/rtv/media/media_files/2025/12/08/trump-2025-12-08-22-04-44.jpg)
Trump
Donald Trump : అమెరికాలోని అక్రమ వలసదారులపై డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం తన చర్యలను మరింత తీవ్రతరం చేసింది. దేశ భద్రత, ఆర్థిక ప్రయోజనాలే ధ్యేయంగా ఇప్పటికే వేల సంఖ్యలో అక్రమ వలసదారులను గుర్తించి, వారి స్వదేశాలకు డిపోర్ట్ (తిప్పి పంపడం) చేసింది. ఈ నేపథ్యంలో వలసలపై తన దూకుడును పెంచిన అధ్యక్షుడు ట్రంప్, మరోసారి అంతర్జాతీయ వలస విధానాలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇతర దేశాల నుంచి భారీగా ప్రజలు అమెరికాకు తరలిరావడం వల్ల దేశ భవిష్యత్తు, ఆర్థిక ముఖచిత్రం పూర్తిగా దెబ్బతింటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
పేద దేశాల నుంచి పెద్దఎత్తున ప్రజలు అమెరికాకు వస్తే, ఇక్కడి వనరులపై భారం పడి భవిష్యత్తులో అమెరికా కూడా పేద దేశంగా మారే ప్రమాదం ఉందంటూ ట్రంప్ హెచ్చరించారు. పరిస్థితి చేతులు దాటిపోకముందే కఠిన నిర్ణయాలు తీసుకోవాలని, వలసలను పూర్తిగా అరికట్టడం ద్వారానే ‘అమెరికాను మళ్లీ గొప్ప దేశంగా మార్చడం’ (Make America Great Again) సాధ్యమవుతుందని ఆయన తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ట్రూత్ సోషల్' వేదికగా స్పష్టం చేశారు.
మరోవైపు, నైపుణ్యం కలిగిన విదేశీ ఐటీ నిపుణులకు ఇచ్చే హెచ్-1బీ (H-1B) వీసాల విషయంలోనూ ట్రంప్ యంత్రాంగం కఠిన వైఖరిని అవలంబిస్తోంది. ఈ నెల ప్రారంభంలో హెచ్-1బీ వీసాలపై విధించాలనుకున్న లక్ష డాలర్ల భారీ రుసుమును అక్కడి ఫెడరల్ కోర్టు కొట్టివేయడంపై ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫెడరల్ జడ్జిలు ప్రభుత్వ నిర్ణయాలను అడ్డుకుంటూ తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన విమర్శించారు.
ఈ వివాదంపై వైట్‌హౌస్ అధికార ప్రతినిధి టేలర్ రోజర్స్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. గత కొన్ని దశాబ్దాలుగా హెచ్-1బీ వీసా కార్యక్రమం తీవ్రంగా దుర్వినియోగమవుతోందని, స్థానిక అమెరికన్ల ఉపాధిని దెబ్బతీసేలా ఉన్న ఈ లోపాలను సరిదిద్దడానికే అధ్యక్షుడు ట్రంప్ పలు సంస్కరణలు చేపట్టారని ఆమె మద్దతుగా నిలిచారు. గతంలో వాషింగ్టన్‌లోని ఒక ఫెడరల్ జడ్జి ఇటువంటి కఠిన ఆదేశాలనే సమర్థించిన విషయాన్ని గుర్తు చేస్తూ, వీసా ఫీజుల విషయంలోనూ ఉన్నత న్యాయస్థానాల నుంచి ప్రభుత్వానికి సానుకూల నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నట్లు రోజర్స్ పేర్కొన్నారు. ఈ పరిణామాలు ముఖ్యంగా భారతీయ ఐటీ నిపుణులలో తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి.
Follow Us