/rtv/media/media_files/2026/03/28/war-2026-03-28-15-43-32.jpg)
28 Days of Devastation, The Economic and Human Cost of the US-Israel-Iran Conflict
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ చేపట్టిన యుద్ధం 28 రోజులకు చేరింది. నెల రోజులుగా సాగుతున్న యుద్ధం వల్ల ఈ మూడు దేశాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. భారీగా ఆస్తి, ప్రాణనష్టం సంభవించింది. ముఖ్యంగా ఇరాన్ తీవ్రంగా ప్రభావితమైంది. ఇప్పటిదాకా జరిగిన దాడుల్లో ఇరాన్‌లో దాదాపు 1900 మంది మరణించారు. ఇందులో 175 మంది పాఠశాల విద్యార్థినులు కూడా ఉన్నారు. దాదాపు 32 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. అమెరికా రక్షణశాఖ మంత్రి పీట్ హెగ్సెత్ దీనికి సంబంధించి పలు కీలక విషయాలు వెల్లడించారు.
ఇరాన్‌కు భారీ నష్టం
ఇరాన్‌కు చెందిన 10 వేల కన్నా ఎక్కువ లక్ష్యాలను అమెరికా ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. ఇందులో భూగర్భ రక్షణ కేంద్రాలు, పరిశ్రమలు, కీలక భవనాలు ఉన్నాయి. ఇరాన్ నావికా దళానికి చెందిన 150 యుద్ధ నౌకలను ముంచివేశామని తెలిపారు. మరోవైపు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీతో పాటు ఇతర కీలక లీడర్లు కూడా చనిపోయారు. 16 వేలకు పైగా ఇళ్లు ధ్వంసం అయ్యాయి. లక్షలాది మంది వేరే ప్రాంతాలకు పారిపోయారు. ఇంటర్నెట్ బ్లాక్ అయ్యింది. కరెన్సీ విలువ మరింత దారుణంగా పడిపోవడంతో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది.మిసైల్ ఫ్యాక్టరీలు
ఆయుధ ఉత్పత్తి కేంద్రాలు, మిలిటరీ బేస్‌లు, ఆయిల్ డిపోలు, ఎనర్జీ సైట్లు ధ్వంసం అయ్యాయి. ఇరాన్‌కు ఆర్థికంగా ఎంత నష్టం జరిగిందో అధికారికంగా లెక్కలు రానప్పటికీ.. దాదాపు $150 నుంచి $200 బిలియన్ల డాలర్ల (రూ.14 లక్షల కోట్ల నుంచి రూ.19 లక్షల కోట్లు) వరకు నష్టం జరిగినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.
గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో ఇప్పటిదాకా సుమారు 13 మంది సైనికులు మరణించారు. మరో 300 మందికి పైగా సైనికులు గాయపడ్డారు. అమెరికా యుద్ధం ప్రారంభించిన మొదటి ఆరు రోజుల్లోనే 11 బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టింది. గత నెలరోజులుగా జరుగుతున్న దాడుల వల్ల ఇప్పటిదాకా సుమారు $18 నుంచి $40 బిలియన్ డాలర్ల వరకు ( రూ.1.7- రూ.3.8 లక్షల కోట్లు) నష్టపోయినట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. యుద్ధం ఇలాగే కొనసాగితే అమెరికాకు మరింత ఆర్థిక నష్టం జరగనుంది.
తమపై చేసిన దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ఇజ్రాయెల్‌పై దాడులు చేస్తోంది. ఇప్పటిదాకా ఈ యుద్ధం వల్ల ఇజ్రాయెల్‌లో దాదాపు 28 మంది ప్రాణాలు కోల్పోయారు. వీళ్లలో నలుగురు సైనికులు కూడా ఉన్నారు. మరో 5 వేల మందికి పైగా గాయపడ్డారు. ఈ దాడుల భయంతో దాదాపు 4 వేల మందికిపైగా సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. నెల రోజుల పాటు సాగిన ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ దాదాపు $28 నుంచి- $32 బిలియన్లు డాలర్ల వరకు (రూ.2.6-రూ.3 లక్షల కోట్లు) నష్టపోయినట్లు నివేదికలు అంచనా వేస్తున్నాయి.
గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలు, చమురు, గ్యాస్ కేంద్రాలపై ఇరాన్ దాడులు చేసింది. UAE రాజధాని అబుదాబిలో జరిగిన దాడుల వల్ల ఇద్దరు మరణించారు. వాళ్లలో ఒకరు భారత్, మరొకరు పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. మరోవైపు ఇజ్రాయెల్-హెజ్‌బొల్లా మధ్య జరుగుతున్న ఘర్షణల్లో కూడా ఇప్పటిదాకా లెబనాన్‌లో 1100 మంది మరణించారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇక ప్రపంచ చమురు సరఫరాలో 20 శాతం వాటా హర్మూజ్ జలసంధి నుంచే వస్తోంది. దీన్ని ఇరాన్ తన కంట్రోల్‌లోకి తీసుకోవడంతో అక్కడ అంతరాయం ఏర్పడింది. చివరికి అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారీగా పెరిగిపోయాయి. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 100 డాలర్లు దాటిపోయింది.
యుద్ధం ఆగేది ఎప్పుడు ?
మరోవైపు పశ్చిమాసియాలో యుద్ధం ఆపేందుకు ఓ వైపు శాంతి చర్చలు కూడా జరుగుతున్నాయి. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు ఇరాన్‌పై దాడులు 5 రోజులు నిలిపివేయగా మళ్లీ మరో 10 రోజులకు వాయిదా వేశారు. అయితే యుద్ధం ఆపేందుకు అమెరికా చేసిన ప్రతిపాదనలు ఏకపక్షంగా ఉన్నాయని ఇరాన్ ఆరోపిస్తోంది. హార్ముజ్ జలసంధిపై పూర్తి సార్వభౌమాధికారం, అలాగే యుద్ధ నష్టపరిహారం చెల్లించాలని పట్టుబడుతోంది. ఇక చర్చలు ఎలా ఉన్నా, ఇరాన్‌పై తమ దాడులు ఆగే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి చెబుతున్నారు. మరి యుద్ధం ఇంకా ఎన్ని రోజులు సాగుతుందో అనేది ఇంకా క్లారిటీ లేదు. ఎప్పుడు ఆగుతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే.
Follow Us