/rtv/media/media_files/2026/05/14/sunshine-bulk-carrier-2026-05-14-09-50-52.jpg)
SUNSHINE, Bulk Carrier
Strait of Hormuz : పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నడుమ భారత్‌కు ఇంధన భద్రత విషయంలో ఊరట లభించింది. వ్యూహాత్మక ప్రాధాన్యత కలిగిన హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) గుండా ప్రయాణిస్తున్న భారత ఎల్‌పీజీ ట్యాంకర్లకు భారత నావికాదళం అండగా నిలుస్తోంది. భారత్‌కు భారీ ఎత్తున వంట గ్యాస్ (LPG)ను తీసుకువస్తున్న 'ఎమ్‌వీ సన్‌షైన్' (MV Sunshine) అనే నౌక అత్యంత ప్రమాదకరమైన హోర్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటినట్టు సమాచారం. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు, గ్యాస్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతున్న తరుణంలో, ఈ నౌక సురక్షితంగా బయటపడటం ప్రాధాన్యత సంతరించుకుంది. భారత నావికాదళం మరియు ఇతర రక్షణ ఏజెన్సీల పర్యవేక్షణలో ఈ నౌక ప్రస్తుతం తన గమ్యస్థానమైన భారత్ వైపు ప్రయాణిస్తోంది.
పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతల దృష్ట్యా, భారతీయ నౌకలకు రక్షణ కల్పించేందుకు భారత నావికాదళం నిరంతరం శ్రమిస్తోంది. తాజా 'ఎమ్‌వీ సన్‌షైన్'తో కలిపి ఇప్పటివరకు మొత్తం 15 ఎల్‌పీజీ నౌకలు హోర్ముజ్ జలసంధి గుండా సురక్షితంగా భారత్‌కు చేరుకున్నాయి. భారత నౌకాదళం తన యుద్ధనౌకలు, నిఘా విమానాల ద్వారా ఈ నౌకలు ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రయాణించేలా సహకారం అందిస్తోంది. అయితే, ఈ నౌకలో ఎన్ని టన్నుల గ్యాస్ ఉంది,ఇది ఏ తేదీన భారత తీరానికి చేరుకుంటుందనే వివరాలను భద్రతా కారణాల దృష్ట్యా గోప్యంగా ఉంచారు.
హోర్ముజ్ జలసంధిలో ప్రస్తుత పరిస్థితులపై ఇరాన్ అంతర్జాతీయ వ్యవహారాల ఉప విదేశాంగ మంత్రి కాజిమ్ ఘరీబాబాదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ ప్రాంతంలో శాంతి నెలకొంటే పరిస్థితులు మళ్లీ సాధారణ స్థితికి వస్తాయని, గతంలో కంటే ఎక్కువ భద్రత ఉంటుందని ఆయన పేర్కొన్నారు. తమ దేశం అంతర్జాతీయ చట్టాలను ఎక్కడా అతిక్రమించడం లేదని స్పష్టం చేశారు. సంక్షోభ పరిష్కారానికి అమెరికా దౌత్యపరమైన నిబద్ధతను చూపడం లేదని ఆయన ఆరోపించారు. పశ్చిమాసియాలో శాంతిస్థాపనకు భారత్ పోషిస్తున్న పాత్రను ఇరాన్ కొనియాడింది. భారత్ ఎప్పుడూ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుందని, ఇరు దేశాల మధ్య ఉన్న సాంస్కృతిక సంబంధాలు ఈ సంక్షోభ పరిష్కారానికి దోహదపడతాయని ఘరీబాబాదీ ఆశాభావం వ్యక్తం చేశారు.
హోర్ముజ్ జలసంధి ప్రపంచ చమురు వ్యాపారంలో అత్యంత కీలకమైన మార్గం. యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ భారత నావికాదళం చురుగ్గా వ్యవహరిస్తూ దేశ ఇంధన అవసరాలకు ఆటంకం కలగకుండా చూడటం అభినందనీయం. ఈ నౌక రాకతో దేశీయంగా ఎల్‌పీజీ సరఫరాలో స్థిరత్వం ఏర్పడనుంది.
Follow Us