Harmanpreet Kaur : పాక్‌తో హ్యాండ్‌షేక్ వివాదం.. హర్మన్‌ప్రీత్ రియాక్షన్ వింటే షాక్‌..

మహిళల టీ20 ప్రపంచ కప్ లో ఈ రోజు ప్రత్యర్థి పాక్ తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందే 'హ్యాండ్‌షేక్' అంశం చర్చకు వచ్చింది. దీనిపై భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌ సమాధానమిస్తూ"మేము ఇక్కడికి కేవలం క్రికెట్ ఆడటానికి మాత్రమే వచ్చాం' అని స్పష్టం చేసింది.

New Update
Harmanpreet-Kaur-T20WC

Harmanpreet-Kaur-T20WC

Harmanpreet Kaur : ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న హైవోల్టేజ్ పోరుకు సర్వం సిద్ధమైంది. ఇంగ్లాండ్‌ లోని బర్మింగ్‌హామ్ వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో భారత మహిళల జట్టు ఢీకొట్టబోతోంది. అయితే, ఇరు దేశాల మధ్య ఉన్న రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ మ్యాచ్‌కు ముందే 'హ్యాండ్‌షేక్' (కరచాలనం) అంశం మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ మధ్య సంబంధాలు మరింత క్షీణించడంతో, గతేడాది ఆసియా కప్ నుంచి ఇరు జట్ల ఆటగాళ్లు మైదానంలో 'నో హ్యాండ్‌షేక్' విధానాన్ని అనుసరిస్తున్నారు. ఈ క్రమంలో ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు పాక్‌తో కరచాలనం చేస్తారా లేదా అనే ఉత్కంఠ తెరపైకి వచ్చింది.

ఈ వివాదాస్పద అంశంపై మ్యాచ్‌కు ముందు జరిగిన అధికారిక ప్రెస్ కాన్ఫరెన్స్‌లో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు విలేకర్ల నుంచి నేరుగా ప్రశ్న ఎదురైంది. దానికి ఆమె ఎంతో పరిణతితో, అంతే ఘాటుగా సమాధానమిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. "మేము ఇక్కడికి కేవలం క్రికెట్ ఆడటానికి మాత్రమే వచ్చాం. కాబట్టి మనం ఆట గురించి మాత్రమే మాట్లాడుకుందాం. క్రికెట్ తప్ప మరే ఇతర రాజకీయ లేదా వివాదాస్పద అంశాలపై మాట్లాడే ఉద్దేశం మాకు లేదు. నేను కూడా ప్రస్తుతం ఆట గురించి మాత్రమే ఆలోచిస్తున్నాను. రాజకీయ అంశాలను పక్కన పెట్టి ఆటను ఆటలాగా చూడండి" అని హర్మన్ స్పష్టం చేసింది.

ఈ దాయాదుల పోరును తాము ప్రత్యేకంగా ఏమీ చూడటం లేదని హర్మన్‌ప్రీత్ పేర్కొంది. టోర్నీలోని ఇతర జట్లతో ఎలా ఆడతామో.. పాకిస్థాన్‌తోనూ అలాగే తలపడతామని, ఈ మ్యాచ్‌ను కూడా ఒక సాధారణ మ్యాచ్‌లాగే భావిస్తున్నామని తెలిపింది. మైదానంలోకి దిగాక దేశం కోసం వంద శాతం విజయం సాధించడమే తమ ఏకైక లక్ష్యమని స్పష్టం చేసింది.

ఇక భారత్-పాక్ మ్యాచ్ అంటే ఉండే భారీ అంచనాలు, ఒత్తిడిపై కూడా హర్మన్ మాట్లాడింది. "మాపై ఒత్తిడి లేదని నేను చెప్పను. భారత్-పాక్ మ్యాచ్ అంటే అంచనాలు కాస్త ఎక్కువగానే ఉంటాయి కాబట్టి తప్పకుండా ఒత్తిడి ఉంటుంది. నేను క్రికెట్‌ను ఒక అభిమానిగా చూడటం ప్రారంభించినప్పటి నుంచే ఆ ఒత్తిడిని ఫీల్ అయ్యాను. ఇప్పుడు మేము నేరుగా మైదానంలో ఆడుతున్నాం కాబట్టి మాపై ఇంకాస్త అదనంగానే ఒత్తిడి ఉంటుంది. అయితే ఈ ఒత్తిడిని ఆస్వాదిస్తూ అత్యుత్తమ ఆటను ప్రదర్శించడమే మా లక్ష్యం" అని వివరించింది.

ప్రపంచ కప్ వంటి ప్రతిష్టాత్మక మెగా టోర్నీలో ఇలాంటి పెద్ద మ్యాచ్‌లలో దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం రావడం తాము ఎంతో అదృష్టంగా భావిస్తున్నట్లు కెప్టెన్ పేర్కొంది. అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రతి మ్యాచ్‌కూ ఒత్తిడి అనేది సహజమని, దాన్ని ఎలా ఎదుర్కొంటామనేదే ఇక్కడ ముఖ్యమని తెలిపింది. మైదానంలో ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ, ఒత్తిడిని అధిగమించి జట్టుగా తమ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చి విజయం సాధిస్తామని హర్మన్‌ప్రీత్ కౌర్ ధీమా వ్యక్తం చేసింది.

Advertisment
తాజా కథనాలు