంప్ ఇమిగ్రేషన్ విధానాలు పౌర హక్కుల పరిరక్షణకు కూడా సవాలు కానుంది. ట్రంప్ కూడా తన డిపోర్టేషన్ ప్రణాళికను.. 1953లో అప్పటి అధ్యక్షుడు డ్వైట్ ఐసెన్‌హోవర్ నేతృత్వంలో జరిగిన ప్రయత్నాలతో పోల్చారు. 1953-54లో దక్షిణ సరిహద్దు గుండా భారీగా మెక్సికన్ వలసదారులను దేశం నుంచి పంపించేశారు. అయితే వీళ్లలో కొందరు నిజమైన అమెరికా పౌరులను కూడా ఉండటం గమనార్హం. అలాగే గ్రేట్ డిప్రెషన్ సమయంలో కూడా దేశం నుంచి పంపించిన వాళ్లలో 60 శాతం మంది వలసవచ్చిన కుటుంబాలకు జన్మించిన అమెరికా పౌరులే ఉన్నట్లు ఓ నివేదిక వెల్లడించింది. ఇప్పటికీ కూడా ఇమిగ్రేషన్ ఏజెంట్లు యూఎస్ పౌరులను అదుపులోకి తీసుకుంటున్నారు. అలాగే దేశం నుంచి పంపించివేస్తున్నారు. అదుపులోకి తీసుకున్న వలసవాదుల్లో 1 శాతం మంది అమెరికా పౌరులే ఉన్నట్లు మరో నివేదిక తెలిపింది.
Also Read: గ్రేట్ పీపుల్ మాత్రమే అమెరికాకు రావాలి..ట్రంప్
సాధ్యం కాకపోవచ్చు
2015 నుంచి 2020 మధ్య వందలాది మంది అమెరికా పౌరుల్ని అరెస్టు చేశారు. ఇందులో 70 మందిని దేశం నుంచి పంపించేశారు. ఇంకా చాలమంది పౌరసత్వం ధ్రవీకరించబడలేదు. సుప్రీంకోర్టు కూడా ఇలాంటి తప్పు ఆమోదయోగ్యం కాదని చెప్పింది. అయితే ఇప్పుడు ట్రంప్ అక్రమ వలసదారుల్ని దేశం నుంచి పంపించేందుకు సైనిక బలగాన్ని మోహరిస్తారా ? లేదా ? అనేది కీలకమైన ప్రశ్న కాదు. రాజ్యాంగ పరమైన హక్కులను గౌరవిస్తూ, ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగిస్తూ ఈ భారీ డిపోర్టేషన్ విధానాన్ని అమలు చేస్తారా ? లేదా ? అనేదే ప్రశ్న. అయితే ఇది సాధ్యం కాదనే నిపుణులు చెబుతున్నారు. ఇలా చేసేందుకు చట్టపరమైన సవాళ్లు ఎన్నో ఉన్నాయని అంటున్నారు.