/rtv/media/media_files/2026/06/14/iran-us-war-2026-06-14-07-35-53.jpg)
US-Iran conflict
US-Iran conflict : అమెరికా-ఇరాన్ ల మధ్య సుదీర్ఘ కాలంగా సాగుతున్న ఘర్షణ ముగింపు దశకు చేరుకున్నట్లు కనిపిస్తోంది. పశ్చిమాసియాలో శాంతి పవనాలు వీచేలా శనివారం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇరు దేశాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం ముగిసిపోనుందని, హర్మూజ్ జలసంధి అంతర్జాతీయ రవాణాకు తిరిగి తెరుచుకోనుందని సంకేతాలు అందుతున్నాయి. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో చారిత్రాత్మక ఒప్పందానికి సర్వం సిద్ధమైందని ప్రకటించారు.
యుద్ధాన్ని ముగించే దిశగా అమెరికా, ఇరాన్‌ల మధ్య ఆదివారం (జూన్ 14, 2026) శాంతి ఒప్పందం కుదరనుందని, దీనిపై సంతకాలు కూడా జరుగుతాయని డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఈ ఒప్పందం పూర్తయిన వెంటనే అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన ‘హర్మూజ్ జలసంధి’ అందరికీ అందుబాటులోకి వస్తుందని ఆయన తన ‘ట్రూత్ సోషల్’ ప్లాట్‌ఫామ్‌లో పేర్కొన్నారు. ఇరాన్‌తో కుదుర్చుకుంటున్న ఈ నూతన ఒప్పందం ఆ దేశం అణ్వాయుధాన్ని తయారు చేయకుండా అడ్డుకునే బలమైన గోడలా పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు.
గతంలో మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇరాన్‌తో కుదుర్చుకున్న అణు ఒప్పందాన్ని ట్రంప్ ఈ సందర్భంగా తీవ్రంగా తప్పుబట్టారు. ఒబామా కాలం నాటి ఒప్పందం ఇరాన్ సులభంగా అణ్వాయుధాలు తయారుచేసుకునేలా ఉందని, కానీ ప్రస్తుత ఒప్పందం దానికి పూర్తి విరుద్ధమని చెప్పారు. ఇరాన్ అణుకేంద్రాలను ఇప్పటికే తమ బి-2 బాంబర్లు నాశనం చేశాయని, ఆ కూలిపోయిన గ్రానైట్ పర్వతాల కింద చిక్కుకున్న శుద్ధి చేసిన యురేనియాన్ని (న్యూక్లియర్ డస్ట్) ప్రశాంత వాతావరణం ఏర్పడ్డాక బయటకు తీస్తామని తెలిపారు. ఆ యురేనియాన్ని అమెరికాలో లేదా ఇరాన్‌లోనే నాశనం చేస్తామని, ఇరాన్ ఇకపై ఎలాంటి మార్గాల్లోనూ అణ్వాయుధాలు పొందలేదని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు.
మరోవైపు ఈ శాంతి ఒప్పందానికి మధ్యవర్తిత్వం వహించిన పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా దీనిపై ‘ఎక్స్’ (ట్విట్టర్) ద్వారా కీలక ప్రకటన చేశారు. గతంలో ఎన్నడూ లేనంతగా శాంతికి అతి సమీపంలోకి వచ్చామని, రానున్న 24 గంటల్లో ఒప్పందం ఖరారు కానుందని తెలిపారు. ఈ చారిత్రాత్మక శాంతి ఒడంబడిక పశ్చిమాసియాలో సుస్థిర శాంతికి బలమైన పునాది వేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒప్పందం ఖరారైన వెంటనే వర్చువల్/ఎలక్ట్రానిక్ పద్ధతిలో సంతకాలు చేయించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
అమెరికా, పాకిస్థాన్‌ల ఉత్సాహంపై ఇరాన్ మాత్రం కొంత ఆచితూచి స్పందిస్తోంది. ఆదివారమే ఒప్పందంపై సంతకం చేయబోమని, అయితే రాబోయే రోజుల్లో జరిగే పరిణామాలను పూర్తిగా కొట్టిపారేయలేమని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ స్పష్టం చేశారు. అవతలి పక్షం ఎప్పుడు ఎలా వ్యవహరిస్తుందో తెలియదు కాబట్టి తాము జాగ్రత్తగా వ్యవహరిస్తున్నామని చెప్పారు. మరోవైపు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ మాట్లాడుతూ.. లెబనాన్ సహా అన్ని ప్రాంతాల్లో యుద్ధాన్ని ముగించే ప్రాథమిక చర్చలు జరుగుతున్నాయని, ఇందులో ప్రస్తుతానికి అణు అంశం లేదని స్పష్టం చేశారు. ప్రాథమిక ఒప్పందం కుదిరిన 60 రోజుల తర్వాతే అణ్వాయుధాలపై చర్చిస్తామన్నారు.
ఇరాన్ అంతర్గత పరిణామాలకు వస్తే.. తమ దేశ సుప్రీం నేత అయతోల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల షెడ్యూల్‌ను ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. వచ్చే నెల జూలై 4న టెహ్రాన్‌లో అంత్యక్రియల ఊరేగింపులు ప్రారంభమై, జూలై 9న మషహద్ నగరంలో ముగుస్తాయని ఇరాన్ స్టేట్ మీడియా వెల్లడించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైన తొలి రోజుల్లో అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన సంయుక్త వైమానిక దాడుల్లో అలీ ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే.
పశ్చిమాసియా యుద్ధ ప్రభావం భారత్‌పైనా పడింది. గల్ఫ్ ఆఫ్ ఒమన్ తీరంలో అమెరికా నౌకాదళం జరిపిన దాడుల్లో ‘ఎంటి సెట్టెబెల్లో’ అనే వాణిజ్య నౌకలోని ముగ్గురు భారతీయ నావికులు మరణించారు. ఈ ఘోర ఉదంతంపై యూరప్ పర్యటనలో ఉన్న భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన అమెరికా విదేశాంగ మంత్రి (సెక్రటరీ ఆఫ్ స్టేట్) మార్కో రూబియోతో ఫోన్‌లో మాట్లాడి భారత్ తరఫున తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ వాణిజ్య నౌకలపై ఇటువంటి ప్రాణాంతక దాడులు చేయడం ఎంతమాత్రం సమర్థనీయం కాదని జైశంకర్ స్పష్టం చేశారు.
భారత విదేశాంగ మంత్రి నిరసనపై అమెరికా విదేశాంగ శాఖ కూడా స్పందించింది. హర్మూజ్ జలసంధిపై తాము విధించిన నౌకాదళ దిగ్బంధనాన్ని ఉల్లంఘించి ఇరాన్ చమురును అక్రమంగా రవాణా చేయడాన్ని తాము ఎంతమాత్రం సహించబోమని మార్కో రూబియో జైశంకర్‌కు స్పష్టం చేసినట్లు అమెరికా ప్రతినిధి తెలిపారు. ఆ ప్రాంతంలో శాంతి భద్రతలను కాపాడేందుకు అమెరికా సైన్యం జారీ చేసే ఆదేశాలను అన్ని వాణిజ్య నౌకలు తూచా తప్పకుండా పాటించాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు తప్పవని అమెరికా ఈ సందర్భంగా తేల్చిచెప్పింది.
Follow Us