Pakistan : బ్రోకర్ పనికి కూడా పనికిరాని పాక్..   క్రెడిట్ కోసం డబుల్ గేమ్!

ప్రపంచ దేశాలన్నీ ఊపిరి పీల్చుకుంటాయనుకున్న తరుణంలో అమెరికా,  ఇరాన్ మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం కేవలం కొన్ని గంటల్లోనే కుప్పకూలిపోయేలా కనిపిస్తోంది.

New Update
pakistan

ప్రపంచ దేశాలన్నీ ఊపిరి పీల్చుకుంటాయనుకున్న తరుణంలో అమెరికా,  ఇరాన్ మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం కేవలం కొన్ని గంటల్లోనే కుప్పకూలిపోయేలా కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం మధ్యవర్తిగా వ్యవహరించిన పాకిస్థాన్ చేసిన ఒక పెద్ద తప్పు అని ఇప్పుడు అంతర్జాతీయ వేదికలపై చర్చ జరుగుతోంది. ఏప్రిల్ 8న పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఈ ఒప్పందాన్ని ప్రకటించినప్పుడు, అది పాకిస్థాన్‌కు దక్కిన అతిపెద్ద దౌత్య విజయమని అంతా సంబరపడ్డారు. కానీ ఆ సంతోషం ఎంతో సేపు నిలవలేదు.

రెండు దేశాలకు వేర్వేరు సమాచారాలు

అసలు గొడవ ఎక్కడ వచ్చిందంటే, ఈ ఒప్పందం ఎక్కడెక్కడ వర్తిస్తుంది అనే విషయంలో పాకిస్థాన్ రెండు దేశాలకు వేర్వేరు సమాచారాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇరాన్ మిత్రదేశమైన లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు ఆపడం కూడా ఈ ఒప్పందంలో భాగమని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తన ట్వీట్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. లెబనాన్‌తో సహా అన్ని చోట్లా కాల్పులు ఆగిపోతాయని ఆయన చెప్పారు. అయితే, ఇజ్రాయెల్, అమెరికా మాత్రం లెబనాన్ అసలు ఈ ఒప్పందంలోనే లేదని తేల్చి చెప్పాయి. ఒప్పందం జరిగిన కొన్ని గంటల్లోనే ఇజ్రాయెల్ లెబనాన్‌పై విరుచుకుపడి వందలాది మందిని పొట్టనబెట్టుకోవడంతో పరిస్థితి విషమించింది.

దీంతో ఇప్పుడు పాకిస్థాన్ పాత్రపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇరాన్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని లెబనాన్ కూడా ఇందులో ఉందని ఇరాన్‌కు చెప్పి ఉండవచ్చని, అదే సమయంలో అమెరికాకు మాత్రం మరోలా చెప్పి ఉండవచ్చని నిపుణులు అనుమానిస్తున్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ కూడా ఇదే విషయాన్ని పరోక్షంగా చెబుతూ, లెబనాన్‌పై దాడులు ఆపుతామని తాము ఎప్పుడూ ప్రామిస్ చేయలేదని, ఇరాన్ ప్రతినిధులు పొరపాటు పడి ఉండవచ్చని వ్యాఖ్యానించారు. దీనివల్ల ఇరాన్ ఒక్కసారిగా ఆగ్రహానికి గురై, ఈ ఒప్పందానికి అర్థం లేదని ప్రకటించి హార్ముజ్ జలసంధిని మళ్లీ మూసివేసింది.

అయితే రాజకీయ విశ్లేషకులు పాకిస్థాన్ తీరును ఎద్దేవా చేస్తున్నారు.  కేవలం క్రెడిట్ కొట్టేయాలనే ఆరాటంలో పాకిస్థాన్ ఈ ఒప్పందాన్ని చెడగొట్టిందని విమర్శిస్తున్నారు. గతంలో కూడా పాక్ ప్రధాని పెట్టిన ఒక ట్వీట్‌లో డ్రాఫ్ట్ అనే పదం ఉండటం చూసి, అది అమెరికా రాసిచ్చిన స్క్రిప్ట్ అని సోషల్ మీడియాలో ట్రోల్స్ వచ్చాయి. ఇప్పుడు లెబనాన్ విషయంలో జరిగిన ఈ గందరగోళం వల్ల రెండు దేశాల మధ్య మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. పాకిస్థాన్ చేసిన ఈ అనాలోచిత పని వల్ల మధ్యవర్తిగా ఆ దేశం నమ్మకాన్ని కోల్పోవడమే కాకుండా, ప్రపంచ శాంతిని కూడా ప్రమాదంలోకి నెట్టినట్లు అయింది.

Advertisment
తాజా కథనాలు