Netanyahu: అప్పుడు బెదిరించింది.. ఇప్పుడు భయపడుతోంది: ఇరాన్‌పై నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు

ఇరాన్ అణు కార్యక్రమాన్ని, క్షిపణి వ్యవస్థలను మేము పూర్తిగా దెబ్బతీశామని, ఇప్పుడు ఆ దేశం ఉక్కిరిబిక్కిరి అవుతోందని ఇజ్రాయెల్ ప్రధాని బెన్జమిన్ నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశారు.

New Update
iran and us

Netanyahu: ఇరాన్ అణు కార్యక్రమాన్ని, క్షిపణి వ్యవస్థలను మేము పూర్తిగా దెబ్బతీశామని, ఇప్పుడు ఆ దేశం ఉక్కిరిబిక్కిరి అవుతోందని ఇజ్రాయెల్ ప్రధాని బెన్జమిన్ నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై దాడులు మొదలుపెట్టినప్పటి నుంచి పరిస్థితి పూర్తిగా మారిపోయిందని ఆయన అన్నారు. ఒకప్పుడు హమాస్, హిజ్బుల్లా వంటి ముఠాల ద్వారా ఇజ్రాయెల్‌ను చుట్టుముట్టి అంతం చేయాలని ఇరాన్ చూసిందని, కానీ ఇప్పుడు ఇరానే మనుగడ కోసం పోరాడుతోందని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ వేసిన పన్నాగాలను చిత్తు చేస్తూ తాము చారిత్రాత్మక విజయాలు సాధించామని నెతన్యాహు ధీమా వ్యక్తం చేశారు.

Also Read: ఇస్లామాబాద్ చర్చలు ఎందుకు విఫలమయ్యాయి? అసలు కారణాలు ఇవే!

ఎటువంటి ఫలితం లేకుండా

మరోవైపు, ఉద్రిక్తతలను తగ్గించేందుకు పాకిస్తాన్ వేదికగా అమెరికా, ఇరాన్ మధ్య శనివారం నుంచి జరిగిన చర్చలు ఎటువంటి ఫలితం లేకుండా ముగిశాయి. సుమారు 21 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ చర్చల్లో ఎలాంటి పురోగతి లేదని అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వెన్స్ ఆదివారం ప్రకటించారు. తాము ఎంతో నమ్మకంతో, సరళంగా వ్యవహరించినప్పటికీ, భవిష్యత్తులో అణు ఆయుధాలను తయారు చేయబోమని ఇరాన్ నుంచి స్పష్టమైన హామీ రాలేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఈ చర్చల విఫలం వల్ల అమెరికా కంటే ఇరాన్‌కే ఎక్కువ నష్టం జరుగుతుందని ఆయన హెచ్చరించారు.

Also Read: తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్ : ఈసారి కూడా అమ్మాయిలదే హవా!

అయితే, ఈ చర్చలు విఫలం కావడానికి అమెరికా పెట్టిన గొంతెమ్మ కోర్కెలే కారణమని ఇరాన్ ఆరోపిస్తోంది. తాము ఎన్నో ప్రతిపాదనలు చేసినా, అమెరికా మొండిగా వ్యవహరించడం వల్లే చర్చలు ఆగిపోయాయని ఇరాన్ అధికారిక మీడియా పేర్కొంది. అటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ, సైనికపరంగా తాము విజయం సాధించామని, ఇరాన్ సేనలు సర్వనాశనం అయ్యాయని వ్యాఖ్యానించారు. అలాగే ఇరాన్‌కు మద్దతు ఇస్తున్న చైనాకు కూడా మున్ముందు ఇబ్బందులు తప్పవని ఆయన హెచ్చరించారు.

ఇదే సమయంలో సముద్ర మార్గంలో కూడా ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇరాన్ పెట్టిన మందుపాతరలను తొలగించేందుకు తమ యుద్ధనౌకలు హోర్ముజ్ జలసంధిలోకి ప్రవేశించాయని అమెరికా చెబుతుండగా, ఇరాన్ ఆ వార్తలను ఖండించింది. తమ జలాల్లోకి ఏవైనా విదేశీ యుద్ధనౌకలు వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో, ఇరు దేశాల మధ్య శాంతిని నెలకొల్పేందుకు తాము నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటామని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ తెలిపారు.

Advertisment
తాజా కథనాలు