/rtv/media/media_files/2026/03/24/iran-2026-03-24-17-37-49.jpg)
Major Shift in West Asia, Iran Considers Deal Amidst Ongoing Conflict
పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ తాజాగా సంచలన ప్రకటన చేశారు. అమెరికాతో చర్చలు జరిపేందుకు, ఒప్పందం కుదుర్చుకునేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారని ఇజ్రాయెల్ మీడియా తెలిపింది. అమెరికా రాయబారి స్టీవ్ విట్కాఫ్, ఇరాన్ మంత్రి అరాఘ్చీ మధ్య జరిగిన చర్చలను ఇరాన్ హైకమాండ్ ఆమోదించినట్లు చెప్పింది. ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై 5 రోజుల పాటు దాడులు నిలిపివేస్తామని ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ ఇరాన్ మాత్రం తాము ఎవరితో చర్చలు జరపలేదని.. ట్రంప్ వెనక్కి తగ్గారంటూ చెబుతోంది.
యుద్ధం ఆపాలంటే ఇరాన్ ప్రతిపాదనలు
యుద్ధం ఆపాలంటే ఇరాన్ పలు కీలక ప్రతిపాదనలు చేసే అవకాశం ఉంది.
సైనిక ఉపసంహరణ
పశ్చిమాసియా నుంచి అమెరికా దళాలు పూర్తిగా వెళ్లిపోవాలని ఇరాన్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోంది. ఈసారి కూడా అమెరికాతో ఈ డిమాండ్ చేయొచ్చు.
ఆంక్షల ఎత్తివేత
అమెరికా విధించిన ఆర్థిక ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయాలని ఇరాన్ డిమాండ్ చేసే ఛాన్స్ ఉంది.
భద్రతా గ్యారెంటీ
భవిష్యత్తులో తమ దేశంపై లేదా ఇరాన్ అనుకూల గ్రూపులపై దాడులు చేయబోమని అమెరికా, ఇజ్రాయెల్ గ్యారెంటీ ఇవ్వాలి.
ఆర్థిక పరిహారం
ఈ యుద్ధంలో ఇరాన్ మౌలిక సదుపాయాలను దెబ్బతీసినందుకు అమెరికా, ఇజ్రాయెల్‌ల నుంచి భారీ పరిహారాన్ని డిమాండ్ చేసే ఛాన్స్ ఉంది.
హోర్ముజ్ జలసంధిపై పట్టు
ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన మార్గమైన హోర్ముజ్ జలసంధిపై తన నియంత్రణను లేదా ఉమ్మడి పర్యవేక్షణను కోరే అవకాశం ఉంది.
గతంలో కూడా ఇరాన్ పలు ప్రతిపాదనలు చేసింది.
2015 అణు ఒప్పందం (JCPOA)
గతంలో తమపై విధించిన ఆంక్షలు తొలగిస్తే అణు కార్యక్రమాలను నియంత్రిస్తామని ఇరాన్ 2015లో ఒప్పందం కుదుర్చుకుంది. కానీ 2018లో అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ట్రంప్ ఈ ఒప్పందం నుంచి వైదొలిగారు.
ప్రాంతీయ భద్రతా ఒప్పందం
పొరుగున ఉన్న అరబ్ దేశాలతో కలిసి 'ప్రాంతీయ రక్షణ కూటమి'ని ఏర్పాటు చేయాలని గతంలో ఇరాన్ ప్రతిపాదన చేసింది. అంటే అమెరికా, ఇజ్రాయెల్ లాంటి బయటి శక్తుల జోక్యం ఉండకూడదని గతంలో ప్రతిపాదించింది.
చమురు ధరలపై ప్రభావం
ఒకవేళ ఇరాన్, అమెరికా మధ్య చర్చలు సఫలమై, యుద్ధం ఆగిపోతే.. చమురు ధరలు తగ్గుతాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ చమురు ధర $5 నుంచి $10 వరకు తగ్గే ఛాన్స్ ఉంది. అలాగే ఇరాన్‌పై ఉన్న ఆంక్షలు పాక్షికంగా సడలిస్తే.. ఆ దేశానికి చెందిన చమురు ఎగుమతులు పెరుగుతాయి. దీని ఫలితంగా ప్రపంచ మార్కెట్‌లో సరఫరాను పెంచి ధరలు నియంత్రణలోకి వస్తాయి. మరోవైపు
భారత్ తమ అవసరాల కోసం 80 శాతానికి పైగా చమురును విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఒకవేళ పశ్చిమాసియాలో యుద్ధం ఆగిపోతే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయి. చమురు, గ్యాస్ కొరత ఉండదు. అలాగే ద్రవ్యోల్బణం కూడా తగ్గుతుంది.
Follow Us