ఏపీలో వేడెక్కిన రాజకీయాలు.. ఓట్ల గల్లంతుపై అధికార, విపక్షాల ఆరోపణలు ఆంధ్రప్రదేశ్‌లో నిజంగానే ఓట్లు గల్లంతవుతున్నాయా? ఓట్ల తొలగింపు లక్ష్యంగా అధికార పార్టీ పని చేస్తుందంటున్న టీడీపీ ఆరోపణల్లో నిజం ఎంత? ఓట్ల గల్లంతు రాజకీయం... ఇప్ప్పుడు ఢిల్లీని తాకింది. అధికార, ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు ఈసీకి ఫిర్యాదు చేసుకోవడానికి సిద్ధమయ్యాయి. By BalaMurali Krishna 26 Aug 2023 in గుంటూరు విజయవాడ New Update షేర్ చేయండి వేడెక్కిన ఓట్ల గల్లంతు రాజకీయం.. ఏపీలో ఓట్ల గల్లంతు రాజకీయం వేడెక్కింది. తమ పార్టీ మద్దతుదారుల ఓట్లను వైసీపీ తొలగిస్తుందని.. టీడీపీ ఆరోపణలు చేస్తుంటే.. ఓట్లు గల్లంతు చేసే నీచ రాజకీయం టీడీపీదే అంటూ వైసీపీ విరుచుకుపడుతోంది. ఓట్ల తొలగింపునకు సంబంధించి గత రెండేళ్లుగా టీడీపీ ఆరోపణలు చేస్తూ వస్తుంది. బద్వేల్, తిరుపతి ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లతో వైసీపీ గెలిచిందంటూ ఆరోపణలు చేసింది. అయితే తాజాగా అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో తమ ఓటర్లే లక్ష్యంగా ఓట్ల తొలగింపు కార్యక్రమం జరుగుతుందని ఆరోపిస్తుంది. దాదాపు 60 లక్షలకు పైగా టీడీపీ మద్దతుదారుల ఓట్లను తొలగించేందుకు వైసీపీ ప్లాన్ వేస్తుందని ఆ పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. దొంగ ఓట్లతో వైసీపీ గెలవాలని చూస్తుంది.. ఏపీలో ఓట్ల గల్లంతుకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా సీరియస్ అయింది. బూత్ లెవెల్ ఆఫీసర్స్(BLO)ను ప్రతి మండలానికి పంపి ఓటర్స్ లిస్టు తనిఖీ చేయడంతో పాటు కొత్త ఓట్లకు సంబంధించిన డేటా ఎంట్రీ చేయడం, పాత ఓటర్ల స్థానంలో కొత్త ఓట్లు ఇవ్వడం వంటివి పరిశీలన చేయాలని ఆదేశించింది. చాలా ప్రాంతాల్లో ఒకే ఇంటి పేరు మీద వంద, రెండు వందల ఓట్లు ఉండడం.. చనిపోయిన వ్యక్తుల పేర్లు మీద పదుల సంఖ్యలో ఓట్లు ఉండడంపైనా టీడీపీ అభ్యంతరం చెబుతుంది. రాబోయే ఎన్నికల్లో ఏదో విధంగా గెలవాలని భావించి వైసీపీ ఓట్లు తొలగిస్తుందని.. అందులో భాగంగానే దొంగ ఓట్లను, లేని ఓట్లను సృష్టిస్తుందని ఆరోపణలు చేస్తుంది. మంత్రి మేరుగపై నక్కా ఫిర్యాదు.. వేమూరు నియోజకవర్గంలో టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించాలన్న మంత్రి మేరుగ నాగార్జున వ్యాఖ్యలపై జడ్పీ సీఈఓకు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఫిర్యాదుచేశారు. ఓటర్ల జాబితా రివిజన్ ప్రక్రియలో అధికార పార్టీ జోక్యం పెరిగిందని.. ప్రజలు ఓటు ఉందా? లేదా? అని ప్రతిరోజూ తనిఖీ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆనందబాబు తెలిపారు. ప్రతిపక్ష పార్టీల ఓట్లు తొలగించాలని వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రతి మండలంలో నాలుగైదు వేల ఓట్లు తొలగించాలని మంత్రి చెప్పారని.. ఓట్లు తొలగించాలని ఏకంగా మంత్రి చెప్పడం దారుణమని మండిపడ్డారు. సీఈసీకి ఫిర్యాదుచేయనున్న చంద్రబాబు.. ఏపీలో జరుగుతున్న ఓట్ల గల్లంతు వ్యవహారంపై ఏకంగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకుంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ బాధ్యతగా వ్యవహరించడం లేదని.. ఓట్ల తొలగింపునకు సంబంధించి అనేకసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని... అందులో భాగంగానే సీఈసీకి ఫిర్యాదు చేస్తున్నట్లు ఆ పార్టీ చెబుతుంది. ఇందులో భాగంగా ఈనెల 28న చంద్రబాబుతో పాటు ముఖ్య నేతల బృందం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేయనుంది. వైసీపీ కూడా ఫిర్యాదుకు రెడీ.. మరోవైపు అధికార పార్టీ వైసీపీ కూడా ఓట్ల తొలగింపునకు సంబంధించి ఢిల్లీలో ఉన్న కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవాలని నిర్ణయించుకుంది. విజయ్ సాయిరెడ్డి నేతృత్వంలోని ఎంపీల బృందం సీఈసీని కలవనుంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని ప్రైవేటు సంస్థలతో కలిసి ఓటర్స్ లిస్టులో అవకతవకలకు పాల్పడ్డారని ప్రజల డేటా మొత్తం వాళ్ల హస్తాల్లో పెట్టుకుని ఓట్ల గల్లంతు కార్యక్రమాన్ని చేపట్టారని వైసీపీ నేతలు చెబుతున్నారు. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. చంద్రబాబుకి ఏదో ఒక రాజకీయం కావాలని... అందుకే ఓట్ల తొలగింపు అంటూ ఆరోపణలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు. సేవా మిత్రులంటూ కొంతమందిని తీసుకుని వారి చేత ఓట్ల తొలగింపు కార్యక్రమాన్ని గతంలో చంద్రబాబు చేశారని ఆరోపిస్తున్నారు. దొంగే దొంగ అన్నట్టుగా ఇప్పుడు ఓట్ల గల్లంతంటూ ఢిల్లీ వెళ్లి డ్రామా రాజకీయాలు చేస్తున్నారని మండిపడుతున్నారు వైసీపీపై బీజేపీ తీవ్ర విమర్శలు.. ఇక భారతీయ జనతా పార్టీ కూడా ఏపీలో ఓట్ల గల్లంతుకు సంబంధించి తీవ్రస్థాయిలో అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తుంది. ఓట్ల గల్లంతు చేసి వైసీపీ మరోసారి అధికారం పొందాలని చూస్తుందంటూ పార్టీ అధినేత్రి పురందేశ్వరి కూడా విమర్శలు చేస్తున్నారు. అవసరమైతే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని చెబుతున్నారు. దీంతో ప్రస్తుతం ఏపీ రాజకీయాలు ఓట్ల గల్లంతు అంశం చుట్టూనే తిరుగుతున్నాయి. #ycp #ys-jagan #tdp #chandrababu #bjp #purandeswari #votes #cec మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి