/rtv/media/media_files/2026/04/29/fotojet-2026-04-29-13-16-57.jpg)
If it weren't for us, you would have to speak French: British King counters Trump
State Dinner : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, బ్రిటన్ రాజు ఛార్లెస్-3 మధ్య జరిగిన ఒక సరదా సంభాషణ ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై ఆసక్తికర చర్చకు దారితీసింది. మంగళవారం రాత్రి అధ్యక్ష కార్యాలయంలో ఏర్పాటు చేసిన అధికారిక విందు (State Dinner) సందర్భంగా ఇద్దరు నేతల మధ్య హాస్యం, చమత్కారం మేళవించిన మాటల యుద్ధం సాగింది. గతంలో ఒక సందర్భంలో ట్రంప్ మాట్లాడుతూ.. "రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా గనుక ఆదుకోకపోయి ఉంటే, ఇప్పుడు యూరోపియన్లందరూ జర్మన్ లేదా జపనీస్ భాషల్లో మాట్లాడుకునేవారు" అని వ్యాఖ్యానించారు. దీనిని గుర్తు పెట్టుకున్న బ్రిటన్ రాజు ఛార్లెస్, అదే స్థాయిలో తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.
"అధ్యక్షా.. అమెరికా లేకపోతే యూరోపియన్ దేశాలు జర్మన్ మాట్లాడేవని మీరు అన్నారు. కానీ నేనేం చెబుతున్నానంటే, ఒకవేళ మేము (బ్రిటిష్ వారు) లేకపోతే, మీరు ఇప్పుడు ఫ్రెంచ్ మాట్లాడేవారు" అని రాజు ఛార్లెస్ వ్యాఖ్యానించారు. సుమారు 250 ఏళ్ల క్రితం అమెరికా గడ్డపై పట్టు కోసం బ్రిటన్, ఫ్రాన్స్ దేశాల మధ్య జరిగిన సుదీర్ఘ పోరాటాన్ని ఆయన ఈ సందర్భంగా పరోక్షంగా ప్రస్తావించారు. ఆనాడు బ్రిటన్ గెలిచింది కాబట్టే అమెరికాలో ఇంగ్లీష్ ప్రధాన భాష అయిందని ఆయన గుర్తుచేశారు.
చరిత్రను గమనిస్తే, 18వ శతాబ్దంలో ఉత్తర అమెరికా ఖండంపై ఆధిపత్యం కోసం బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు 'సెవెన్ ఇయర్స్ వార్' (1756-1763)లో తలపడ్డాయి. దీనినే 'ఫ్రెంచ్ అండ్ ఇండియన్ వార్' అని కూడా పిలుస్తారు. ఈ యుద్ధంలో బ్రిటన్ విజయం సాధించడంతో అమెరికాలో ఫ్రెంచ్ ప్రభావం తగ్గి ఇంగ్లీష్ సంస్కృతి స్థిరపడింది.
రాజు ఛార్లెస్ ప్రసంగం తర్వాత ట్రంప్ మాట్లాడుతూ ఆయన చమత్కారాన్ని అభినందించారు. లండన్-వాషింగ్టన్ మధ్య ఉన్న చారిత్రక బంధాన్ని కొనియాడారు. అయితే, ఇదే సమయంలో ప్రస్తుత బ్రిటన్ రాజకీయాలపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో సాగుతున్న యుద్ధం విషయంలో తమకు పూర్తిస్థాయిలో మద్దతు ఇవ్వడానికి బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ నిరాకరించడాన్ని ట్రంప్ తప్పుబట్టారు. మిత్రదేశాల మధ్య ఉండాల్సిన సహకారం స్టార్మర్ విషయంలో కనిపించడం లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు.ఈ స్టేట్ డిన్నర్ కేవలం దౌత్యపరమైన వేడుకగానే కాకుండా, అగ్రరాజ్యాల మధ్య ఉన్న చారిత్రక అనుబంధాన్ని ,వర్తమాన రాజకీయ భేదాభిప్రాయాలను ప్రపంచానికి చాటిచెప్పే వేదికగా నిలిచింది. రాజు ఛార్లెస్ చేసిన 'ఫ్రెంచ్' కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వైరల్‌గా మారింది.
Follow Us