Donald Trump : 'బీబీ'తో వ్యవహారం చాలా కష్టం.. జస్ట్‌ మిస్‌ లేదంటే...ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు!

ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన ఇరాన్-అమెరికా శాంతి ఒప్పందం ఎట్టకేలకు ఖరారైంది. ఒప్పందానికి సంబంధించిన తుది చర్చలు జరుగుతున్న సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తీసుకున్న ఒక నిర్ణయం చర్చల ప్రక్రియను ప్రమాదంలోకి నెట్టిందని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

New Update
FotoJet - 2026-06-15T124431.608

Donald Trump and Benjamin Netanyahu

Donald Trump : ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపిన ఇరాన్-అమెరికా శాంతి ఒప్పందం  ఎట్టకేలకు ఖరారైంది. పశ్చిమాసియాలో గత కొన్ని నెలలుగా సాగుతున్న యుద్ధ వాతావరణానికి తెరదించుతూ.. ఇరు దేశాలు అన్ని రకాల మిలిటరీ చర్యలకు తక్షణమే స్వస్తి పలికాయి. అయితే, ఈ చారిత్రాత్మక డీల్ కుదుర్చుకునే కొన్ని గంటల ముందు తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుందని, ఒకానొక దశలో ఒప్పందం పూర్తిగా కుప్పకూలే పరిస్థితి వచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా వెల్లడించారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు (బీబీ) వైఖరిపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఒప్పందానికి సంబంధించిన తుది చర్చలు జరుగుతున్న సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తీసుకున్న ఒక నిర్ణయం ప్రక్రియను పూర్తిగా ప్రమాదంలోకి నెట్టిందని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్‌తో డీల్ కుదరడానికి కొన్ని గంటల ముందే, నెతన్యాహు ఆదేశాల మేరకు ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్‌పై వైమానిక దాడులకు తెగబడింది. ఈ ఆకస్మిక దాడులపై ఇరాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చే ముప్పు తలెత్తింది. ఇరాన్ ఎదురుదాడికి సిద్ధం కావడంతో, అమెరికా బృందాలు తీవ్ర ఆందోళనకు గురయ్యాయని, కుదరబోయే ఒప్పందం కాస్తా జాప్యమైందని ట్రంప్ వివరించారు. చివరకు ఇరు పక్షాలు తేరుకుని, సుదీర్ఘ చర్చల అనంతరం కొన్ని గంటల ఆలస్యంగా డీల్‌ను ఖరారు చేశాయని, వెంట్రుక వాసిలో ఈ మహా ముప్పు తప్పిందని ఆయన వెల్లడించారు.

ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును ఉద్దేశించి ట్రంప్ మాట్లాడుతూ.. "ఆయనతో వ్యవహరించడం చాలా కష్టమైన పని. వాస్తవానికి ఈ ఒప్పందం విషయంలో ఆయన అమెరికాకు ఎంతో కృతజ్ఞతతో ఉండాలి. ఎందుకంటే.. ఒకవేళ ఇరాన్ చేతికి అణ్వాయుధం దక్కి ఉంటే, ఇజ్రాయెల్ కేవలం రెండు గంటల్లోనే భూమ్మీద నుంచి తుడిచిపెట్టుకుపోయేది. ఆ ప్రమాదం రాకుండా అమెరికా చూస్తోంది" అని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో ప్రస్తుత ఇరాన్ పాలకులు సమయస్ఫూర్తితో, ప్రాప్తకాలజ్ఞతతో వ్యవహరించారని ట్రంప్ వారికి కితాబివ్వడం గమనార్హం.

తాజా ఒప్పందం ప్రకారం ఇరాన్, అమెరికాలు తమ మిలిటరీ చర్యలను తక్షణమే నిలిపివేసాయి. ఈ చారిత్రాత్మక ఒప్పందంపై ఇరు దేశాలు జూన్ 19న స్విట్జర్లాండ్‌లో అధికారికంగా సంతకాలు చేయనున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధ చర్యలకు ఇది శాశ్వత ముగింపు అని ఇరు దేశాలు స్పష్టం చేశాయి. ఈ సంతకాల సందర్భంగా అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) ద్వారా నౌకల రాకపోకలకు సంబంధించి పూర్తిస్థాయి మార్గదర్శకాలు వెలువడతాయి. అమెరికా తన నౌకాదళ దిగ్బంధనాన్ని తొలగించనుండటంతో అంతర్జాతీయ చమురు సరఫరా మళ్లీ యథావిధిగా సాగనుంది.

అమెరికా రక్షణ కవచంపై ఆధారపడుతూనే, శాంతి చర్చలను దెబ్బతీసేలా వ్యవహరిస్తే ఇజ్రాయెల్ ఒంటరి అవ్వక తప్పదని ట్రంప్ పరోక్షంగా హెచ్చరించినట్లయింది. ఏదేమైనా జూన్ 19న జరగబోయే అధికారిక సంతకాల కార్యక్రమంపైనే ఇప్పుడు ప్రపంచ దేశాల కళ్లు ఉన్నాయి.

Advertisment
తాజా కథనాలు