/rtv/media/media_files/2026/04/20/gulf-countries-2026-04-20-15-20-11.jpg)
అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు కీలక మలుపు తిరిగాయి. ఏడు వారాలుగా సాగుతున్న ఈ యుద్ధం, గల్ఫ్ దేశాల తీరుని పూర్తిగా మార్చేసింది. యుద్ధం ప్రారంభంలో అమెరికాకు మద్దతుగా నిలిచిన దేశాలు, ఇప్పుడు ట్రంప్ విధానాల పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. యుద్ధానికి ముగింపు కనిపించకపోవడం, అమెరికా సైనిక స్థావరాలు తమను రక్షించడంలో ఫెయిల్ అవ్వడం గల్ఫ్ దేశాల్లో ఆగ్రహానికి కారణమైంది.
యూఏఈ కీలక నిర్ణయం
యుద్ధం మొదట్లో అమెరికాకు అండగా నిలిచిన దేశాల్లో UAE ముందుంది. హోర్ముజ్ జలసంధి విషయంలోనూ, ఇజ్రాయెల్-అమెరికా కూటమికి మద్దతు ఇవ్వడంలోనూ యూఏఈ కీలక పాత్ర పోషించింది. అయితే, ఇరాన్ క్షిపణి దాడుల నుంచి దుబాయ్, అబుదాబి వంటి ప్రపంచ స్థాయి నగరాలను రక్షించడంలో అమెరికా ఫెయిల్ కావడం నమ్మకాన్ని దెబ్బతీసింది. ఈ క్రమంలో యూఏఈ రాజకీయ విశ్లేషకుడు అబ్దుల్‌ఖలేఖ్ అబ్దుల్లా రాయిటర్స్‌తో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. "మా రక్షణ కోసం మాకు ఇక అమెరికా అవసరం లేదు. అమెరికా సైనిక స్థావరాలు మాకు వ్యూహాత్మక ఆస్తిగా కాకుండా భారంగా మారాయి. వాటిని మూసివేయాల్సిన సమయం ఆసన్నమైంది" అని ఆయన స్పష్టం చేశారు. యూఏఈకి ఇప్పుడు అమెరికా స్థావరాల కంటే ఆధునిక ఆయుధాల సరఫరా మాత్రమే ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.
సౌదీ అరేబియాలో అసహనం
సౌదీ అరేబియా కూడా ఇదే బాటలో ఉంది. విదేశాంగ మంత్రి ఫైసల్ బిన్ ఫర్హాన్ చేసిన ప్రకటన అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. అమెరికాపై ఆధారపడే శకం ముగిసిందని ఆయన కుండబద్దలు కొట్టారు. డొనాల్డ్ ట్రంప్‌ను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, "తన సొంత దేశాన్ని, సైనిక స్థావరాలను కాపాడుకోలేని అమెరికా, మాకు రక్షణ ఎలా ఇవ్వగలదు?" అని ఘాటుగా ప్రశ్నించారు. ఇరాన్ దాడుల వల్ల చమురు శుద్ధి కర్మాగారాలు దెబ్బతినడం, హోర్ముజ్ జలసంధి దిగ్బంధనం వల్ల ఆర్థికంగా భారీ నష్టాలు కలగడం వంటి అంశాలు సౌదీని ఈ నిర్ణయానికి పురిగొల్పాయి. మొత్తానికి, ఈ యుద్ధం కేవలం ఇరాన్-అమెరికాల మధ్యే కాకుండా, అమెరికా, గల్ఫ్ మిత్రదేశాల మధ్య ఉన్న నమ్మకాన్ని కూడా దెబ్బతీసింది. యుద్ధం అంతుచిక్కకుండా సాగుతుండటంతో గల్ఫ్ దేశాలు తమ భద్రత కోసం సొంత మార్గాలను అన్వేషించడం ప్రారంభించాయి. అమెరికాపై అతిగా ఆధారపడటం వల్ల ఎదురవుతున్న నష్టాలను ఈ దేశాలు గుర్తించాయి. ఈ పరిణామాలు భవిష్యత్తులో గల్ఫ్ ప్రాంత రాజకీయాల్లో పెను మార్పులకు నాంది పలికే అవకాశం ఉంది.
Follow Us