/rtv/media/media_files/2026/01/08/trump-2026-01-08-12-02-33.jpg)
Trump
Ceasefire: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్‌తో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. పాకిస్థాన్ విజ్ఞప్తి మేరకు ఇరాన్‌పై ప్రస్తుతం అమలులో ఉన్న కాల్పుల విరమణను (Ceasefire) మరోసారి పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. అధ్యక్షుడు ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ట్రూత్ సోషల్' ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ఇరాన్ ప్రభుత్వం ప్రస్తుతం అంతర్గతంగా తీవ్రమైన ఒడిదొడుకులను ఎదుర్కొంటోందని ఆయన అభిప్రాయపడ్డారు. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ చేసిన అభ్యర్థనను మన్నిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
కాల్పుల విరమణను పొడిగించినప్పటికీ, ఇరాన్‌పై ఆర్థిక మరియు సైనిక ఒత్తిడిని తగ్గించే ప్రసక్తే లేదని ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్ రేవుల దిగ్బంధనం యథావిధిగా కొనసాగుతుందని, అమెరికా సైన్యం ఏ క్షణమైనా దాడులకు సిద్ధంగా ఉంటుందని హెచ్చరించారు. ఇరాన్ తన తుది ప్రతిపాదనలను సమర్పించే వరకు మాత్రమే ఈ వెసులుబాటు ఉంటుందని ట్రంప్ సూచించారు. "చర్చల ద్వారా తేల్చుకుంటారా లేక మరోలానా అనేది ఇరాన్ చేతుల్లోనే ఉంది" అని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.
గత కొద్ది రోజులుగా అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ క్రమంలో పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహిస్తూ ఇస్లామాబాద్‌లో శాంతి చర్చలకు వేదికైంది. ఇప్పటికే ఒక విడత చర్చలు ముగిసినా, ఎలాంటి స్పష్టమైన ఒప్పందం కుదరలేదు. ఈ తరుణంలో ఇరాన్ నాయకత్వం నుండి సరైన స్పందన రాకపోవడంతో ట్రంప్ దాడులకు సిద్ధమయ్యారు. అయితే, దౌత్య మార్గాల ద్వారా పరిష్కరించుకోవడానికి పాక్ మరో అవకాశం కోరడంతో కాల్పుల విరమణ పొడిగింపునకు మార్గం సుగమమైంది. మరోవైపు ట్రంప్ నిర్ణయంపై ఇరాన్ భిన్నంగా స్పందించింది. అమెరికా విధిస్తున్న షరతులు ఆమోదయోగ్యం కాదని, దిగ్బంధనం కొనసాగిస్తూ కాల్పుల విరమణను పొడిగించడం అంటే అర్థం లేదని ఇరాన్ పార్లమెంట్ ప్రతినిధులు వ్యాఖ్యానించారు.ప్రస్తుతానికి యుద్ధం ముప్పు తప్పినప్పటికీ, ఇరాన్ తన పంథాను మార్చుకోకపోతే మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉంది. రాబోయే కొద్ది రోజులు దౌత్యపరంగా అత్యంత కీలకం కానున్నాయి.
Follow Us