/rtv/media/media_files/2026/06/08/toledo-festival-shooting-2026-06-08-06-51-31.jpg)
Toledo Festival Shooting
USA Firing : అమెరికాలో మరోసారి తుపాకీ సంస్కృతి కలకలం రేపింది. ఒహాయో రాష్ట్రంలోని టొలిడో నగరంలో ప్రతి ఏటా అత్యంత వైభవంగా నిర్వహించే చారిత్రాత్మక ‘ఓల్డ్ వెస్ట్ ఎండ్ ఫెస్టివల్’ రక్తసిక్తమైంది. లైవ్ మ్యూజిక్, ఫ్యామిలీ ఈవెంట్లతో 53వ వార్షిక ఉత్సవాన్ని కుటుంబాలన్నీ ఉత్సాహంగా ఆస్వాదిస్తున్న తరుణంలో.. ఒక్కసారిగా వినిపించిన తుపాకీ శబ్దాలు అక్కడి వాతావరణాన్ని ఆందోళనకరంగా మార్చివేశాయి. పండుగ వేళ ఒక్కసారిగా బుల్లెట్ల వర్షం కురవడంతో జనం ప్రాణభయంతో అటూఇటూ పరుగులు తీశారు.
అమెరికా కాలమాన ప్రకారం శనివారం సాయంత్రం 5:37 గంటల ప్రాంతంలో డెలావేర్, గ్లెన్‌వుడ్ అవెన్యూల సమీపంలో ఈ ఘోర కలిచెలరేగింది. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది సాయుధులు ఒకరిపై ఒకరు పరస్పరం కాల్పులు జరుపుకోగా, అక్కడ గుమిగూడిన సామాన్య ప్రజలు ఈ క్రాస్‌ఫైరింగ్‌లో చిక్కుకున్నట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన పలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో కాల్పుల శబ్దాలు వినగానే ప్రజలు ప్రాణాలు కాపాడుకోవడానికి దొరికిన చోటికి చెల్లాచెదురుగా పరుగులు తీయడం కనిపిస్తోంది.
ఈ ఘోర ప్రమాదంలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగనప్పటికీ, కనీసం 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో 14 ఏళ్ల మైనర్ల నుంచి 61 ఏళ్ల వృద్ధుల వరకు ఉన్నారని డిప్యూటీ పోలీస్ చీఫ్ జో హెఫెర్నన్ తెలిపారు. క్షతగాత్రులలో ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. అమెరికా నౌకాదళంలో పనిచేసిన కెవిన్ బెర్రీ అనే ప్రత్యక్ష సాక్షి తెలిపిన వివరాల ప్రకారం.. కాల్పుల అనంతరం ఎవరో గన్‌ను కింద పడేసి వెళ్లడం తాను చూశానని, అర్బోరేటమ్ ప్రాంతంలో ఐదుగురు గాయపడి రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గమనించానని పేర్కొన్నారు.
ఈ హింసాత్మక ఘటనకు పాల్పడిన నిందితులెవరూ ఇప్పటివరకు పోలీసులకు చిక్కలేదు, వారు ఘటనా స్థలం నుంచి పరారైనట్లు అధికారులు నిర్ధారించారు. ప్రస్తుతం టోలెడో పోలీస్ డిపార్ట్‌మెంట్ నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తోంది. డెలావేర్ అవెన్యూ, రాబిన్‌వుడ్ అవెన్యూ పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించి దర్యాప్తును కొనసాగిస్తున్నారు. దర్యాప్తునకు ఆటంకం కలగకుండా ఉండేందుకు స్థానికులు, సందర్శకులు ఎవరూ ఆ ప్రాంతానికి రావద్దని పోలీసులు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా హెచ్చరించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడి సీసీటీవీ ఫుటేజీలను, ప్రత్యక్ష సాక్షుల ప్రకటనలను నిశితంగా పరిశీలిస్తున్నారు. కాల్పులకు దారితీసిన పరిస్థితులపై ఆధారాలు సేకరిస్తున్నారు. పండుగకు వచ్చిన వారు తమ మొబైల్స్‌లో తీసిన ఫోటోలు లేదా వీడియోలను దర్యాప్తు కోసం పోలీసులకు అందించి సహకరించాలని కోరారు. రెండు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో ఇలాంటి దారుణం జరగడం కలచివేసిందని నగర కౌన్సిల్ సభ్యురాలు థెరిసా మోరిస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దారుణ ఘటన నేపథ్యంలో ఉత్సవానికి సంబంధించిన మిగిలిన అన్ని కార్యక్రమాలను స్థానిక యంత్రాంగం రద్దు చేసింది.
ఈ ఉదంతంపై ఒహియో గవర్నర్ మైక్ డివైన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఈ కాల్పుల ఘటనను తీవ్రంగా ఖండించారు. వేసవి ఉత్సవాలు అనేవి ప్రజలు సంతోషంగా గడపడానికి ఉద్దేశించినవని, ఇలాంటి ప్రశాంతమైన చోట్ల హింస చోటుచేసుకోవడం అత్యంత ఆందోళనకరమని ఆయన అన్నారు. ఈ అమాయకులపై కాల్పులకు తెగబడిన బాధ్యులెవరినీ వదిలిపెట్టబోమని, వారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని గవర్నర్ మైక్ డివైన్ హామీ ఇచ్చారు.
Follow Us