/rtv/media/media_files/2026/05/13/bus-accident-2026-05-13-07-49-22.jpg)
Fatal accident in Pakistan.
Pakistan : పాకిస్థాన్‌లో వారాంతపు విహారయాత్రకు వెళ్లిన పర్యాటకుల ప్రయాణం తీవ్ర విషాదాంతమైంది. కరాచీ నుంచి ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన కీంఝర్ సరస్సు (Keenjhar Lake) వైపు వెళ్తున్న ఓ టూరిస్ట్ బస్సు అతివేగం కారణంగా జాతీయ రహదారిపైనే ఘోర ప్రమాదానికి గురైంది. తాము చేరుకోవాల్సిన గమ్యస్థానానికి కేవలం కొన్ని నిమిషాల దూరంలో ఉందనగా జరిగిన ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందగా 20 మందికి పైగా పర్యాటకులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన రెండు రోజుల తర్వాత దీనికి సంబంధించిన భయానక దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వెలుగులోకి రావడంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
اگر یہ ڈرائیور زندہ بچ گیا ہے تو اسکو سب سے پہلے پھانسی دینی چاہیے🚨
— Syeda Zahra (@ZahraShahPTI) May 11, 2026
کراچی سے کینجھر جھیل جانے والی کوسٹر حادثہ کی ویڈیو سامنے آگئی
25 افراد خواتین بچوں سمیت زخمی ہوگئے اللہ رحم کرے ۔۔ pic.twitter.com/S6AKmfJiHx
ఓవర్‌టేక్ చేయబోయి.. ఒక్కసారిగా పల్టీలు కొట్టి..
సింధ్ ప్రావిన్సులోని కీంఝర్ సరస్సు వీకెండ్స్‌లో పర్యాటకులతో ఎప్పుడూ కిటకిటలాడుతుంటుంది. గత ఆదివారం కూడా కరాచీ నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు (ఎక్కువగా యువకులు) ఒక బస్సులో బయలుదేరారు. బస్సు లోపల సామర్థ్యానికి మించి ప్రయాణికులు ఉండటంతో, చోటు దొరకని చాలా మంది యువకులు ఏకంగా బస్సు టాప్ (పైకప్పు) మీద కూర్చుని ప్రయాణించారు.
కరాచీ-థట్టా జాతీయ రహదారిపై వెళ్తున్న సమయంలో బస్సు డ్రైవర్ తీవ్ర నిర్లక్ష్యంతో, అతివేగంతో మరో వాహనాన్ని ఓవర్‌టేక్ చేయడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో కీంఝర్ సరస్సు సమీపంలోని 'ఛాతో చంద్' వద్దకు రాగానే బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి రహదారిపైనే పల్టీలు కొట్టింది. వేగం ఎక్కువగా ఉండటంతో పల్టీలు కొట్టిన తర్వాత కూడా బస్సు రోడ్డుపై కొన్ని మీటర్ల దూరం వరకు ఈడ్చుకుంటూ దూసుకెళ్లింది.
బస్సు పైనుంచి చెల్లాచెదురుగా పడిపోయిన ప్రయాణికులు
బస్సు పల్టీలు కొట్టిన తీవ్రతకు పైకప్పుపై కూర్చున్న ప్రయాణికులంతా గాల్లోకి ఎగిరి రోడ్డుపై, పక్కనే ఉన్న గుంతల్లో చెల్లాచెదురుగా పడిపోయారు. లోపల ఉన్న వారు కిటికీల అద్దాలు పగిలిపోవడంతో బస్సులోనే ఇరుక్కుపోయారు. ఈ ప్రమాదంలో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడగా.. వారిలో చాలా మందికి కాళ్లు, చేతులు విరిగిపోయాయి. తలలకు బలమైన గాయాలయ్యాయి. క్షతగాత్రులలో కొందరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం.
ముమ్మరంగా సహాయక చర్యలు
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, అటుగా వెళ్తున్న వాహనదారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు అక్కడికి చేరుకుని క్షతగాత్రులను అత్యవసర చికిత్స కోసం థట్టా, కరాచీలోని వివిధ ఆసుపత్రులకు తరలించారు.
ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కేవలం అతివేగం, డ్రైవర్ నిర్లక్ష్యంతో పాటు బస్సు సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణాలని ప్రాథమిక విచారణలో తేలింది. నిబంధనలను ఉల్లంఘించి టూరిస్ట్ బస్సులను నడుపుతున్న ట్రావెల్స్ సంస్థలపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Follow Us