Iran-Isarel: నెతన్యాహుపై అవినీతి కేసులు.. ఇరాన్ సంచలన ఆరోపణలు

ఇరాన్ మాజీ రక్షణశాఖ మంత్రి మహమ్మద్ రెజా అష్తియాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు తనపై ఉన్న అవినీతి,  క్రిమినల్ కేసుల నుండి తప్పించుకునేందుకే యుద్ధాన్ని ఓ కవచంలా వాడుకుంటున్నారని విమర్శించారు.

New Update
Iran Claims Netanyahu Prolonging Conflict to Escape Corruption Trials

Iran Claims Netanyahu Prolonging Conflict to Escape Corruption Trials

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న తరుణంలో ఇరాన్, ఇజ్రాయెల్‌ మధ్య మరింత వివాదం ముదురుతోంది. తాజాగా ఇరాన్ మాజీ రక్షణశాఖ మంత్రి మహమ్మద్ రెజా అష్తియాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు తనపై ఉన్న అవినీతి,  క్రిమినల్ కేసుల నుండి తప్పించుకునేందుకే యుద్ధాన్ని ఓ కవచంలా వాడుకుంటున్నారని విమర్శించారు. నెతన్యాహు రాజకీయ ఉనికి ఇప్పుడు యుద్ధం మీదనే ఆధారపడి ఉందన్నారు. ఒకవేళ యుద్ధం ముగిస్తే ఆయన నేరుగా జైలుకు వెళ్లాల్సి ఉంటుందని ఆరోపించారు. 

నెతన్యాహు కేవలం తన వ్యక్తిగత ప్రయోజనం కోసమే యుద్ధాన్ని వాడుకుంటున్నారని మండిపడ్డారు. ఇజ్రాయెల్ ప్రజల భద్రత కోసం కాకుండా.. తనపై ఉన్న అవినీతి కేసుల విచారణను అడ్డుకునేందుకే యుద్ధాన్ని సాగదీస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గాజా, లెబనాన్‌లలో జరుగుతున్న పౌరుల మరణాలకు నెతన్యాహునే ప్రధాన బాధ్యుడన్నారు. అలాగే అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ICC) ఆయనపై వెంటనే అరెస్ట్ వారెంట్ జారీ చేయాలంటూ డిమాండ్ చేశారు. ఇజ్రాయెల్ తనను తాను ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకుంటున్నా కూడా ఒక నిందితుడు ప్రధానమంత్రిగా ఉండి వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నాడంటూ సెటైర్లు వేశారు.

నేతన్యాహుపై ఉన్న కేసులు ఏంటి ? 

ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు గత కొన్నేళ్లుగా మూడు ప్రధాన కేసులు ఎదుర్కొంటున్నారు. 

1.కేస్ 1000 (లంచం & బహుమతులు):
 వ్యాపారవేత్తల నుంచి ఖరీదైన బహుమతులు (సిగార్లు, షాంపేన్ లాంటివి) స్వీకరించి వాళ్లకు అనుకూలంగా నెతన్యాహు నిర్ణయాలు తీసుకున్నారనే ఆరోపణ.

2.కేస్ 2000 (మీడియా మేనేజ్‌మెంట్):
 ఒక ప్రముఖ వార్తాపత్రిక యజమానితో కలిసి నెతన్యాహు తనకు అనుకూలంగా వార్తలు రాయించేలా ఒప్పందం చేసుకున్నారనే కేసు.

3.కేస్ 4000 (టెలికాం కుంభకోణం):
ఓ టెలికాం కంపెనీకి ప్రయోజనం చేకూర్చేందుకు నెతన్యాహు నిబంధనలు మార్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనికి ప్రతిఫలంగా వాళ్ల న్యూస్‌ వెబ్‌సైట్‌లో తనపై సానుకూల కథనాలు వచ్చేలా చేశారనే ఆరోపణలపై కేసు ఉంది. 

ఇజ్రాయెల్ స్పందన

నెతన్యాహుపై ఇరాన్ చేసిన ఆరోపణలను ఇజ్రాయెల్ ప్రభుత్వం కొట్టిపారేసింది. టెర్రరిస్టులకు సపోర్ట్ చేసే ఇరాన్ లాంటి దేశాలు ప్రజాస్వామ్య దేశాల న్యాయ వ్యవస్థల గురించి మాట్లాడటం హాస్యాస్పదమంటూ పేర్కొంది. నెతన్యాహు పట్ల ప్రజల్లో ఉన్న మద్దతును దెబ్బతీసేందుకే ఇరాన్ ఇలాంటి ప్రచారాన్ని చేస్తోందని ఇజ్రాయెల్ దౌత్యవేత్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

నెతన్యాహుపై కేసుల విచారణ

ఫిబ్రవరి 28, 2026న ఇరాన్‌తో యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇజ్రాయెల్ 'స్టేట్‌ ఆఫ్ ఎమర్జెన్సీ'ని విధించింది. అయితే అమెరికా-ఇరాన్ మధ్య రెండు వారాల పాటు తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. దీంతో ఉద్రిక్తతలు తగ్గడంతో ఇజ్రాయెల్ ప్రభుత్వం ఏప్రిల్ 9న 'స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ'ని ఎత్తివేసింది. దీంతో అక్కడ సాధారణ కార్యకలాపాలు మళ్లీ ప్రారంభమవుతున్నాయి. ఈ క్రమంలోనే  నెతన్యాహుపై ఉన్న అవినీతి కేసులపై విచారణ జరగనుంది. ఇజ్రాయెల్ కోర్టు ప్రతినిధి తెలిపిన వివరాల ప్రకారం.. ఏప్రిల్ 12 (ఆదివారం) నుంచి నెతన్యాహు కేసుల విచారణ యథావిధిగా కొనసాగుతుంది.

న్యాయ నిపుణుల విశ్లేషణ ప్రకారం.. సాక్షుల విచారణ ముగియడానికి, ఇరు పక్షాల వాదనలు పూర్తయ్యేందుకు కనీసం మరో ఏడాది సమయం పట్టొచ్చు. దీని ప్రకారం నెతన్యాహు కేసులకు సంబంధించి 2027లో తీర్పు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ జిల్లా కోర్టు నెతన్యాహును దోషిగా తేల్చినా కూడా ఆయన వెంటనే జైలుకు వెళ్లలేరు. మళ్లీ ఇజ్రాయెల్ సుప్రీం కోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు మరో ఏడాది నుంచి రెండేళ్లు పట్టొచ్చు.

ఈ ఏడాది అక్టోబర్‌లో ఇజ్రాయెల్‌లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికలకు కంటే ముందే లేదా ఎన్నికలు జరిగిన వెంటనే తీర్పు వచ్చేలా న్యాయవ్యవస్థపై ఒత్తిడి ఉంది. మరి నెతన్యాహుకు శిక్ష పడుతుందా? లేదా? అనేది ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది. ఒకవేళ మళ్లీ యుద్ధం ముదిరితే ఇజ్రాయెల్‌లో ఎమర్జెన్సీ విధిస్తారు. దీనివల్ల ఈ కేసుల విచారణ అలా వాయిదా పడుతూనే వెళ్తుంది. రాబోయే రోజుల్లో నెతన్యాహు పరిస్థితి ఏంటనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే. 

Advertisment
తాజా కథనాలు