/rtv/media/media_files/2026/06/02/indians-2026-06-02-12-02-03.jpg)
30 Indian truck drivers arrested in America
USA INDIANS ARREST : అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న విదేశీయులపై ట్రంప్ యంత్రాంగం నిఘా తీవ్రం చేసింది. ఇందులో భాగంగానే, యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (CBP) విభాగం ఇటీవల ఆరిజోనాలోని యూమా సెక్టార్‌లో భారీ తనిఖీలు చేపట్టింది. అమెరికా సరిహద్దుల్లో చట్టవిరుద్ధంగా ఉంటూ, పబ్లిక్ సేఫ్టీకి ముప్పుగా మారిన వారిని ఏరివేయడమే లక్ష్యంగా బోర్డర్ పెట్రోల్ ఏజెంట్లు ఈ ప్రత్యేక ఆపరేషన్‌ను నిర్వహించారు.
ఈ వ్యూహాత్మక తనిఖీలకు అధికారులు ‘ఆపరేషన్ చెక్‌మేట్’ (Operation Checkmate) అని నామకరణం చేశారు. రహదారులపై వెళ్తున్న సెమీ ట్రక్కులను (భారీ వాణిజ్య వాహనాలు) జల్లెడ పట్టగా ఊహించని నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఆపరేషన్‌లో మొత్తం 52 మంది అక్రమ వలసదారులను అధికారులు అదుపులోకి తీసుకోగా, వారిలో 36 మంది రోడ్లపై భారీ కమర్షియల్ ట్రక్కులు నడుపుతూ పట్టుబడటం గమనార్హం.
అరెస్టయిన 36 మంది ట్రక్ డ్రైవర్లలో అత్యధికులు భారతదేశానికి చెందినవారే కావడం తీవ్ర కలకలం రేపుతోంది. మొత్తం 30 మంది భారతీయ డ్రైవర్లను అధికారులు అరెస్ట్ చేయగా, మిగిలిన ఆరుగురు మెక్సికో, ఎల్ సాల్వడార్, రష్యా దేశాలకు చెందినవారిగా గుర్తించారు. అమెరికాలో నివసించడానికి ఎలాంటి చట్టపరమైన వీసాలు లేదా అనుమతులు లేనప్పటికీ, వీరంతా ఏకంగా భారీ వాహనాలను నడుపుతూ పట్టుబడ్డారు.
నిందితుల ప్రొఫైల్‌ను పరిశీలించిన అధికారులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. వీరిలో కొందరి వద్ద కాలిఫోర్నియా, న్యూయార్క్, వాషింగ్టన్, వర్జీనియా వంటి రాష్ట్రాల నుంచి పొందిన కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్‌లు (CDL) ఉండగా.. మరికొందరి వద్ద అసలు ఎలాంటి లైసెన్సులు లేవు. అసలు దేశంలోనే చట్టవిరుద్ధంగా ఉంటున్న వీరు ఈ లైసెన్సులు ఎలా సంపాదించారనే కోణంలో అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
పట్టుబడిన నిందితులందరిపై అమెరికా ఫెడరల్ చట్టం ప్రకారం అధికారులు కఠిన చర్యలు ప్రారంభించారు. ప్రస్తుతం వీరంతా ఇమ్మిగ్రేషన్ కస్టడీలో ఉన్నారు. చట్టపరమైన విచారణ ప్రక్రియ పూర్తి కాగానే వీరిని అమెరికా నుంచి అధికారికంగా బహిష్కరించనున్నారు (Deportation). ఈ నేపథ్యంలో అరెస్టయిన 30 మంది భారతీయులు త్వరలోనే డిపోర్ట్ అయి స్వదేశానికి తిరిగి రాక తప్పని పరిస్థితి ఏర్పడింది.
ఈ తాజా అరెస్టులతో అమెరికాలో ఇమ్మిగ్రేషన్ వ్యవహారం మరోసారి అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ప్రజా భద్రతకు, రోడ్డు ప్రమాదాల నివారణకే ఈ ఆపరేషన్ చేపట్టామని అధికారులు స్పష్టం చేశారు. అలాగే వీరికి నకిలీ లైసెన్సులు ఇప్పించి, ఉపాధి కల్పించిన ట్రకింగ్ కంపెనీల నెట్‌వర్క్‌లపై కూడా నిఘా పెట్టారు. అక్రమ మార్గాల్లో అమెరికాలోకి ప్రవేశించి నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటి కఠిన శిక్షలు ఉంటాయో ఈ ఘటన ద్వారా అమెరికా గట్టి హెచ్చరికలు జారీ చేసింది.
Follow Us