/rtv/media/media_files/2026/04/14/russia-2026-04-14-11-42-06.jpg)
Russia offers to take in Iran's enriched uranium
Russia: అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు చల్లార్చేందుకు రష్యా రంగంలోకి దిగింది. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా నిర్వహించిన శాంతి చర్చలు విఫలమైన నేపథ్యంలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీతో చర్చలు జరిపారు. ప్రస్తుతం నెలకొన్న సంక్షోభాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలని రష్యా సూచనలు చేసింది. దీనికి మధ్యవర్తిగా ఉండి సహకరించేందుకు తాము రెడీగా ఉన్నామని పుతిన్ సర్కార్ తేల్చిచెప్పింది.
అమెరికా మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం.. ఇరాన్ తన అణు కార్యకలాపాలపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. శుద్ధి చేసిన యురేనియం నిల్వలను అయిదేళ్ల పాటు నిలిపివేసేందుకు ఇరాన్ ప్రాథమికంగా అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల పాకిస్థాన్ చర్చల సందర్భంగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ 20 ఏళ్ల గడువును కోరారు. కానీ ఇందుకు ఇరాన్ ఒప్పుకోలేదు. కానీ ఇప్పుడు రష్యా జోక్యంతో అయిదేళ్ల గడువుకు ఇరుపక్షాల మధ్య ఒప్పందం కుదిరే ఛాన్స్ ఉంది.
Also Read: ఇరాన్ చుట్టూ అమెరికా ఉచ్చు.. 15 యుద్ధనౌకలతో భారీ దిగ్బంధనం.. ట్రంప్ సీరియస్ వార్నింగ్!
రష్యా తీసుకొచ్చిన ప్రతిపాదన ప్రకారం.. ఇరాన్ దగ్గరున్న శుద్ధి చేసిన యురేనియాన్ని రష్యాకు తరలిస్తారు. అక్కడే నిల్వ ఉంచుతారు. దీంతో ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేస్తుందని పాశ్చాత్య దేశాలు ఇక ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. అయితే ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడి భవిష్యత్ కార్యాచరణపై చర్చలు జరిపారు. పైగా రష్యాకు ఇరాన్ సన్నిహిత మిత్ర దేశంగా ఉంది. అందుకే రష్యా ప్రతిపాదన యుద్ధాన్ని నివారించడంలో కీలకంగా మారే అవకాశం ఉంది.
మరోవైపు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ కోర్టులోనే ప్రస్తుతం బంతి ఉందన్నారు. ఇరాన్ నుంచి శుద్ధి చేసిన యూరేనియంను పూర్తిగా తొలగిస్తే తాము ఒప్పందానికి సిద్ధమని స్పష్టం చేశారు. ఒకవేళ ఇరాన్.. తన యురేనియం రష్యాకు తరలించేందుకు ఒప్పుకుంటే పశ్చిమాసియాలో యుద్ధానికి బ్రేక్ పడుతుందని రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు.
Also Read: ఏప్రిల్ 14 న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి...ఆయన గురించి కొన్ని ఆసక్తికర అంశాలు
రష్యా తిరిగి యురేనియాన్ని పంపుతుందా ?
ఒకవేళ ఇరాన్.. రష్యాకు యూరేనియాన్ని తరలిస్తే రష్యా దాన్ని తిరిగి ఇరాన్‌కు పంపించనుంది. ఆ యురేనియాన్ని మరింత సాంకేతికతతో శుద్ధి చేసి విద్యుత్ ఉత్పత్తికి మాత్రమే ఉపయోగపడేలా అణు ఇంధనంగా మార్చి ఇరాన్‌ను పంపిస్తుంది. ఇదే ఈ ప్లాన్ ఉద్దేశ్యం. దీనివల్ల ఇరాన్ తమ అణు విద్యుత్ అవసరాలను తీర్చడమే కాక అణ్వాయుధ తయారీకి ఆస్కారం లేదనే నమ్మకాన్ని ప్రపంచ దేశాలకు చూపించవచ్చని రష్యా భావిస్తోంది.
కానీ రష్యా చెబుతున్న ఈ భద్రతాపరమైన హామీని ఇరాన్ ఒప్పుకోవడం లేదు. అణు కార్యక్రమం తమ దేశ సార్వభౌమత్వానికి సంబంధించిన అంశమని వాదిస్తోంది. తమ దేశంలోనే యురేనియంను శుద్ధి చేసుకునే హక్కు ఉందని చెబుతోంది. తమ దేశంలో ఉండే నిల్వలను విదేశాలకు తరలించడం మా ప్రయోజనాలకు విరుద్ధమని భావిస్తోంది. అయితే పశ్చిమాసియాలో శాంతి నెలకొనాలంటే ఇరాన్ తమ మొండి పట్టును వీడాలని అంతర్జాతీయ నిపుణులు సూచిస్తున్నారు.
Also Read: హర్మూజ్ మీదుగా వెళ్లే భారతీయ నౌకలకు ఆటంకం ఉండదు.. ఇరాన్ కీలక హామీ
Follow Us