US President Donald Trump : ట్రంప్‌పై హత్యాయత్నం...వైట్‌హౌస్‌ సమీపంలో కాల్పుల కలకలం...

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నం యావత్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. వాషింగ్టన్ డీసీలోని వాషింగ్టన్ హిల్టన్ హోటల్‌లో శనివారం రాత్రి వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ కార్యక్రమం వైభవంగా జరుగుతున్న సమయంలో ఈ ఘోరం చోటుచేసుకుంది.

New Update
FotoJet - 2026-04-26T073409.932

Shooting near the White House.

US President Donald Trump  : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నం యావత్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. వాషింగ్టన్ డీసీలోని వాషింగ్టన్ హిల్టన్ హోటల్‌లో ఏప్రిల్ 25, 2026 శనివారం రాత్రి వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ కార్యక్రమం వైభవంగా జరుగుతున్న సమయంలో ఈ ఘోరం చోటుచేసుకుంది. ఈ వేడుకకు అధ్యక్షుడు ట్రంప్‌తో పాటు ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ , సుమారు 2,600 మంది ప్రముఖ అతిథులు హాజరయ్యారు. విందు కొనసాగుతుండగా ఒక్కసారిగా 7 నుంచి 8 రౌండ్ల కాల్పుల శబ్దం వినిపించడంతో అక్కడ భయానక వాతావరణం నెలకొంది. ప్రాణభయంతో వందలాది మంది అతిథులు టేబుళ్ల కింద దాక్కున్న దృశ్యాలు అక్కడి గందరగోళ పరిస్థితికి అద్దం పట్టాయి.

అయితే కాల్పులు మొదలైన వెంటనే అత్యంత అప్రమత్తంగా వ్యవహరించిన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు, ట్రంప్‌ను,ఇతర కీలక నేతలను చుట్టుముట్టి "అడ్డంగా ఎవరూ రావద్దు" అని హెచ్చరిస్తూ వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ పెను ప్రమాదం నుంచి ట్రంప్, జేడీ వాన్స్ తృటిలో తప్పించుకోవడం గమనార్హం. ఈ ఘటనలో ఎవరూ గాయపడకపోవడం ఊరటనిచ్చే అంశం. నిందితుడిని భద్రతా బలగాలు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నాయి. ఈ పరిణామంపై ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతాలో స్పందిస్తూ, సీక్రెట్ సర్వీస్ మరియు లా ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాల సాహసోపేతమైన చర్యలను ప్రశంసించారు. షూటర్‌ను తక్షణమే పట్టుకున్నారని, కార్యక్రమాన్ని కొనసాగించాలని తాను భావించినప్పటికీ భద్రతా నిబంధనల దృష్ట్యా తదుపరి నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడి భద్రతా వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉందో ఈ ఘటన మరోసారి నిరూపించినప్పటికీ, వైట్ హౌస్ సమీపంలోనే ఇలాంటి దాడి జరగడం అంతర్జాతీయంగా కలకలం రేపింది.

కాల్పులు జరిగిన సమయంలో డిన్నర్ ప్రోగ్రామ్ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. అతిథులు తమ మొదటి కోర్సుగా 'స్ప్రింగ్ పీ మరియు బురాటా సలాడ్' తింటున్న సమయంలో హఠాత్తుగా కాల్పుల శబ్దాలు వినిపించాయి. వెంటనే అప్రమత్తమైన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు తుపాకులు చేతబూని డయాస్ వైపు దూసుకెళ్లారు. ఆ సమయంలో "స్టే డౌన్" (కిందకు వంగండి) అని ఏజెంట్లు గట్టిగా అరుస్తుండటంతో, విందులో పాల్గొన్న జర్నలిస్టులు, రాజకీయ నాయకులు తమ టేబుళ్ల కిందకు దూరి ప్రాణరక్షణ పొందారు. గందరగోళంలో వైన్ గ్లాసులు పగిలి టేబుల్ క్లాత్స్‌పై ఒలికిపోవడంతో అక్కడ యుద్ధ వాతావరణం కనిపించింది.

భద్రతా వర్గాల కథనం ప్రకారం, నిందితుడు అసలు బ్యాంకెట్ హాల్‌లోకి ప్రవేశించలేకపోయాడు. తుపాకీతో లోపలికి వచ్చేందుకు ప్రయత్నించిన వ్యక్తిని సెక్యూరిటీ చెక్ పాయింట్ వద్దే గుర్తించి అడ్డుకున్నారు. నిందితుడిని హాల్ వెలుపలే అదుపులోకి తీసుకుని వేరే ప్రాంతానికి తరలించినట్లు ఫాక్స్ న్యూస్ వెల్లడించింది. ఈ సంఘటనలో ట్రంప్, మెలానియాతో పాటు ఎన్విరాన్‌మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అడ్మినిస్ట్రేటర్ లీ జెల్డిన్, ఆరోగ్య శాఖ మంత్రి రాబర్ట్ కెన్నెడీ, ఎఫ్బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ వంటి కీలక ప్రముఖులు కూడా సురక్షితంగా బయటపడ్డారు.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, కాల్పులు జరిగిన కాసేపటికే పరిస్థితి చక్కబడటంతో కార్యక్రమాన్ని మళ్ళీ కొనసాగించాలని నిర్వాహకులు నిర్ణయించారు. ట్రంప్ కూడా అక్కడికి దగ్గరలోనే ఉండి, తదుపరి భద్రతా క్లియరెన్స్ కోసం వేచి చూశారు. వాషింగ్టన్ హిల్టన్ హోటల్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారి. 1981లో అప్పటి అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్‌పై కూడా ఇదే హోటల్ వెలుపల హత్యాయత్నం జరిగింది. ప్రస్తుతం వాషింగ్టన్ వీధుల్లో భారీగా భద్రతను పెంచారు నిందితుడి నేపథ్యంపై దర్యాప్తు కొనసాగుతోంది.

Advertisment
తాజా కథనాలు