US-Iran: ఇరాన్‌లో 8 మంది మహిళలకు మరణ శిక్ష.. వాళ్లని విడిచిపెట్టాలని ట్రంప్ విజ్ఞప్తి

ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్‌ ప్రభుత్వం ఎనిమిది మంది మహిళలకు మరణశిక్ష అమలు చేయనుంది. దీనిపై స్పందించిన ట్రంప్ వెంటనే వాళ్లని రిలీజ్ చేయాలని కోరారు.

New Update
Trump urges Iran to release ‘8 women facing execution’ ahead of possible peace talks

Trump urges Iran to release ‘8 women facing execution’ ahead of possible peace talks

ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనూహ్య రీతిలో శాంతి మంత్రం జపించారు. ఇరాన్‌ ప్రభుత్వం ఎనిమిది మంది మహిళలకు మరణశిక్ష అమలు చేయనుంది. దీనిపై స్పందించిన ట్రంప్ వెంటనే వాళ్లని రిలీజ్ చేయాలని కోరారు. గతంలో సైనిక చర్యకు రెడీగా ఉన్నామని హెచ్చరించిన ట్రంప్.. తాజాగా 'ట్రూత్ సోషల్' వేదికగా మర్యాదపూర్వకమైన విజ్ఞప్తి చేశారు. ఆ మహిళలను విడిచిపెడితే ఇరు దేశాల మధ్య చర్చలకు ఓ శుభారంభం అవుతుందని తెలిపారు. 

అలాగే ఈ విషయంలో అంజర్జాతీయ సమాజం, మానవ హక్కుల సంఘాలు మౌనం వహించడాన్ని కూడా ట్రంప్ నిలదీశారు. '' నా ప్రతినిధులతో చర్చలకు రెడీ అవుతున్న ఇరాన్ నాయకులకు చెబుతున్నాను. ఆ మహిళలకు ఎలాంటి హానీ కలిగించవద్దు. వాళ్లని విడుదల చేస్తే ఎంతో కృతజ్ఞతగా భావిస్తానని'' ట్రంప్ రాసుకొచ్చారు. ప్రస్తుతం ట్రంప్ ఇరాన్ పట్ల వ్యవహరిస్తున్న సానుకూల ధోరణి చర్చనీయాంశమవుతోంది. 

Also Read: అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. డీల్ కుదరకపోతే యుద్ధమేనని ట్రంప్ హెచ్చరిక

మహిళలు ఉరిశిక్ష ఎందుకు ?

ఈ ఏడాది జనవరిలో ఇరాన్ వ్యాప్తంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ నిరసనలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ నిరసనల్లో పాల్గొన్న ఎంతోమంది ఇరాన్ సర్కార్‌ అరెస్ట్ చేసింది. ఆ సమయంలో అరెస్టయిన వాళ్లలో ఈ 8 మంది మహిళలు కూడా ఉన్నారు. అయితే వీళ్లపై ఇరాన్ న్యాయస్థానాలు తీవ్రమైన ఆరోపణలు చేశాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేయడం, విదేశీ శక్తులతో (ముఖ్యంగా అమెరికాతో) చేతులు కలిపి దేశంలో అలజడి సృష్టించేందుకు యత్నించడం లాంటి కారణాలతో వీళ్లకు మరణశిక్ష ఖరారు చేశారు. అందుకే ట్రంప్ వీళ్లను విడిచిపెట్టాలని ఇరాన్‌ను కోరుతున్నారు. 

Also Read: హర్మూజ్ జలసంధిలో భారీ స్కామ్.. అధికారుల ముసుగులో కేటుగాళ్లు

ఇదిలాఉండగా అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఏప్రిల్ 22తో ముగియనుంది. దీంతో ఇరుదేశాల మధ్య ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయనేదానిపై ఆందోళన నెలకొంది. ఇప్పటికే పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌ వేదికగా జరగాల్సిన రెండో విడత చర్చలకు ఇరాన్ నిరాకరించిన సంగతి తెలిసిందే. దీంతో ట్రంప్ నేరుగా ఈ చర్చలకు హాజరయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మరి రెండోసారి ఇరుదేశాల మధ్య చర్చలు జరుగుతాయా ? లేదా మళ్లీ యుద్ధ వాతావరణం నెలకొంటుందా ? అనేది ప్రశ్నార్థకంగా మారింది. 

Advertisment
తాజా కథనాలు