Bermuda Islands : బెర్ముడా దీవుల కింద ‘సైన్స్’ గుట్టు ... 3 కోట్ల ఏళ్ల నిగూఢ రహస్యాన్ని ఛేదించిన శాస్త్రవేత్తలు!

అట్లాంటిక్‌ మహాసముద్రంలోని 'బెర్ముడా ట్రయాంగిల్‌' అనగానే మనకు మొదట గుర్తొచ్చేవి అంతుచిక్కని రీతిలో అదృశ్యమైన విమానాలు, ఓడల కథలే. బెర్ముడా ప్రాంతానికి సంబంధించి దశాబ్దాలుగా శాస్త్రవేత్తలను వేధిస్తున్న ఒక భౌగోళిక (Geological) ప్రశ్న గుట్టు తాజాగా వీడింది.

New Update
FotoJet - 2026-05-16T083146.763

Bermuda

Bermuda Islands : అట్లాంటిక్‌ మహాసముద్రంలోని 'బెర్ముడా ట్రయాంగిల్‌' అనగానే మనకు మొదట గుర్తొచ్చేవి అంతుచిక్కని రీతిలో అదృశ్యమైన విమానాలు, ఓడల కథలే. అక్కడేదో నిగూఢ శక్తి ఉందన్న ప్రచారాలను పరిశోధకులు ఎప్పటికప్పుడు కొట్టిపారేస్తూనే ఉన్నారు. అయితే, ఆ మిస్టరీ సంగతి పక్కనపెడితే.. బెర్ముడా ప్రాంతానికి సంబంధించి దశాబ్దాలుగా శాస్త్రవేత్తలను వేధిస్తున్న ఒక భౌగోళిక (Geological) ప్రశ్న గుట్టు తాజాగా వీడింది.దాదాపు 3 కోట్ల సంవత్సరాలుగా ఎలాంటి అగ్నిపర్వత విస్ఫోటాలు లేకపోయినప్పటికీ.. బెర్ముడా దీవులు పరిసర సాగరగర్భం కంటే ఎత్తయిన ప్రదేశంలో ఎలా స్థిరంగా కొనసాగుతున్నాయన్న రహస్యాన్ని పరిశోధకులు ఎట్టకేలకు కనుగొన్నారు.

సాధారణ అగ్నిపర్వత దీవుల సిద్ధాంతం ఏమిటి?
హవాయ్‌ వంటి అనేక అగ్నిపర్వత దీవుల సమూహాలు భూమిలోని మ్యాంటిల్‌ పొర నుంచి చొచ్చుకొచ్చిన వేడి, తేలియాడే రాతి భాగం (దీనిని 'మ్యాంటిల్‌ ప్లూమ్‌' అంటారు) పై ఏర్పడుతుంటాయి. ఈ పదార్థం పైకి చొచ్చుకొచ్చేకొద్దీ అగ్నిపర్వతాలు పుట్టుకొచ్చి, అక్కడి సాగరగర్భం ఒకింత ఉబ్బెత్తుగా మారుతుంది.కొంతకాలానికి భూ ఎగువపొరలోని ఫలకాలు ఈ ప్లూమ్‌ నుంచి దూరం జరుగుతాయి. దీనివల్ల అగ్నిపర్వత చర్య చల్లారిపోయి, ఆ ఉబ్బెత్తు ప్రదేశం క్రమంగా తిరిగి సాధారణ స్థితికి (కిందికి) చేరుకుంటుంది.

బెర్ముడాలో శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచిన అంశం!
బెర్ముడా విషయంలో మాత్రం ప్రకృతి సిద్ధాంతం భిన్నంగా జరిగింది. ఇక్కడ గత 3 కోట్ల సంవత్సరాలుగా ఎలాంటి అగ్నిపర్వత చర్యలు లేవు. అయినప్పటికీ, ఈ దీవి పరిసర ప్రాంతాల కంటే సుమారు 1,600 అడుగుల ఎత్తయిన ఉబ్బెత్తు ప్రదేశంపైనే స్థిరంగా కొనసాగుతోంది. ఆ ప్రదేశం ఇప్పటివరకు కిందికి కుంగిపోకపోవడం భూగర్భ శాస్త్రవేత్తలను చాన్నాళ్లుగా విస్మయానికి గురిచేసింది. ఈ రహస్యాన్ని ఛేదించడానికి 'కార్నెగీ ఇన్‌స్టిట్యూషన్‌ ఫర్‌ సైన్స్‌'కు చెందిన విలియం ఫ్రేజర్, 'యేల్‌ విశ్వవిద్యాలయ' శాస్త్రవేత్త జెఫ్రీ పార్క్‌ నేతృత్వంలోని పరిశోధక బృందం రంగంలోకి దిగింది. భారీ భూకంపాల కారణంగా ఉత్పన్నమయ్యే సైస్మిక్‌ తరంగాల (Seismic Waves) ఆధారంగా వీరు పరిశోధనలు చేశారు. ఈ తరంగాలు భూమి గుండా ప్రయాణించేటప్పుడు, అక్కడ ఎదురయ్యే పదార్థ సాంద్రత (Density), మూలకాలను బట్టి వాటి వేగం మారుతుంటుంది.

బెర్ముడాపై ఉన్న ఒక భూప్రకంపన అధ్యయన కేంద్రం సేకరించిన డేటాను శాస్త్రవేత్తలు క్షుణ్ణంగా విశ్లేషించారు. తద్వారా ఆ దీవి కింద దాదాపు 20 మైళ్ల లోతు వరకు విస్తరించిన భూ అంతర్భాగ చిత్రాన్ని (X-ray లాంటి మ్యాపింగ్) ఆవిష్కరించారు.ఈ పరిశోధనలో ఒక అనూహ్యమైన నిజం వెలుగుచూసింది. బెర్ముడా భూపైపొర కింద దాదాపు 12 మైళ్ల మందం కలిగిన ఒక భారీ శిలాపొర ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ప్రత్యేకమైన శిల.. పరిసరాల్లోని మ్యాంటిల్‌ భాగం కన్నా చాలా తక్కువ సాంద్రతను కలిగి ఉంది. సాంద్రత తక్కువగా ఉండటం వల్ల దీనికి అసాధారణ స్థాయిలో 'తేలియాడే తత్వం'లభించింది.

 ఈ రాతిపొర ఒక బలమైన 'బల్లకట్టు'లా వ్యవహరిస్తూ, తనపై ఉన్న సాగరగర్భాన్ని, బెర్ముడా దీవులను కిందకు కుంగిపోకుండా పైకే తేలియాడేలా చేస్తోంది. భూగర్భ శాస్త్రంలో ఈ ప్రక్రియను ‘అండర్‌ప్లేటింగ్‌’ అని పిలుస్తారు. కోట్ల సంవత్సరాల కిందట బెర్ముడా ప్రాంతంలో క్రియాశీల అగ్నిపర్వతాలు ఉన్న సమయంలో.. భూమి లోతుల్లో నుంచి చొచ్చుకొచ్చిన శిలాద్రవం (Magma) అక్కడే చల్లబడి, ఘనీభవించి ఈ అసాధారణ శిలాపొరగా రూపుదిద్దుకొని ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఏదేమైనా, ఇప్పటివరకు కేవలం మిస్టరీ కథలకే పరిమితమైన బెర్ముడా వెనుక ఉన్న ఈ అద్భుతమైన భౌగోళిక సత్యాన్ని సైన్స్ నిరూపించడంతో అంతర్జాతీయ శాస్త్ర సాంకేతిక రంగంలో ఈ పరిశోధన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Advertisment
తాజా కథనాలు