Peyushkian : పశ్చిమాసియా ఉద్రిక్తత వేళ..ఇరాన్‌లో రాజకీయ సంక్షోభం..అధ్యక్షుడు రాజీనామా?

ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజష్కియాన్ తన పదవికి రాజీనామా చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దేశంలోని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) దళాల మితిమీరిన జోక్యంపై తీవ్ర అసంతృప్తితోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

New Update
FotoJet (90)

Iranian President Masoud Pajhwokian

Peyushkian : అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతూ ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజష్కియాన్ తన పదవికి రాజీనామా చేసినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దేశంలోని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) దళాల మితిమీరిన జోక్యం, వారి తీరుపై తీవ్ర అసంతృప్తితోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అమెరికా కేంద్రంగా పనిచేసే ఒక ఇరాన్ పత్రిక కథనం ప్రకారం, పెజష్కియాన్ ఇప్పటికే తన రాజీనామా లేఖను ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీకి పంపినట్లు తెలుస్తోంది.

పెజష్కియాన్ తన రాజీనామా లేఖలో ఇరాన్ అంతర్గత పాలనకు సంబంధించి పలు కీలక హెచ్చరికలు చేసినట్లు సదరు పత్రిక పేర్కొంది. దేశ పాలన క్రమంగా పూర్తిగా ఐఆర్‌జీసీ (IRGC) కమాండర్ల చేతుల్లోకి వెళ్లిపోతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ప్రాంతీయంగా యుద్ధ వాతావరణం ప్రారంభమైనప్పటి నుంచి, వ్యూహాత్మక మరియు కీలక నిర్ణయాల ప్రక్రియల్లో ఇరాన్ ప్రభుత్వ అధికారులను, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రతినిధులను పూర్తిగా దూరంగా ఉంచుతున్నారని ఆయన ఆరోపించినట్లు సమాచారం.

చట్టపరంగా, పరిపాలనాపరంగా అధ్యక్షుడిగా తనకు ఉన్న కనీస బాధ్యతలను, విధులను కూడా సక్రమంగా నిర్వహించనీయకుండా అడ్డుకుంటున్నారని పెజష్కియాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు కథనాలు చెబుతున్నాయి. అయితే, ఈ రాజీనామా లేఖపై ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ ఇప్పటివరకు ఎటువంటి తుది నిర్ణయం తీసుకోలేదని, ఆ లేఖను ప్రస్తుతం పెండింగ్‌లో పెట్టినట్లు అంతర్జాతీయ వర్గాలు వెల్లడించాయి.

మరోవైపు, ఈ రాజీనామా వార్తలను ఇరాన్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఇరాన్ అధ్యక్ష కార్యాలయంలోని కమ్యూనికేషన్స్ విభాగం డిప్యూటీ హెడ్ మెహదీ తబాతబాయి ఈ కథనాలపై స్పందిస్తూ.. ప్రస్తుతం అమెరికాతో కీలక చర్చలు జరుగుతున్న తరుణంలో, ఇరాన్ ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీయడానికి అంతర్జాతీయ మీడియా తప్పుడు నివేదికలతో మైండ్ గేమ్స్ ఆడుతోందని మండిపడ్డారు. తుర్కియే ప్రభుత్వ అధికారిక పత్రిక కూడా ఇరాన్ ప్రభుత్వ ఖండనను సమర్థిస్తూ నివేదికలను ప్రచురించింది.

ఇదే సమయంలో, ఇరాన్‌తో శాంతి ఒప్పంద ప్రతిపాదనలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక మార్పులు కోరడం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుత డ్రాఫ్ట్ ప్రకారం.. 60 రోజుల పాటు తాత్కాలిక కాల్పుల విరమణ పాటించడం, వ్యూహాత్మక ప్రాంతమైన హార్ముజ్ జలసంధిని అంతర్జాతీయ రవాణా కోసం తిరిగి తెరవడం వంటి అంశాలు ఉన్నాయి. అయితే, ఇరాన్ అణ్వాయుధాల తయారీని పూర్తిగా శాశ్వతంగా వదిలిపెట్టాలనే ప్రధాన డిమాండ్‌పైనే ట్రంప్ గట్టిగా పట్టుబట్టినట్లు అమెరికా మీడియా స్పష్టం చేసింది. ఒప్పందం విషయంలో తాము ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోబోమని ట్రంప్ ఇటీవల వ్యాఖ్యానించారు.

అమెరికా పట్టుబడుతున్న ఈ మార్పులపై ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాఘేర్ ఘాటుగా స్పందించారు. ఇరాన్ సార్వభౌమత్వాన్ని, దేశ హక్కులను మరియు ప్రయోజనాలను కాపాడని ఏ రకమైన శాంతి ఒప్పందానికి (డీల్‌కు) తాము ఎంతమాత్రం అంగీకరించబోమని ఆయన స్పష్టం చేశారు. ఇటు అంతర్గతంగా అధ్యక్షుడి రాజీనామా ప్రచారం, అటు అంతర్జాతీయంగా అమెరికాతో కుదుర్చుకోవాల్సిన ఒప్పందంలో ప్రతిష్టంభన నెలకొనడంతో ప్రస్తుతం ఇరాన్ రాజకీయం అత్యంత ఉత్కంఠభరితంగా మారింది.

Advertisment
తాజా కథనాలు