Heavy Rains: ప్రకృతి కోపం.. ఉత్తరాదిని వణికిస్తున్న వరదలు..

ఉత్తరాది రాష్ట్రాల్లో వానలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎక్కడికక్కడ కొండచరియలు విరిగిపడటంతో స్థానికులు, యాత్రికులు భయాందోళనకు గురవుతున్నారు. ఇక అస్సాంలో మే నుంచి జులై 10 వరకు వరదలతో చనిపోయిన వారి సంఖ్య 79కి చేరింది.

New Update
Heavy Rains: ప్రకృతి కోపం.. ఉత్తరాదిని వణికిస్తున్న వరదలు..

Heavy Rains: వానలు ముంచెత్తుతున్నాయి.. వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి.. ఇళ్లలోని భారీగా నీరు వచ్చి చేరుతున్నాయి.. పలుచోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. మరికొన్ని చోట్ల ఇంటి గోడలు కూలి నెత్తి మీద పడుతున్నాయి.. ఇది దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ప్రకృతి చూపిస్తున్న ప్రకోపం. ఉత్తరాఖండ్‌, అస్సాం నుంచి కర్ణాటక వరకు చాలా రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఇలాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. వర్షాకాలం పూర్తిగా మొదలవకముందే వరుణుడు ఈ రేంజ్‌లో ప్రతాపం చూపిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కుండపోతతో దేవభూమి వణికిపోతోంది. ఎక్కడికక్కడ కొండచరియలు విరిగిపడుతున్నాయి. పెద్ద పెద్ద బండరాళ్లు రోడ్డుపై పడుతున్నాయి. దీంతో యాత్రికులు ఆందోళనకు గురవుతున్నారు. భయంతో కేకలు వేస్తూ పరుగులు పెడుతున్నారు. రోడ్డుకు ఇరువైపులా వందలాది వాహనాలు నిలిచిపోయాయి. హైవేను క్లోజ్‌ చేసి అధికారులు శిథిలాలను తొలగిస్తున్నారు.

కొద్దిరోజులుగా ఉత్తరాఖండ్‌ ఎడతెరిపి లేని వానలతో జలదిగ్బంధంలో చిక్కుకుంది. పలు ప్రాంతాలు నీటమునిగాయి. చంపావత్‌, ఉధమ్‌సింగ్‌ నగర్‌ జిల్లాల్లోని పలు గ్రామాల్లో ఎక్కడ చూసినా నీరే కనిపిస్తోంది. అటు చమోలీలోనూ కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియలు విరిగిపడుతుండటంతో పలు రోడ్లను మూసివేశారు. రుద్రప్రయాగ్‌-కేదార్‌నాథ్‌ హైవే కూడా క్లోజ్‌ అయ్యింది. భారీ వర్షంతో పాటు వరదల కారణంగా, ఉత్తరాఖండ్ నుంచి వచ్చే, వెళ్ళే పలు రైళ్ల సర్వీస్‌లను అధికారులు రద్దు చేశారు. పూర్ణగిరి ప్రాంతంలో వరద నీటిలో చిక్కుకున్న 1,821 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరదలతో గల్లంతైన వారిని ఆదుకునేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Also Read:  కర్ణాటకలో ముడా స్కామ్ కలకలం.. సిద్ధరామయ్య భార్యపై కేసు

అటు అస్సాంలో వరదల కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. జులై 9న ఏడుగురు చనిపోయారు. మృతుల్లో నలుగురు చిన్నారులు ఉన్నారు. మే నుంచి జులై 10 వరకు వరదలతో చనిపోయిన వారి సంఖ్య 79కు పెరిగింది. అటు 17.2 లక్షల మంది వరదల బారిన పడ్డారని అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ చెబుతోంది. మరోవైపు అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్క్ ఇటీవలి సంవత్సరాలలో ఎన్నడూ లేని విధంగా వరదలను ఎదుర్కొంటోంది. వరదల కారణంగా ఇటవలీ ఆరు అరుదైన ఖడ్గమృగాలు చనిపోయాయి. మొత్తంగా 130 కంటే ఎక్కువ వన్యప్రాణులు మరణించాయి.

అటు బీహార్‌లోని అనేక జిల్లాల్లో వరదలు మొదలయ్యాయి. నేపాల్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగే ప్రమాదముంది. ఎందుకంటే నేపాల్‌ వర్షాలకు కోసి, గండక్ నీటిమట్టం పెరుగుతోంది. దీంతో వాటిపై నిర్మించిన బ్యారేజీల గేట్లు తెరుచుకుంటున్నాయి. ఇక పలు జిల్లాల్లో వందలాది గ్రామాలు ముంపునకు గురవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. అటు నౌటాన్ బ్లాక్‌లోని సుమారు 200 కుటుంబాలను వరదలు చుట్టుముట్టాయి. దీంతో వారిని సురక్షిత ప్రదేశానికి తీసుకెళ్లడానికి SDRF బృందాలు సాయం చేస్తున్నాయి. ఇటు కర్ణాటకలోని ఉడిపిలో వరదల కారణంగా రోడ్డుపై వాహనాలు కొట్టుకుపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ముంపు గ్రామాలను గుర్తించి శాశ్వత సహాయక చర్యలు చేపట్టాలని సీఎం సిద్ధరామయ్య అధికారులను ఆదేశించారు. ఇలా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఉత్తరాఖండ్, కర్ణాటకతో సహా దేశంలోని అనేక ప్రాంతాల్లో వరదల పరిస్థితి ఏర్పడింది. బ్రహ్మపుత్రతో సహా అనేక ప్రధాన నదులు వేర్వేరు ప్రదేశాలలో ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. దీంతో అనేక దేశంలోని అనేక ప్రాంతాలు బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి నెలకొంది.

Also Read: ఫేక్‌ సర్టిఫికేట్లతో ఏకంగా IAS ఉద్యోగం.. ఎలా దొంగ అధికారి ఎలా దొరికారంటే?

Advertisment
Advertisment
తాజా కథనాలు