/rtv/media/media_files/2026/04/06/strait-of-hormuz-2026-04-06-11-39-36.jpg)
america iran
అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం నెలకొన్న విషయం తెలిసిందే. అయితే అంతర్జాతీయ వ్యాపారానికి ఎంతో కీలకమైన హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై రుసుములు వసూలు చేసే విషయంలో అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కొత్త వివాదం మొదలైంది. ఈ జలసంధి మార్గంలో ఎలాంటి టోల్ టాక్స్ ఉండబోదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. కానీ ఇరాన్ మాత్రం దానికి ఒక కొత్త మెలిక పెట్టింది. తాము నేరుగా టోల్ వసూలు చేయకపోయినప్పటికీ, నౌకలకు అందించే రకరకాల సేవల పేరుతో 'సర్వీస్ ఛార్జీలు' మాత్రం కచ్చితంగా వసూలు చేస్తామని ఇరాన్ స్పష్టం చేసింది. ఈ విషయాన్ని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బకేయి అధికారికంగా వెల్లడించారు.
తమ సరిహద్దుల్లో ఉన్న హర్మూజ్ జలసంధి గుండా నౌకలు ప్రయాణిస్తున్నందుకు ఎలాంటి ట్రాన్సిట్ టోల్ వసూలు చేయడం లేదని, ఈ విషయాన్ని తాము ఎప్పటి నుంచో చెబుతున్నామని ఇరాన్ ప్రతినిధి పేర్కొన్నారు. అయితే సముద్రంలో ప్రయాణించే నౌకల భద్రత, నావిగేషన్ సేవలు, పర్యావరణ పరిరక్షణ, నౌకలకు అందించే బీమా సౌకర్యాలు, ఇతర సముద్రయాన సేవల కోసం కొంత రుసుమును మాత్రం వసూలు చేస్తామని తెలిపారు. ఇదే సమయంలో అమెరికాతో యుద్ధాన్ని ముగించడానికి ఒక ఒప్పందానికి వచ్చినప్పటికీ, తాము అమెరికాను పూర్తిగా నమ్మలేమని ఇరాన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. గతంలో అమెరికాతో ఎదురైన చేదు అనుభవాల వల్లే తాము ఈ నిర్ణయానికి వచ్చామని ఇరాన్ స్పష్టం చేసింది.
నిజానికి అంతర్జాతీయ సముద్ర చట్టాలను పర్యవేక్షించే ఐక్యరాజ్యసమితి (UN) ఒప్పందాల ప్రకారం.. ఒక దేశ సరిహద్దులో సహజంగా ఏర్పడిన జలసంధి గుండా వేరే దేశాల నౌకలు వెళ్తున్నప్పుడు, వాటి నుంచి ఎలాంటి ఫీజులు వసూలు చేయడానికి ఆ దేశానికి హక్కు లేదు. అయితే, నౌకలకు గైడెన్స్ ఇవ్వడం, వేరే బోట్లతో లాగడం, లేదా పోర్టు సేవలు అందించినప్పుడు మాత్రం పరిమితంగా ఫీజులు తీసుకోవచ్చు. కానీ, ఈ ఫీజుల నెపంతో ఏ ఒక్క దేశాన్ని కావాలని టార్గెట్ చేయకూడదు. ప్రకృతి పరంగా ఏర్పడిన జలసంధులకు, మనుషులు తవ్విన కాలువలకు చట్టాలు వేరుగా ఉంటాయి. ఉదాహరణకు అంతర్జాతీయ వాణిజ్యంలో కీలకమైన సూయిజ్, పనామా కాలువలు మనుషులు తవ్వినవి. కాబట్టి వాటిని నిర్వహిస్తున్న ఈజిప్ట్, పనామా దేశాలకు ఫీజులు వసూలు చేసుకునే అనుమతి ఉంది. అయితే ఒకవైపు ఇరాన్ తన అణ్వాయుధాలను వదులుకోవడానికి సిద్ధపడి.. ఈ కొత్త ఛార్జీల వ్యవహారం మళ్లీ ఉద్రిక్తతలకు దారితీస్తోంది. ఇరాన్ గనుక సర్వీస్ ఛార్జీల పేరుతో నౌకలపై అదనపు భారం మోపితే.. హర్మూజ్ జలసంధి ప్రాంతంలో మళ్లీ యుద్ధం మొదలవ్వచ్చు.
Follow Us