/rtv/media/media_files/2026/04/08/us-2026-04-08-18-47-40.jpg)
అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ సంచలన కామెంట్స్ చేశారు. అమెరికా చేపట్టిన ‘ఆపరేషన్ ఎఫిక్ ఫ్యూరీ’ అద్భుత విజయాన్ని సాధించిందని, ఈ దెబ్బతో ఇరాన్ తన సైనిక గర్వాన్ని కోల్పోయిందన్నారు. వైట్‌హౌస్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
కాల్పుల విరమణ కోసం ఇరాన్ ప్రభుత్వం అమెరికా ముందు ప్రాధేయపడిందని హెగ్సెత్ ఆరోపించారు. వాస్తవానికి నిమిషాల వ్యవధిలోనే ఆ దేశాన్ని పూర్తిగా నామరూపాల్లేకుండా చేసే శక్తి అమెరికాకు ఉన్నప్పటికీ, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దయతో శాంతికి అవకాశం ఇచ్చారని చెప్పారు. అమెరికా విధించిన కఠిన షరతులకు ఇరాన్ ఒప్పుకోకపోతే, ఆ దేశంపై ఇంకా భీకరమైన దాడులు జరిగేవని ఆయన హెచ్చరించారు.
ఇరాన్ నుంచి అమెరికాకు
వరుస దాడులతో ఇరాన్ సైన్యాన్ని అమెరికా దళాలు చిన్నాభిన్నం చేశాయని హెగ్సెత్ వెల్లడించారు. ముఖ్యంగా మంగళవారం రాత్రి ఏకంగా 800 లక్ష్యాలపై అమెరికా విరుచుకుపడింది. ఈ దాడుల్లో ఇరాన్‌కు చెందిన రక్షణ కేంద్రాలు, అణు పారిశ్రామిక స్థావరాలు, ఫ్యాక్టరీలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. గత 47 ఏళ్లుగా ఇరాన్ నుంచి అమెరికాకు పొంచి ఉన్న ముప్పు ఇప్పుడు శాశ్వతంగా తొలగిపోయిందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇకపై ఇరాన్ క్షిపణులను తయారు చేసుకునే స్థితిలో కూడా లేదని స్పష్టం చేశారు.
ఈ యుద్ధంలో మరో పెద్ద పరిణామం ఏమిటంటే.. ఇజ్రాయెల్‌తో కలిసి అమెరికా జరిపిన సంయుక్త దాడుల్లో ఇరాన్ సుప్రీం నేత మొజ్తాబా ఖమేనీ తీవ్రంగా గాయపడ్డారని హెగ్సెత్ ప్రకటించారు. దేశ నాయకత్వమే దెబ్బతినడంతో ఇరాన్ పూర్తిగా నైతిక స్థైర్యాన్ని కోల్పోయిందని ఆయన వివరించారు. మొత్తం మీద ఆపరేషన్ ఎఫిక్ ఫ్యూరీతో ఇరాన్‌ను అమెరికా తన గుప్పిట్లోకి తెచ్చుకుందని ఈ వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతోంది.
పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో ఆరు వారాల పోరు తర్వాత ఈ రెండు వారాల కాల్పుల విరమణ కుదిరింది. ఇరాన్ చర్చలకు రాకపోతే ఒక నాగరికతే అంతమవుతుందని ట్రంప్ హెచ్చరించిన రెండు గంటలకే ఈ ఒప్పందం కుదరడం గమనార్హం. అయితే, ఒప్పందం కుదిరిన వెంటనే ఇరాన్‌లోని లావన్ ఆయిల్ రిఫైనరీపై దాడులు జరగడం, దానికి ప్రతికారంగా ఇరాన్ కువైట్, యూఏఈ, సౌదీ అరేబియాపై డ్రోన్ దాడులు చేయడం ఇప్పుడు అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది.
Follow Us