/rtv/media/media_files/2026/03/23/trump-2026-03-23-17-53-22.jpg)
Trump
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై మరోసారి నిప్పులు చెరిగారు. తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్ ద్వారా ఇరాన్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ దగ్గర ఇప్పుడు ఆడుకోవడానికి ఎటువంటి కార్డులు లేవని, కేవలం అంతర్జాతీయ జలమార్గాలను అడ్డుకుంటూ ప్రపంచాన్ని కొద్దిరోజుల పాటు భయపెట్టడం తప్ప వారు ఏమీ చేయలేరని ట్రంప్ ఎద్దేవా చేశారు. ఇరాన్ ప్రస్తుతం బ్రతికి ఉందంటే దానికి కారణం చర్చలు జరపడమేనని ఆయన కుండబద్దలు కొట్టారు. మరోవైపు, అమెరికా యుద్ధ నౌకలు అత్యుత్తమ ఆయుధాలతో సిద్ధంగా ఉన్నాయని, పాకిస్థాన్‌లో జరగబోయే శాంతి చర్చలు విఫలమైతే దాడులు చేయడానికి వెనకాడబోమని ఆయన హెచ్చరించారు.
శాంతి చర్చల కోసం అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ఇప్పటికే ఇస్లామాబాద్ బయలుదేరి వెళ్లారు. ఈ చర్చల ఫలితం మరో 24 గంటల్లో తేలిపోతుందని ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్ నాయకులు ముఖం మీద ఒకటి చెబుతూ, బయట ప్రెస్‌తో మరోలా మాట్లాడుతున్నారని, వారిని నమ్మలేమని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యంగా యూరేనియం శుద్ధి విషయంలో ఇరాన్ మాట మారుస్తోందని ఆయన మండిపడ్డారు. ఇరాన్ ప్రజలు పోరాటం చేయడంలో కంటే, తప్పుడు ప్రచారం (ఫేక్ న్యూస్) చేయడంలోనూ, పబ్లిక్ రిలేషన్స్ మెయింటైన్ చేయడంలోనూ దిట్టలని ట్రంప్ ఎగతాళి చేశారు.
ఈ చర్చల్లో అమెరికా ప్రధానంగా కొన్ని డిమాండ్లను ఇరాన్ ముందు ఉంచింది. ఇరాన్ భూగర్భంలో దాచిన సుమారు 1,000 పౌండ్ల శుద్ధి చేసిన యూరేనియంను అప్పగించాలని, అలాగే అంతర్జాతీయ రవాణాకు కీలకమైన హార్ముజ్ జలసంధిని వెంటనే తెరవాలని అమెరికా కోరుతోంది. జలసంధి గుండా నౌకల రాకపోకలు స్వేచ్ఛగా సాగడం అనేది కాల్పుల విరమణ ఒప్పందంలో అత్యంత కీలకమని ట్రంప్ భావిస్తున్నారు. వీటితో పాటు ఇరాన్ తన క్షిపణి వ్యవస్థను, ఇతర ఉగ్రవాద గ్రూపులకు మద్దతు ఇవ్వడాన్ని ఆపేయాలని అమెరికా పట్టుబడుతోంది.
చర్చలకు ముందే కొన్ని షరతులు
అయితే ఇరాన్ మాత్రం చర్చలకు ముందే కొన్ని షరతులు పెట్టింది. లెబనాన్‌లో కాల్పుల విరమణ జరగాలని, అలాగే అమెరికా ఆంక్షల వల్ల విదేశీ బ్యాంకుల్లో నిలిచిపోయిన తమ కొన్ని బిలియన్ డాలర్ల ఆస్తులను విడుదల చేయాలని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాకర్ ఘాలిబాఫ్ డిమాండ్ చేశారు. ఈ రెండు షరతులు నెరవేరితేనే చర్చల్లో పాల్గొంటామని ఆయన స్పష్టం చేశారు. ఇన్ని విభేదాల మధ్య కూడా ట్రంప్ ఈ చర్చల ద్వారా శాంతి కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారని వైట్ హౌస్ ప్రతినిధి అన్నా కెల్లీ తెలిపారు. జేడీ వాన్స్ నేతృత్వంలోని బృందం ఇస్లామాబాద్‌లో ఇరాన్ మంత్రులతో జరిపే చర్చలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్నాయి.
Follow Us